
రైతులకు విశ్రాంతి గదులు ఏర్పాటుచేసి, భోజన వసతి కల్పించాలి
సీఎం కేసీఆర్ నిర్ణయంతో మహిళలకు పెరిగిన ప్రాధాన్యం
వికారాబాద్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి సబితారెడ్డి
పారిశ్రామిక అభివృద్ధితో మారనున్న వికారాబాద్ రూపురేఖలు
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతులు మారాలి
విస్తృతంగా ఉపాధిఅవకాశాలు :ఎంపీ రంజిత్‌రెడ్డి
రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించి ఆదర్శ మార్కెట్‌గా పేరు తెచ్చుకోవాలని మంత్రి సబితారెడ్డి నూతన కార్యవర్గానికి సూచించారు. వికారాబాద్ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆనంద్‌తో కలిసి మంత్రి సబితారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల కారణంగా మహిళలకు ప్రాధాన్యత పెరిగిందన్నారు. యాభైశాతం మహిళలకు కేటాయించడంతో అనేకమందికి అవకాశం వస్తున్నదన్నారు. రైతులకు విశ్రాంతిగదులు నిర్మించడంతో పాటు భోజన వసతి కూడా కల్పించాలని సూచించారు. రైతుల కోసం ఉచితంగా వైద్య పరీక్షలు కూడా నిర్వహించాలన్నారు. అనంతరం ఎంపీ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు కూడా లాభాలు వచ్చే పంటలు వేయాలన్నారు. వికారాబాద్‌కు మరిన్ని పరిశ్రమలు రానున్నాయని, ఉపాధి అవకాశాలు పెరగనున్నాయని ఆయన తెలిపారు.
వికారాబాద్, ఆగస్టు 26 : వికారాబాద్ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా మహిళకు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతుందని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ పాలక వర్గ నూతన ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డిలు హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ప్రచార రథంపై మంత్రి , ఎంపీ, ఎమ్మెల్యే ఆనంద్, నూతన మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ముద్ద దీప, మున్సిపల్ చైర్పర్సన్ మంజులరమేశ్‌కుమార్ మార్కెట్ కార్యాలయం వరకు ర్యాలీ తీశారు. ముందుగా వికారాబాద్ మార్కెట్ కార్యదర్శి వెంకట్‌రెడ్డి నూతనంగా నియమితులైన చైర్పర్సన్ ముద్ద దీప, వైస్ చైర్మన్ మేక చంద్రశేఖర్‌రెడ్డి, పాలక వర్గం సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలపై గౌరవంతో మార్కెట్ కమిటీలో సీఎం కేసీఆర్ 50 శాతం ప్రాధాన్యత కల్పించారన్నారు. గతంలో వికారాబాద్‌లో ముద్ద వీర మల్లప్ప చేసిన అభివృద్ధిని ఎలా గుర్తుంచుకుంటున్నామో.. అదే విధంగా మార్కెట్ అభివృద్ధికి కృషి చేసి పేరు ప్రతిష్టలు సంపాదించాలన్నారు. రైతులు విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేక గదులను ఏర్పాటు చేస్తే బాగుంటుందని, దూర ప్రాంతాల నుంచి ధాన్యం అమ్ముకునేందుకు వచ్చే రైతులకు ఉచితంగా అన్నం పెడితే బాగుంటుందని పాలక వర్గానికి సూచించారు. రైతులకు ప్రతి నెలా 2వ వారంలో ఉచితంగా వైద్య పరీక్షలు చేసేందుకు ముందుకొచ్చిన డాక్టర్ పవన్‌కుమార్, మరో డాక్టర్ గిరీషలను మంత్రి అభినందించారు. వికారాబాద్‌కు ప్రధానంగా ఉన్న మెడికల్ కళాశాల ఏర్పాటుకు రెండో విడుతలో మంజూరు చేస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. అనంతగిరి టూరిజం ఏర్పాటుకు అందరి సహకారంతో కృషి చేస్తానన్నారు.
ఎంపీ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ రైతులందరూ ఒకే రకం పంటలు పండించకుండా నేల సారాన్ని బట్టి పంటలు పండిస్తే లాభం కలుగుతుందన్నారు. వికారాబాద్ ప్రాంతంలో 300 ఎకరాల్లో ఆటోమొబైల్ కంపెనీల ఏర్పాటుకు స్థలం చూడటం జరిగిందని, దీంతో ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి లభిస్తుందన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ రైతులు దళారుల చేతిలో మోసపోకుండా పాలక వర్గం చూడాలన్నారు. వికారాబాద్‌లో తొలి సారిగా మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మహిళకు ఇవ్వడం చాలా సంతోషకరమన్నారు. మెడికల్ కళాశాల వస్తే అనంతగిరిలో ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రైతులకు సరైన పాలన అందించి పాలక వర్గం కొత్త ఆలోచనతో ముందుకు సాగాలని కోరారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ముద్ద దీప మాట్లాడుతూ వికారాబాద్ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా నియమించినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 1975లో వికారాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ముద్ద వీర మల్లప్ప అనేక కార్యక్రమాలు చేసి, నిరుపేదలను ఆదుకోవడం జరిగిందన్నారు. తాత స్థానంలో అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ జి.నాగేందర్‌గౌడ్, వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, వైస్ చైర్పర్సన్ శంషాద్‌బేగం, మాజీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, పీఏసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, సీనియర్ న్యాయవాది గోవర్ధన్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ హఫీజ్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ నర్సింహులు, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేశ్‌కుమార్, మాజీ జడ్పీటీసీ ముత్తహర్‌షరీఫ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కమాల్‌రెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, డాక్టర్లు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.