
కరోనా కట్టడికి రాష్ట్ర సర్కార్ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. గడిచిన నెలలో నిలిచిన ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియను మళ్లీ ప్రారంభించారు. 18 ఏండ్లు పైబడిన వారందరికీ టీకా వేయనున్నారు. వికారాబాద్ జిల్లాలోని 27 కేంద్రాల్లో ఇప్పటి వరకు 1,60,103 మందికి మొదటి, రెండో డోస్ వ్యాక్సిన్ వేశారు. మొదటి డోస్ తీసుకుని 14 నుంచి 16 వారాలైన వారికి రెండో డోస్ వేయనున్నారు. ఒక్కో కేంద్రంలో రోజుకు 150 నుంచి 200 మంది వరకు టీకా వేసేలా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఆన్లైన్ స్లాట్ బుకింగ్ లేకున్నా ఆధార్ కార్డు తీసుకెళ్లి కేంద్రాల వద్ద టీకా తీసుకోవచ్చు. జిల్లాలో ప్రస్తుతం 66 కొవిడ్ యాక్టీవ్ కేసులు ఉన్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు.
వికారాబాద్, ఆగస్టు 14, (నమస్తే తెలంగాణ) : కొవిడ్ నివారణ వ్యాక్సినేషన్ ఫస్ట్ డోస్ మళ్లీ ప్రారంభమైంది. గత నెలలో నిలిచిన వ్యాక్సినేషన్ రెండు రోజుల క్రితం నుంచి తిరిగి ప్రారంభించారు. 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా వేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. దాదాపుగా నెల రోజుల తర్వాత మళ్లీ వికారాబాద్ జిల్లాలో ఫస్ట్ డోస్ వేయనున్నారు. జిల్లాలోని 27 దవాఖానల్లో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఒక్కో కేంద్రంలో రోజుకు 150నుంచి 200 మంది వరకు టీకా వేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇంతకు ముందు కొవిడ్ యాప్‌లో స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉండగా, ప్రస్తుతం నేరుగా వెళ్లి టీకా తీసుకునే అవకాశం కల్పించారు.
జిల్లాలో ఒక జిల్లా దవాఖాన, 23 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వీటిలో 22 పీహెచ్‌సీలు, ఒక పీపీయూ, నాలుగు సీహెచ్‌సీల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇది వరకు ఫస్ట్ డోస్ వేసుకుని 90 రోజుల నుంచి 115 రోజులు వేచి చూసిన వారికి మాత్రమే రెండో డోస్‌ను ఇస్తున్నారు. జిల్లాలో 18 సంవత్సరాలు పైబడిన వారికి టీకాలు వేశారు. రెండు రోజుల క్రితం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రోజుకు ఒక్కో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 150 మందికి మొదటి డోస్, 50 మందికి మాత్రమే రెండో డోస్ వేస్తున్నారు. విదేశాలకు వెళ్లే వారి కోసం ఎంపిక చేసిన కేంద్రాల్లో టీకా తీసుకునే అవకాశం కల్పించారు. ఆదివారం, బుధవారం మినహా మిగిలిన రోజుల్లో ఈ వ్యాక్సిన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతున్నది.
జిల్లాలో ఇప్పటి వరకు లక్షా 60వేల 103 మంది మొదటి, రెండో డోస్ వ్యాక్సినేషన్ తీసుకున్నారు. వీరిలో లక్షా 19వేల 957వేల మంది ఫస్ట్ డోస్ తీసుకోగా, 40వేల 146 మంది సెకండ్ డోస్ తీసుకున్నారు. ప్రభుత్వం, ప్రైవేట్ హెల్త్ వర్కర్లు 4248 మంది ఫస్ట్‌డోస్ తీసుకోగా.., 3891 మంది సెకండ్ డోస్ తీసుకున్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ 4960 మంది ఫస్ట్ డోస్, 2993 మంది సెకండ్ డోస్ తీసుకున్నారు. 60 ఏండ్లు పైబడిన వారు 24,850 మంది ఫస్ట్ డోస్, 12,594 మంది రెండో డోస్ తీసుకున్నారు. 45-59 ఏళ్లు పైబడిన వారు 41,087 మంది ఫస్ట్ డోస్ తీసుకోగా.. సెకండ్ డోస్19,717 మంది ఇచ్చారు. 18-45 వయస్సు వారు మొదటి డోస్ 44812 మంది తీసుకోగా.. రెండో డోస్ 951మంది కొవిషీల్డ్ ఇంజిక్షన్ తీసుకోగా.. 2627 మంది కోవాగ్జిన్ టీకా తీసుకున్నారు. 1438 మంది ఫస్ట్ డోస్ తీసుకోగా.. 1189 మందికి సెకండ్ డోస్ ఇచ్చారు.
జిల్లాలో ప్రస్తుతం 66 కొవిడ్ యాక్టీవ్ కేసులు ఉన్నాయి. 3,35,475 మంది నుంచి నమూనాలు సేకరించారు. జిల్లా వ్యాప్తంగా 27,439 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3,08,036 నెగిటివ్ కేసులు ఉన్నాయి. 26,444 మంది రికవరీ కాగా.. 142 మరణాలు చోటు చేసుకున్నాయి. ప్రతి కేంద్రంలో అరకొరగా కేసులు నమోదవుతున్నాయి. అధికంగా కులకచర్ల, తాండూరు అర్బన్‌లో పరిధిలో చోటుచేసుకుంటున్నాయి.
జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన అందరూ టీకా వేయించుకోవాలి. 22 కేంద్రాల ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఆన్లైన్ స్లాట్ బుకింగ్ లేకున్నా ఆధార్ కార్డు తీసుకువచ్చి కేంద్రాల్లో టీకా తీసుకోవచ్చు. టీకా తీసుకోవడంతో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. ఇప్పటి వరకు జిల్లాలో లక్షా 60 వేల 103 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.
-సుధాకర్ షిండే, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, వికారాబాద్