
ప్రధాన రహదారులపై అతివేగంగా వెళ్లే వాహనాల వల్ల ప్రమాదాలు జరిగి కొందరు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు దివ్యాంగులైన సంఘటనలు ఎన్నో చూస్తున్నాం… వింటున్నాం… అయినా కొంతమంది వాహనదారుల్లో మార్పు రావడం లేదు. ఈ అతివేగానికి కళ్లెం వేసేందుకు వికారాబాద్ జిల్లాలోని మన్నెగూడ నుంచి కర్ణాటక సరిహద్దు వరకు నాలుగు పోలీస్స్టేషన్ల పరిధిలో 2019లోనే స్పీడ్‌గన్స్ ఏర్పాటు చేశారు. వేగంగా వెళ్లే వాహనాలపై కేసులు నమోదు చేస్తూ జరిమానాలనూ విధిస్తున్నారు. ఇప్పటివరకు చన్గోముల్, పరిగి, బొంరాస్‌పేట్, కొడంగల్ పోలీస్స్టేషన్ల పరిధిలో మొత్తం 35,249 కేసులు నమోదు కాగా, రూ.3,64,82,715 జరిమానా విధించారు. ఓవర్ స్పీడ్‌కు రూ.1,035 జరిమానా వేస్తున్నారు. ఏదిఏమైనా స్పీడ్‌గన్స్ ఏర్పాటుతో కొంతవరకైనా వాహనాల వేగం తగ్గుతుండడం గమనార్హం.
వాహనాల వేగం అదుపుకోసమే..
రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం అతివేగం. జాతీయ రహదారిపై స్పీడ్‌గన్స్‌తో వాహనాల వేగానికి కళ్లెం పడుతుంది. జాతీయ రహదారిపై అతివేగంగా వాహనాలు దూసుకెళ్తే స్పీడ్‌గన్స్ ఫొటో క్యాప్చర్ చేసి, వాహనం యజమానికి జరిమానా విధిస్తారు. ఒకసారి ఓవర్ స్పీడ్‌కు రూ.1,030 జరిమానా ఉంటుంది. దీంతో వాహనదారులు కొంతమేరకు వేగం తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.
జిల్లాలో 35,249 కేసులు
వికారాబాద్ జిల్లాలోని మన్నెగూడ నుంచి కర్నాటక సరిహద్దు వరకు నాలుగు పోలీస్స్టేషన్ల పరిధిలో స్పీడ్‌గన్స్ ఏర్పాటు చేశారు. మన్నెగూడలోని చన్గోముల్, పరిగి, బొంరాస్‌పేట్, కొడంగల్ పోలీస్స్టేషన్ల పరిధిలో స్పీడ్గన్లు ఏర్పాటు చేశారు. దీంతో అతివేగంగా వెళ్తున్న వాహనాలపై కేసులు నమోదు చేస్తున్నారు. భారీగానే ఫైన్లు వేస్తున్నారు. ఈ సందర్భంగా 2019 నుంచి ఇప్పటివరకు చన్గోముల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 5,506 కేసులు, పరిగిలో 11,917 కేసులు, బొంరాస్‌పేట్‌లో 10,640 కేసులు, కొడంగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 7,186 కేసులు, మొత్తం 35,249 కేసులు నమోదు చేశారు. జిల్లా పరిధిలోని నాలుగు పోలీస్స్టేషన్లలో నమోదైన 35,249 కేసులకు సంబంధించి ఇప్పటివరకు రూ.3,64,82,715 జరిమానా విధించారు. ఒకసారి ఓవర్ స్పీడ్‌కు రూ.1,035 చొప్పున జరిమానా విధిస్తారు.
అతివేగానికి జరిమానా తథ్యం
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ పలుమార్లు కేంద్ర ప్రభుత్వంతో జాతీయ రహదారుల నిర్మాణంపై పలు దఫాలుగా చర్చించి జాతీయ రహదారిని మంజూరు చేయించారు. ఈ మేరకు మన్నెగూడ నుంచి కర్ణాటకలోని జాతీయ రహదారి వరకు సుమారు రూ.350 కోట్లు పైచిలుకు ఖర్చు చేసి రోడ్డు నిర్మించారు. దీంతో ఈ రహదారిపై వాహనాల సంఖ్యతోపాటు వాటి వేగం పెరిగింది. వాహనాల ఓవర్ స్పీడ్‌కు కళ్లెం వేసేందుకు 2019 జనవరిలో స్పీడ్‌గన్స్ ఏర్పాటు చేశారు.
నాలుగు పోలీస్స్టేషన్ల పరిధిలో స్పీడ్‌గన్స్
నాలుగు పోలీస్స్టేషన్ల పరిధిలో రోడ్డు పక్కనే స్పీడ్‌గన్స్ ఏర్పాటుచేశారు. ఆ ప్రాంతంలో అతివేగంగా వాహనం వెళ్లిందంటే చాలు ఫొటో తీస్తారు. ఆ వెంటనే ఆన్లైన్లో ఫీడ్ చేసి, సంబంధిత వాహన యజమానికి జరిమానా వేస్తారు. దీంతో ఆ వాహనాల యజమానులు జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. వాహనాలు నడిపేవారు ఏమాత్రం ఆలోచించకుండా వేగంగా వెళ్లారంటే ఇక జరిమానా తప్పదు. ఇలా స్పీడ్‌గన్స్ ఏర్పాటు చేసి జాతీయ రహదారిపై వాహనాల అతివేగానికి కొంత కళ్లెం వేసే ప్రయత్నం చేస్తున్నారు.
అతివేగం ఆనందాన్ని ఇస్తుంది.. కానీ దానికి తోడు అప్రమత్తంగా లేకపోతే ప్రాణాలు తీస్తుంది.. వాహనం ఏదైనా సరే రోడ్డు విశాలంగా కనిపిస్తే చాలు వేగంగా దూసుకెళ్లడం చాలామందికి అలవాటు. అందుకే అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక ప్రధాన రహదారులపై వేగంగా వాహనాలు వెళ్తుంటాయి. నిర్దేశించిన వేగంలోనే ప్రయణించాలి. కానీ యువత థ్రిల్ కోసం జాతీయ రహదారిపై అతివేగంగా దూసుకుపోతుంటారు. కొన్ని సందర్భాల్లో వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాల బారిన పడుతుంటారు. ప్రాణాలు కోల్పోతున్నారు. చాలామంది క్షతగాత్రులవుతుంటారు. దీంతో వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు జాతీయ రహదారుల్లో వేగాన్ని నియంత్రించేందుకు ఈ స్పీడ్‌గన్స్ ఏర్పాటు చేస్తున్నారు. వీటితో అతివేగంగా వెళ్లే వాహనం స్పీడ్‌ను సూచిస్తూ, ఆ యజమానిపై మొదటి సారి అయితే రూ.1035 ఫైన్ వేస్తారు. అలాగైనా తమ వేగాన్ని తగ్గించుకుంటారని పోలీసుల నమ్మకం.