
ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసేందుకు సర్కారు కృషి తెలంగాణ రైతుల్లో కొండంత భరోసా సీఎం కేసీఆర్ తమ వెంట ఉన్నారనే ధైర్యం వ్యవసాయం పరిశ్రమగా రూపాంతరం చెందాలన్నది సీఎం ఆలోచన
అన్నదాతలకు అదునుకు అందిన పెట్టుబడి సాయం రైతుబీమా ప్రీమియం చెల్లించిన తెలంగాణ ప్రభుత్వం పరిగి వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి సబితారెడ్డి డీసీసీబీ ఆధ్వర్యంలో గోదాముల నిర్మాణం : ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పరిగి మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తా : మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ అంతిగారి సురేందర్పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు పూర్తైతే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు పుష్కలంగా సాగునీరు అందుతుందని, పనుల పూర్తి కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. శనివారం పరిగి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రైతుల్లో కొండంత భరోసా ఏర్పడిందన్నారు. సీఎం కేసీఆర్ తమ వెంట ఉన్నారన్న ధైర్యం ఉన్నదన్నారు. వ్యవసాయం.. పరిశ్రమగా రూపాంతరం చెందాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అన్నారు. అన్నదాతలకు అదునుకు పెట్టుబడి సాయం అందిందన్నారు. ఈసారి రైతుబీమా ప్రీమియాన్ని సైతం చెల్లించిందన్నారు. అనంతరం ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ అంతిగారి సురేందర్ మాట్లాడారు.
పరిగి, ఆగస్టు 14 : రైతులకు సర్కార్ భరోసా కల్పిస్తున్నదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం పరిగి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా అంతిగారి సురేందర్, పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ పండించిన పంటలకు గిట్టుబాటు ధర వస్తుందనే నమ్మకం వారిలో కనిపిస్తుందని చెప్పారు. రైతులను ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకువచ్చేందుకు పలు పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. రైతుబంధు కింద ఎకరాకు రెండు పంటలకు రూ.10వేలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతుబీమా కింద ఈసారి రూ.1,450కోట్ల ప్రీమియం ఎల్ఐసీకి ప్రభుత్వం చెల్లించిందన్నారు. సంవత్సరానికి రూ.10,500కోట్లు ఖర్చు చేసి 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ వ్యవసాయానికి అందిస్తున్నదన్నారు. ఈసారి వ్యవసాయానికి బడ్జెట్లో రూ.25వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈసారి 3కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి పెరిగిందన్నారు. పాలమూర్-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి ఈ ప్రాంతానికి సాగునీరు అందించేందుకు సీఎం కేసీఆర్ నిబద్దతతో కృషి చేస్తున్నారని తెలిపారు. త్వరగా ఈ పథకం పనులు పూర్తి చేసి తమ ప్రాంతానికి సాగునీరు అందించాలని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పలుమార్లు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారని మంత్రి గుర్తు చేశారు.
వ్యవసాయం పరిశ్రమగా రూపాంతరం చెందేలా పలు అంశాలపై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారన్నారు. మూడు దశాబ్దాలుగా పరిగి అభివృద్ధికి మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి విశేష కృషి చేశారని చెప్పారు. ప్రస్తుతం ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి తండ్రి బాటలో నడుస్తూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని మంత్రి అభినందించారు. ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం 8వేల కోట్లు నష్టపోయినా రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులన్నింటినీ కొనుగోలు చేసిందన్నారు. డీసీసీబీ ఆధ్వర్యంలో గోదాముల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. పరిగిలోని మార్కెట్‌యార్డులో మరిన్ని దుకాణాల నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకాల్లోనూ రిజర్వేషన్లు కల్పించి, అన్ని వర్గాలకు అవకాశం ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ అంతిగారి సురేందర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మార్గదర్శకంలో మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ప్రతి రైతుకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారంతోపాటు మార్కెట్లో అన్ని సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఒక దళితుడు మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా పరిగి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా అంతిగారి సురేందర్, వైస్ చైర్మన్‌గా ఎం.డి.సమీర్, డైరెక్టర్లుగా ఆకారపు మాణిక్యం, ఎం.బాబు, జీ.నాగన్న, పి.ప్రభులింగం, సేవ్యానాయక్, డప్పు చంద్రశేఖర్, యు.వెంకటయ్య, ఎస్.బుచ్చిలింగంతో మార్కెట్ కమిటీ కార్యదర్శి సుదర్శన్‌రావు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మార్కెట్ చైర్మన్ సురేందర్, పాలకవర్గ సభ్యులను పలువురు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు కొప్పుల నాగారెడ్డి, బి.హరిప్రియ, మలిపెద్ది మేఘమాల, రాందాస్, శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ కె.అరవిందరావు, అనసూయ, మల్లేశం, సత్యమ్మ, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కొప్పుల అనిల్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, రైతుబంధు సమితి మండలాల కో-ఆర్డినేటర్లు మేడిద రాజేందర్, పీరంపల్లి రాజు, బోయిని లక్ష్మయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, సీనియర్ నాయకులు బి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మీర్ మహమూద్‌అలీ, మాజీ సర్పంచ్ ఎ.విజయమాల, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.