
ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌కు రాఖీ కట్టిన జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి l ఆడపడుచుల రాకతో కళకళలాడిన గ్రామాలు
కడ్తాల్, ఆగస్టు 22 : అన్నాచెల్లెల, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి రక్షాబంధన్ ప్రతీకగా నిలుస్తున్నదని జడ్పీ చైర్ పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. మండల కేంద్రంతో పాటు పరిధిలోని ఆయా గ్రామాల్లో ఆదివారం రాఖీ పండుగను ఘనంగా జరుపుకొన్నారు. గాన్గుమార్లతండాలో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌కు జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా ఉదయం నుంచి మండలంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ సంప్రదాయనికి, ఐకమత్యానికి, అన్నా చెల్లెల అనుబంధానికి, రాఖీ ప్రతీకగా నిలుస్తుందని నాయకులు అన్నారు. రాఖీ పండుగ సందర్భంగా రాఖీలు, మిఠాయిల దుకాణాలు కిటకిటలాడాయి. అన్మాస్‌పల్లిలో వృక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీజీఆర్ వ్యవస్థాపకురాలు లీలాలక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో పలువురు చెట్లకు రాఖీలు కట్టారు.
ఆత్మీయతను చాటిన ఆడపడుచులు
ఆమనగల్లు, ఆగస్టు 22 : ఆదివారం రాఖీ వేడుకలు ప్రజలంతా ఘనంగా జరుపుకొన్నారు. పండుగను పురస్కరించుకుని ఆడపడుచులు అన్నదమ్ములకు రాఖీలు కట్టి తమ ఆత్మీయతను చాటుకున్నారు. మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో రాఖీ వేడుకలు కన్నుల పండువగా కొనసాగాయి. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి ఆయన సోదరి యశోదమ్మ, ఎంపీపీ అనిత రాఖీలు కట్టారు. పండుగను పురస్కరించుకుని ఆడపడుచుల రాకలతో ప్రతీ ఇళ్లు బంధుమిత్రులతో కళకళాడాయి. పండుగను పురస్కరించుకుని స్వీట్లు, రాకీ దుకాణాలకు ప్రజలంతా తరలివచ్చి తమకు కావాల్సిన స్వీట్లు, రాఖీలు కొనుగోలు చేశారు.
కిక్కిరిసిపోయిన ఆర్టీసీ బస్సులు
ఇబ్రహీంపట్నం / ఇబ్రహీంపట్నం రూరల్, ఆగస్టు 22 : నియోజకవర్గంలో రాఖీ పండుగ వేడుకలను ఆదివారం ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. రక్షా బంధన్ సందర్భంగా అన్నాతమ్ములకు అక్కాచెల్లెళ్లు రాఖీ కట్టి తమ బంధాన్ని చాటుకున్నారు. ఇబ్రహీంపట్నం, మంచాల యాచారం మండలాల్లోని గ్రామాలకు చేరుకునేందుకు వచ్చిన వారితో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోయాయి. పలువురు ప్రజాప్రతినిధులకు తమ అక్కాచెల్లెలు రాఖీ కట్టారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డికి ఆయన సోదరి రాఖీ కట్టారు. నియోజకవర్గంలో రాఖీ పండుగ సందర్భంగా ఇబ్రహీంపట్నంలో రాఖీల దుకాణాల వద్ద ప్రజలు కిక్కిరిసి పోయారు.