
వికారాబాద్, ఆగస్టు 16, (నమస్తే తెలంగాణ): ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కరించేందుకు ఇక నుంచి ప్రతి సోమవారం ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు ‘డయల్ ఇన్ గ్రీవెన్స్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వికారాబాద్ కలెక్టర్ పౌసుమి బసు తెలిపారు. ఇందుకోసం 08416-256989 అనే ప్రత్యేక ల్యాండ్‌లైన్ నంబర్‌ను కేటాయిచారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అధికారులతో ‘డయల్ ఇన్ గ్రీవెన్స్’ ట్రయల్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ.. ఈ నంబర్‌కు ప్రజలు కాల్ చేసి తమ సమస్యలు తెలిపి పరిష్కారించుకోవాలని ప్రజలను కోరారు. ఇందులో భాగంగా వివిధ సమస్యలపై ప్రజల నుంచి 13 ఫోన్ కాల్స్‌ను స్వీకరించి, సంబంధించిన పెండింగ్ మ్యుటేషన్, డీఎస్ తదితర రైతు బంధు, భూ సమస్యలను ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పరిష్కారిస్తామని సూచించారు. ప్రతి సోమవారం అధికారులందరూ ఉదయం 9.30 గంటలకు ‘డయల్ ఇన్ గ్రీవెన్స్’ కార్యక్రమంలో పాల్గొని శాఖల వారీగా వచ్చే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. మండల స్థాయిలో అధికారులు బాగా పనిచేసి అక్కడిక్కడే సమస్యలను పరిష్కరిస్తే ప్రజలు ఇక్కడి వరకు రారన్నారు. జిల్లాలో డెంగీ, మలేరియా లాంటి సీజనల్ వ్యాధులు పెరగకుండా అన్ని గ్రామాల్లో ప్రతి రోజు పారిశుధ్య పను లు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు మోతీలాల్, చంద్రయ్య, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. అనివార్య కారణాలతో స్వాతం త్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనలేక పోయిన జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, కలెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ సుధకు ప్రశంసా పత్రాలు అందజేశారు.