
వికారాబాద్, ఆగస్టు 13 : గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై తెలంగాణ ప్రభుత్వం మరింత శ్రద్ధ వహిస్తున్నది. వారి ఇండ్ల వద్దనే వైద్యం, పౌషికాహారం అందిస్తూ వారిని కంటికి రెప్పలా కాపాడుతున్నది. మహిళలకు మాతృత్వం ఓ వరం. ప్రసవ సమయంలో పౌష్టికాహార లోపంతో తల్లీబిడ్డలు ప్రాణాలు వదిలిన సంఘటనలూ ఉన్నాయి. ఈ తరుణంలో గర్భిణుల ఆరోగ్యంపై మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. కరోనా కారణంగా అంగన్వాడీ కేంద్రాలకు రావడం ఇబ్బందికరంగా మారడంతో అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలతో నేరుగా వారి ఇండ్లకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేస్తున్నారు. అవసరమైన సూచనలు ఇస్తున్నారు. ఆరోగ్యం, పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తునారు. కరోనా బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న గర్భిణుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
గర్భిణులు, బాలింతలు, 0 నుంచి మూడేండ్ల చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. బియ్యం, పప్పు, కోడి గుడ్లు, బాలామృతం, పాలు నేరుగా లబ్ధిదారుల ఇండ్లకే తీసుకెళ్లి అందజేస్తున్నారు. ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నారు. ప్రతి నెలా అవసరమైన వైద్య పరీక్షలు చేయిస్తూ, మందులు అందజేస్తున్నారు. ఆరోగ్యలక్ష్మి పథకం కింద అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారాన్ని పంపిణీ చేస్తున్నారు. ప్రతి నెలా బరువును నమోదు చేసి, ప్రసవ సమయానికి బరువు పెరిగేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రసవ సమయం సమీపిస్తున్న వారిని గుర్తించి సమీపంలోని ప్రభుత్వ దవాఖానకు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు.
వకారాబాద్ జిల్లాలోని ప్రాజెక్టు పరిధిలో 1,106 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన సర్వేలో 8,406 మంది గర్భిణులు, 6,616 మంది బాలింతలు, 42,647 మంది మూడేండ్లలోపు చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు. వీరిపై శిశు, సంక్షేమ, ఆరోగ్య శాఖలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయి. వీరిని ప్రభుత్వ దవాఖానలకు తరలించి సుఖప్రసవాలు జరిగేలా చూస్తున్నారు.
జిల్లాలో గర్భిణులు, బాలింతలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. కొవిడ్ బారిన పడిన వారిని ఆరోగ్యవంతులయ్యేలా వైద్య సేవలందిస్తున్నాం. ఇందులో గ్రామాల వారీగా అంగన్ వాడీ సిబ్బందికి అవగాహన కల్పించి, భాగస్వాములు చేస్తున్నాం. వారు గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఇండ్లకు వెళ్లి పౌష్టికాహారం అందిస్తూ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ జా గ్రత్తలు సూచిస్తున్నాం. ప్రభుత్వం అం దించిన పౌష్టికాహారాన్ని ప్రతి నెలా అందజేస్తూ, వారి యోగ క్షేమాలు తెలుసుకుంటున్నాం. అనారోగ్య సమస్యలు ఉన్నవారిని గుర్తించి వెంటనే దవాఖానలకు తీసుకెళ్లి సరైన వైద్యం చేయించి ఇంటికి తీసుకొస్తున్నాం.