
యాచారం, ఆగస్టు19: మండలంలోని మేడిపల్లి గ్రామం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. నాడు అభివృద్ధిలో అధ్వానంగా ఉన్న మేజర్ పంచాయతీ. నేడు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అంచలంచెలుగా ప్రగతి బాటలో పయనిస్తున్నది. హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ ఏర్పాటులో గ్రామానికి చెందిన రైతులు భూములు కోల్పోవడంతో ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. గ్రామంలో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి చొరవతో ప్రత్యేక నిధులు కేటాయించి గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నారు. దీంతో గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రూ. కోటితో సీసీ రోడ్లు
హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ ఏర్పాటు కోసం గ్రామానికి చెందిన రైతులు భూములు కోల్పోయారు. కాగా గ్రామానికి ప్రత్యేక నిధులు కేటాయించి అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు టీఎస్ఐఐసీ శ్రీకారం చుట్టింది. గ్రామంలో సీసీ రోడ్ల కోసం రూ.కోటి నిధులు కేటాయించింది. గ్రామంలో 2.5 కిలో మీటర్ల సీసీ రోడ్ల నిర్మాణ పనులను సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు. దీంతో గ్రామంలో నూతన సీసీ రోడ్లతో కాలనీలు అద్దంలా మెరుస్తున్నాయి.
ముమ్మరంగా భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు
గ్రామంలో మురుగు కాల్వలతో అధ్వానంగా ఉండేది. వర్షాలు కురిసినప్పుడు మురుగు నీరంతా రోడ్లపైనా, ఇండ్ల మధ్య నుంచి ఏరులా ప్రవహించేది. ఆ సమస్యకు చెక్ పెడుతూ గ్రామంలో భూగర్భ డ్రైనేజీలు నిర్మించారు. దీంతో గ్రామం స్వచ్ఛత దిశగా అడుగులు వేస్తున్నది.
ఇంటికో ఉద్యోగం కోసం ఉచిత శిక్షణ
ఫార్మాసిటీ ఏర్పాటులో భాగంగా భూములు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఉపాధి అవకాశం కోసం 45 రోజుల ఉచిత శిక్షణ ప్రారంభించింది. మొదటి విడుతలో కొంతమందికి టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో తుక్కుగూడలో ఉచిత శిక్షణ నిర్వహిస్తున్నది. దీనికోసం వంద మంది యువత ప్రత్యేక బస్సులో వెళ్లి రోజూ శిక్షణ పొందుతున్నారు.
భూ నిర్వాసితులకు 121 గజాల ప్లాటు
భూములు కోల్పోయిన రైతులకు ఎకరానికి 121 గజాల ప్లాటును ప్రభుత్వం ఇస్తున్నది. ఫార్మా ఏర్పాటుకు భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం అండగా నిలిచింది. కందుకూరు మండలం మీర్ఖాన్పేట సమీపంలో ఇటు శ్రీశైలం, అటు సాగర్ రహదారిని కలుపుతూ వెళ్లే సరిహద్దు ప్రాంతంలో హెచ్ఎండీఏ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. లే-అవుట్ పనులను మంత్రి సబితారెడ్డి ప్రారంభించారు.
డబుల్ రోడ్ల నిర్మాణం
ఫార్మాసిటీ ఏర్పాటుతో లింకు రోడ్లకు మోక్షం లభించనున్నది. నందివనపర్తి నుంచి మేడిపల్లి వరకు, మీర్ఖాన్ పేట నుంచి నజ్దిక్ సింగారం, నందివనపర్తి, మొగుళ్లవంపు గ్రామాల మీదుగా యాచారం వరకు డబుల్ రోడ్లు నిర్మించనున్నారు. నిధులు మంజూరయ్యాయి. రోడ్డు సర్వే పనులు కూడా పూర్తయ్యాయి. డబుల్ రోడ్ల నిర్మాణంతో లింకు రోడ్లకు మహర్దశ పట్టనున్నది.
గ్రామాభివృద్ధికి కృషి
గ్రామాభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నాం. టీఎస్ఐఐసీ సహకారంతో గ్రామంలో రూ.కోటితో రెండున్నర కిలో మీటర్ల సీసీ రోడ్లు వేశాం. మురుగు కాల్వలు లేని కాలనీల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టాం. త్వరలోనే అన్ని పనులను పూర్తి చేస్తాం. ప్రభుత్వ సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో దశలవారీగా అభివృద్ధి చేసి మండలంలోనే ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తాం.
ఫార్మాతో మంచి భవిష్యత్తు
ఫార్మాసిటీ ఏర్పాటుతో ఈ ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. దీనికోసం భూములిచ్చిన మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తాం. ప్రత్యేక నిధులతో సీసీరోడ్లు, భూగర్భ డ్రైనేజీ, మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఇంటికో ఉపాధి అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలి.
భూనిర్వాసితులకు ప్లాట్లు అందజేస్తాం.
ఉపాధి కల్పించడం సంతోషం
టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో ఉపాధి కల్పించడం సంతోషం. ప్రస్తుతం ఉద్యోగం కోసం ఉచిత శిక్షణ పొందుతున్నాం. ప్రభుత్వం ఫార్మా భూబాధితులకు అండగా నిలువడం హర్షణీయం. ఉపాధి కోసం ఉచితంగా ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకుంటా. తగిన ఉపాధి పొంది కుటుంబాన్ని పోషించుకుంటా. మేడిపల్లి అభివృద్ధికి
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భేషుగ్గా ఉన్నాయి.