
ప్రజారోగ్యమే పరమావధిగా తెలంగాణ సర్కార్ ముందుకు సాగుతున్నది. ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం గిరిజనుల ఆరోగ్యం కోసం ‘గిరిపోషణ’ పథకానికి శ్రీకారం చుట్టింది. ‘గిరిపోషణ’ మూడో దశలో భాగంగా వికారాబాద్ జిల్లా ఎంపిక కాగా, త్వరలో కార్యక్రమాన్ని ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు సైతం జారీ అయ్యాయి. ఈ పథకం కింద మహిళలు, బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించనున్నారు. జిల్లాలోని 18 మండలాల్లో 22 తండాలను గుర్తించగా, 2500 మందికి పైగా లబ్ధి చేకూరనున్నది. గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా, డివిజన్, ఐటీడీఏ అధికారులతో సమీక్షలు సైతం నిర్వహించి నివేదికలనూ సిద్ధం చేశారు. స్థానికంగా దొరికే ఆహార పదార్థాలను శుద్ధి చేసి అందించనున్నారు. ఇప్పటికే ‘ఆరోగ్యలక్ష్మి’ పథకంతో నిత్యం 200 మి.లీ పాలు, అంగన్వాడీల్లో పోషకవిలువలున్న ఆహారాన్ని పంపిణీ చేస్తున్నది. జిల్లాలోని ఐదు ప్రాజెక్టుల పరిధిలో ఉన్న గిరిజనులందరికీ పోషకాహారాన్ని అందించాలన్నదే సర్కార్ సదుద్దేశం. పౌష్టికాహార పంపిణీలో దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలుపాలన్నది సీఎం కేసీఆర్ లక్ష్యం.
వికారాబాద్, ఆగస్టు 17, (నమస్తే తెలంగాణ): గిరిజన తెగల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గిరిపోషణ పథకానికి ప్రభుత్వం ఇటీవల శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లాలోని ఆ తెగల చెందిన మహిళలు, బాలింతలు, గర్భిణులకు, పసిపిల్లలకు ఈ పథకం ద్వారా మేలు జరుగనుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నిధులు కేటాయించింది. గిరిపోషణ కార్యక్రమం ద్వారా వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించి జీవన ప్రమాణాలను పెంచాలన్నదే సర్కారు ధ్యేయం. దీని కోసం 18 మండలాల్లో 22 తండాలను గుర్తించారు. దీంతో 2500 మందికి పైగా మేలు జరుగనుంది. పోషకాహారం తయారీ కోసం గ్యాస్ సిలిం డర్లు, ప్రెషర్ కుక్కర్లు, గిన్నెలు, ఆహార పదార్థాలను నిల్వ చేసుకునేందుకు డబ్బాలు ఇవ్వాలని నిర్ణయించారు. గిరిజనులకు పౌష్టికాహారాన్ని అందించే ‘గిరి పోషణ’ మూడోదశ కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లాను ఎంపిక చేశారు. త్వరలో జిల్లాలో ఈ కార్యక్రమం ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాలో ఐదు ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలో 22 ప్రాంతాల్లో గిరిజనులు జీవనం సాగిస్తున్నట్లు జిల్లా యంత్రాంగం గుర్తించింది. కుల్కచర్లలో 12, దోమ 2, ధారూర్ 2, తాండూరు 2, వికారాబాద్ 2, పరిగి 2 చొప్పున గుర్తించారు. జిల్లాలో మొత్తం గిరిజ కుటుంబాలు 683 ఉన్నాయి. 2927 మంది స్త్రీ, పురుషులు ఉన్నారు. మూడు నుంచి ఆరేండ్ల వయస్సు గల పిల్లలు 103 మంది, గర్భిణులు 40, బాలింతలు 32, కిశోరా బాలికలు 198 మంది ఉన్నారు. వీరందరికీ పౌష్టికాహారం అందించనున్నారు. స్థానికంగా దొరికే ఆహారాన్నే శుద్ధి చేసి ట్రైబల్వెల్ఫేర్ ఆధ్వర్యంలో గిరిపోషణ ద్వారా అందించేందుకు శ్రీకారం చుట్టారు. ట్రైబల్వెల్ఫేర్ ఆధ్వర్యంలో నడుస్తున్న చిరు ధాన్యాలకు సంబంధించిన ఫ్యాక్టరీల ద్వారా తయారు చేయించి వారికి అందిం చనున్నారు. గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో జిల్లాలో చేపట్టే ఈ కార్యక్రమాన్నికి జిల్లా అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. ఇప్పటికే ఇరు శాఖలకు సంబంధించి ఉన్నతాధికారులు, జిల్లాస్థాయి, డివిజన్‌స్థాయి అధికారులతో పాటు ఐటీడీఏ అధికా రులతో సమీక్షా సమావేశాలు సైతం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ నిధులపై ఆధార పడకుండా రాష్ట్ర ప్రభుత్వం గిరిజన, మహిళా శిశు సంక్షేమానికి భారీగా నిధులను ఖర్చు చేస్తున్నది. సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన ఆరోగ్యలక్ష్మీ, కేసీఆర్ కిట్ వల్ల బాల బాలికల నిష్పత్తిలో జిల్లా మంచి స్థానంలో ఉన్నది. ఆరోగ్య లక్ష్మీ పథ కం వల్ల గర్భిణులు, బాలింతలకు పోషకాహారలోపం చాలా వరకు తగ్గింది. ఇప్పటికే ఆరోగ్య లక్ష్మీ ద్వారా ప్రతి రోజు 200 మిల్లీ లీటర్ల పాలు,అంగన్వాడీలలో పోషక విలువలున్న భోజనం, బాలామృతం,గుడ్డు,ఐరన్‌మాత్రలు,ఇవ్వడం వల్ల గర్భిణుల, బాలింతల ఆరోగ్య పరిస్థితి మెరుగైంది. అదే విధంగా గర్భిణులు పనిచేయడం వల్ల కడుపు లోఉన్న బిడ్డకు,తల్లికి ప్రమాదమని భావించి ఆరో నెల నుంచి ప్రసవించిన తర్వాత మూడో నెల వరకు నెలకు రూ.2వేల చొప్పున ఆరు నెలల పాటు రూ. 12వేలు ఇస్తున్నారు. దీంతో ఇంటి వద్దే ఉండి మంచి ఆహారం తీసుకుంటున్నారు. .
గిరిపోషణ పథకం ద్వారా జిల్లాలోని ఐదు ప్రాజె క్టుల పరిధిలోని అందరికీ పోషక విలువలు గల ఆహార పదార్థాలు ఇవ్వనున్నాం. గర్భిణులు, బాలింతలు, శిశువులకు ఈ పథకం ఉపయో గ పడనుంది. స్థానికంగా లభ్యమయ్యే ఆహారాన్ని శుద్ధి చేసి వారికి అందించనునున్నాం. జిల్లాలో 2500మందికి పైగా లబ్ధిదారులు ఉన్నారు. 22 తండాల్లోని గిరిజనులకు ఈ పథకం వర్తిస్తుంది.