
ప్రత్యక్ష బోధనకు సిద్ధమవుతున్న అంగన్వాడీలు
కొనసాగుతున్న పారిశుధ్య పనులు
కేంద్రాలకు చేరిన మెడికల్ కిట్స్, ఇతర సామగ్రి
జిల్లాలో 1106 కేంద్రాలు.. 63468 మంది పిల్లలు
పత్యక్ష బోధనకు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు సిద్ధమవుతున్నాయి. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి బోధన ప్రారంభించాలని సర్కార్ ఆదేశించడంతో సంబంధిత అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. గదుల శుభ్రం, పరిసరాల్లో కలుపు మొక్కల తొలగింపు, శానిటైజేషన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అదేవిధంగా మెడికల్ కిట్స్, చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అవసరమైన పౌష్టికాహారం ఇతర సామగ్రి అంగన్వాడీ సెంటర్లకు తరలిస్తున్నారు. కాగా, జిల్లాలో 1,106 అంగన్వాడీ కేంద్రాలుండగా.. 63,468 చిన్నారులు ఉన్నారు.
పునఃప్రారంభం దృష్ట్యా పలు కార్యక్రమాలకు శ్రీకారం
తల్లిదండ్రులకు వాట్సాప్ ద్వారా సమాచారం
కేంద్రాలకు చేరిన మెడికల్ కిట్స్, ఇతర సామాగ్రి
జిల్లాలో 1106 కేంద్రాలు.. 63468 మంది పిల్లలు
గర్భిణులు 8701, బాలింతలు 6209 మంది
కేంద్రాల ఖాతాల్లో స్పెషల్ ఫండ్ నుంచి రూ.500 చొప్పున రూ.5,53,000 జమ
వికారాబాద్, ఆగస్టు 28, (నమస్తే తెలంగాణ) : సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలతోపాటు అంగన్వాడీ కేంద్రాలు కూడా పునఃప్రారంభం కానున్నాయి. అంగన్వాడీ టీచర్లు పిల్లలకు ప్రత్యక్ష బోధన చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 26 నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో పలు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వాట్సాప్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడం, తదితర కార్యక్రమాలు చేపడుతున్నారు. కేంద్రాలకు మెడికల్ కిట్స్తోపాటు ఇతర సామగ్రి సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం చిన్నచిన్న సరుకులు సమకూర్చుకోవడం కోసం 1106 కేంద్రాల ఖాతాల్లో స్పెషల్ ఫండ్ నుంచి రూ.500 చొప్పున రూ.5,53,000 జమ కానున్నాయి.
1,106 కేంద్రాలు..
జిల్లాలో ఐదు ప్రాజెక్టులు, 1106 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. మెయిన్ అంగన్వాడీలు 969, మినీ అంగన్వాడీ కేంద్రాలు 137 పనిచేస్తున్నాయి. కేంద్రాల్లో 0-6 నెలల వయసున్న పిల్లలు 6568, 7 నెలల నుంచి మూడేండ్లవారు 34,655, మూడు నుంచి ఆరేండ్లవారు 22,245 మంది ఉన్నారు. మొత్తం 63468 మంది ఉన్నట్లు స్త్రీ, శిశు సంక్షేమ అధికారులు వెల్లడించారు. గర్భిణులు 8701, బాలింతలు 6209 మంది ఉన్నారని పేర్కొన్నారు. అద్దె భవనాల్లో 185 కేంద్రాలు, ఫ్రీ రెంటెడ్ భవనాల్లో 453, సొంత భవనాల్లో 468 అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. మెయిన్ అంగన్వాడీల్లో 937 మంది టీచర్లు ఉండగా.. మినీ అంగన్వాడీల్లో 131 మంది పనిచేస్తున్నారు. 880 మంది ఆయాలు పని చేస్తున్నారు. 554 అంగన్వాడీ కేంద్రాల్లో పెరటి తోటల పెంపకం చేస్తున్నారు.
ఇప్పటి వరకు ఇంటికే సరుకులు
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కేంద్రాలు కొనసాగుతున్నాయి. కరోనా నేపథ్యంలో పిల్లలకు గుడ్లు, పాలు, బాలామృతం, పప్పు, బియ్యం, స్నాక్స్ ఇతరత్రా ఇంటికే సరఫరా చేశారు. బాలింతలు, గర్భిణులకు గుడ్లు, బియ్యం, నూనె, పప్పు, పాలు నెలవారీగా పంపిణీ చేశారు. కాగా వచ్చే నెల 1 నుంచి ప్రత్యక్ష బోధనకు సిద్ధం చేయాలని ప్రభుత్వ ఆదేశాలు రావడంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా వచ్చే నెల ఒకటో తేదీ నాటికి పూర్తిస్థాయిలో సరుకులు కేంద్రాలకు చేరుతాయి. ఆలోపు ఏమైనా సరుకుల కొనుగోలు కోసం కేంద్రాల ఖాతాలో స్పెషల్ ఫండ్ నుంచి రూ.500 జమ చేస్తారు. ఇప్పటికే మెడికల్ కిట్స్, ఇతర సామగ్రి సరఫరా చేశారు.
ప్రత్యేక కార్యక్రమాలు..
ఈ నెల 26 నుంచి గ్రామపంచాయతీ సిబ్బందితో అంగన్వాడీ కేంద్రాల్లో శుభ్రం చేస్తున్నారు.
తల్లిదండ్రులకు వాట్సాప్ ద్వారా అంగన్వాడీల ప్రారంభ సమాచారం అందిస్తున్నారు. స్టాక్ నిల్వలు, కావాల్సిన సరుకుల వివరాలు తెలుపాలి.
ప్రాజెక్టు, సెక్టార్ సమావేశాలు ఏర్పాటు చేసి పిల్లలు కేంద్రాలకు వచ్చే విధంగా చూడాలి.
టీచర్లు ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించాలి.
వచ్చే నెల ఒకటి నుంచి పోషకాహార మాసోత్సవాలు చేపట్టాలి.
అంతకు ముందే పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలను గుర్తించాలి.
కేంద్రాలు ప్రారంభం కాగానే పిల్లలు మాస్క్లు ధరించడం, భౌతిక దూరం పాటించేలా చూడాలి.
ప్రతి రోజు నాలుగు సార్లు సబ్బుతో పిల్లలు చేతులు శుభ్రం చేసుకునేలా చూడాలి.
న్యూట్రీ గార్డెన్స్పై దృష్టి సారించాలి.
ఏర్పాట్లు చేస్తున్నాం
అంగన్వాడీ కేంద్రాలను సిద్ధం చేస్తున్నాం. ప్రత్యేక తరగతుల నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతి కేంద్రం ఖాతాలో స్పెషల్ ఫండ్ నుంచి రూ.500 జమవుతున్నాయి. వచ్చే నెల ఒకటి నుంచి అన్ని కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. కేంద్రాలకు సరుకులు సరఫరా చేస్తున్నాం.
జిల్లాలో అంగన్వాడీల వివరాలు
మొత్తం కేంద్రాలు : 1106
మెయిన్ అంగన్వాడీలు : 969
మినీ కేంద్రాలు : 138
పిల్లలు : 63468
గర్భిణులు : 8701
బాలింతలు : 6209
సొంత భవనాలు : 468
అద్దె భవనాలు : 185
ఫ్రీ రెంటెడ్ భవనాలు : 453
మెయిన్ అంగన్వాడీల్లో టీచర్లు : 937
మినీ అంగన్వాడీల్లో టీచర్లు : 131
ఆయాలు : 880
ప్రతి కేంద్రం ఖాతాలో స్పెషల్ ఫండ్ జమ : 500