
ఆమనగల్లు, ఆగస్టు 27 : మండలంలోని ప్రతి పాఠశాలలో పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వ ఆదేశానుసారం శానిటైజేషన్ పక్రియను పకడ్బందీగా చేపట్టాలని ఎంపీడీవో వెంకట్రాములు ఆదేశించారు. శుక్రవారం మండలంలోని కోనాపుర్ పాఠశాలను ఆయన సందర్శించి పాఠశాల పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పాఠశాలల్లో ప్రతి రోజూ శానిటైజేషన్ పక్రియను పరిశీలించాలన్నారు. తాగు నీటి ట్యాంకులను బ్లీచింగ్ పౌడర్‌తో క్లీన్ చేయాలన్నారు. ఉపాధ్యాయులు తమ పాఠశాలల్లో నిబంధనలకు అనుగుణంగా అన్ని వసతులు ఉన్నాయని పాఠశాలలు ప్రారంభించేందుకు ధ్రువీకరణ పత్రాలను ఎంఈవోకు సమర్పించాలని సూచనలు చేశారు. మండలంలోని చింతలపల్లి పాఠశాలను ఎంఈవో సర్దార్‌నాయక్ సందర్శించి పాఠశాలల పునఃప్రారంభంపై ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. ఉపాధ్యాయులు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు మాస్కు ధరించాలన్నారు. పాఠశాలల్లో విద్య కమిటీలు, ప్రజాప్రతినిధులు, యాక్టివ్ స్టూడెంట్లతో కమిటీలు రోజూ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని మానిటరింగ్ చేయాలన్నారు.
కడ్తాల్, ఆగస్టు 27 : మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలను శుభ్రం చేయించాలని ఎంపీడీవో రామకృష్ణ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని గిరిజన వసతి గృహాన్ని, ప్రభుత్వ పాఠశాలను సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డితో కలిసి ఎంపీడీవో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు పాఠశాలల పరిశుభ్రతపై దృష్టి సారించాలని తెలిపారు. విద్యార్థులకు తాగునీరు, నాణ్యమైన భోజనాన్ని అందించాలని, శానిటైజర్లు, మాస్కులు అందుబాటులో ఉంచి భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని వివరించారు. కార్యక్రమంలో గిరిజన వసతి గృహం వార్డెన్ తిరుపతి, హెచ్ఎంలు విజయ, శ్రీనివాసాచారి, కార్యదర్శి రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు.
యాచారం, ఆగస్టు 27 : పాఠశాలల్లో తరగతి గదులు, ఫర్నిచర్, పరిసరాలు పూర్తి స్థాయిలో శుభ్రం చేయాలని జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ సూచించారు. ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాఠశాలల స్వచ్ఛతకు ప్రాధాన్యతనివ్వాలన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులు, తల్లిదండ్రులకు పాఠశాలల పునఃప్రారంభంపై అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలలను విజయవంతంగా కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
ఇబ్రహీంపట్నంరూరల్, ఆగస్టు 27 : పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించడంపై ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీపీ కృపేశ్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కోఆప్షన్ మెంబర్లు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. ప్రతి తరగతి గది, సైన్స్ ల్యాబ్, లైబ్రరీలు, మరుగుదొడ్లు, మూత్రశాలలు శుభ్రం చేయాలన్నారు. పనులకు మండల పరిషత్ నిధుల నుంచి కేటాయిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో మహేశ్‌బాబు పాల్గొన్నారు.