
జిల్లాలో 7 గిరిజన ఆశ్రమ పాఠశాలలు, 5 ఎస్టీ హాస్టల్ విద్యార్థులకు ప్రయోజనం కరోనా పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర సర్కార్ ఆన్లైన్ విద్యా బోధనకు చర్యలు తీసుకున్నది. అయి తే గిరిజన హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో ఉండి చదువుకుంటున్న తండాల విద్యార్థులకు సెల్ఫోన్లు, టీవీలు అందుబాటులో లేక ఆన్లైన్ తరగతులకు దూరమవుతున్నారు. దీన్ని గుర్తించిన గిరిజన సంక్షేమ శాఖ ‘గిరి దర్శిని’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గిరిజన విద్యార్థుల ఇంటి వద్దకే పోస్టు ద్వారా 3 నుంచి 10వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలు, సులభంగా అర్థమయ్యే రీతిలో తయారు చేసిన ప్రత్యేక స్టడీ మెటీరియల్‌ను పంపిస్తున్నది. వికారాబాద్ జిల్లాలో 7 ఆశ్రమ పాఠశాలలు, 5 ఎస్టీ హాస్టళ్లు ఉండగా, 2800 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతున్నది. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కులకచర్ల, ఆగస్టు 16: రోజూ పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులు చెప్పిన ప్రతి అంశాన్ని తెలుసుకుని జ్ఞాన సముపార్జనకు ప్రత్యక్ష బోధన ఎంతగానో ఉపయోగపడుతుంది. కాని కరోనా పరిస్థితుల్లో 18 నెలల నుంచి విద్యార్థులు ప్రత్యక్ష బోధనకు దూరంగా ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ బోధన అందించేందుకు చర్యలు తీసుకుంటున్నది. దీనికి తోడు గిరిజన సంక్షేమ శాఖ ద్వారా తమ విద్యార్థులు ప్రత్యక్షంగా చదువుకునేందుకు వారి చెంతకే చదువు అనే నినాదాన్ని తీసుకొచ్చింది. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా విద్యార్థుల ఇంటి వద్దనే పుస్తకాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. గిరిజన విద్యార్థులు చదువులో రాణించేందుకు ప్రత్యేక కార్యాచరణ ద్వారా పాఠ్యపుస్తకాలు అందిస్తున్నది. దీంతో రాష్ట్రంలో 22వేల మందికి, వికారాబాద్ జిల్లాలో 2,800 మంది గిరిజన విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది.
ప్రత్యక్ష బోధన లేనికారణంగా గిరిజన విద్యార్థులు ఇండ్ల దగ్గరే ఉంటున్నారు. వీరికి ఎలాగైనా విద్యను అందించేందుకు ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఐటీడీఏ) ఆధ్వర్యంలో పోస్టు ద్వారా వారి ఇండ్లకు పాఠ్యపుస్తకాలు, స్టడీ మెటీరియల్ అందించేందుకు అధికారులు ఏర్పాటుచేశారు. గిరిజన విద్యార్థులు మారుమూల గ్రామాల్లో ఉండడంతో వారు సెల్ఫోన్లో ఆన్లైన్ పాఠాలు వినే పరిస్థితిలో లేని కారణంగా చాలా మంది విద్యార్థులు నష్టపోతున్నారు. ఇది తెలుసుకున్న గిరిజన సంక్షేమ శాఖ ‘గిరిజన దర్శిని అభ్యాసిక’ పేరిట నిష్ణాతులైన ఉపాధ్యాయులతో స్టడీ మెటీరియల్ తయారు చేయించి విద్యార్థుల ఇంటికి పంపించే ప్రక్రియకు ఏర్పాటుచేశారు.
రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 3 నుంచి 10వ తరగతి విద్యార్థులకు గిరిదర్శిని స్టడీమెటీరియల్‌ను పోస్టులో విద్యార్థుల ఇండ్లకు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందులో 5 బ్లూ పెన్నులు, ఒక రెడ్ పెన్, రెండు బ్లాక్ పెన్నులు, రెండు పెన్సిళ్లు, ఎరైజర్, షార్పనర్, స్కేల్, గమ్ బాటిల్, కలర్ పెన్సిల్ ప్యాకెట్‌తో పాటు 3 నుంచి 10వ తరగతి వరకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు ఉన్నాయి.
గిరిజన ఆశ్రమ పాఠశాల, వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థులు పాఠ్యపుస్తకాల్లో తాము 30 రోజుల్లో నేర్చుకున్న అంశాలను వర్క్‌షీట్ ద్వారా పోస్టల్లో సంబంధిత పాఠశాలలకు పంపించాల్సి ఉంటుంది.
వికారాబాద్ జిల్లాలో 12 పాఠశాలల్లో 7 గిరిజన ఆశ్రమ, 5 వసతి గృహాలు ఉన్నాయి. 7 గిరిజన ఆశ్రమ పాఠశాలలు కులకచర్ల మండలం బండవెల్కిచర్లలో బాలికల, రాంపూర్‌లో బాలికల, కులకచర్ల బాలుర, చౌడాపూర్ మండలంలో కొత్తపల్లి బాలుర, మర్పల్లిలో, బొంరాస్‌పేట్‌లో బాలికల, తాండూరులో బాలికల ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. జిల్లాలో 5 గిరిజన వసతిగృహాలు ఉన్నాయి. కులకచర్ల మండలంలో ముజాహిద్పూర్ బాలుర, పరిగిలో బాలుర, వికారాబాద్ బాలుర, కొడంగల్‌లో బాలుర, తాండూరులో బాలుర గిరిజన వసతి గృహాలు ఉన్నాయి.
వికారాబాద్ జిల్లాలో సుమారుగా 2,800 మంది గిరిజన విద్యార్థులకు గిరిదర్శిని ద్వారా ప్రయోజనం చేకూరనున్నది. 12 గిరిజన ఆశ్రమ పాఠశాలు, గిరిజన వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల ఇంటికే పాఠ్యపుస్తకాలు, సామగ్రి పోస్టు ద్వారా అందిస్తున్నారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతంలో గిరిజన పాఠశాలలు, వసతి గృహాల్లోని విద్యార్థులకు మేలు చేకూరనున్నది.
ఐటీడీఏ, గిరిజన సంక్షేమ శాఖ ద్వారా అందిస్తున్న స్టడీ మెటీరియల్‌తో జిల్లాలోని 2800 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుగుతుంది. జిల్లాలో ఎక్కువగా తండాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ స్టడీ మెటీరియల్ విద్యార్థులకు సులువుగా అర్థం చేసుకునేలా రూపొందించారు. ఇది వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. – కోటాజీ, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి, వికారాబాద్ ఇంటికే స్టడీమెటీరియల్.. బాగుంది ప్రస్తుతం విద్యార్థులు పాఠశాలకు వచ్చి చదువుకునే పరిస్థితి లేదు. ఐటీడీఏ, గిరిజన సంక్షేమ శాఖ ద్వారా స్టడీ మెటీరియల్‌ను పోస్టు ద్వారా ఇంటికే పంపించడం బాగుంది. తండాల్లో ఉన్న విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు, టీవీలు లేని కారణంగా ఇది ఉపయోగపడుతుంది. ఈ నిర్ణయం విద్యార్థులకు మేలు చేస్తుంది.