
తాండూరు రూరల్, ఆగస్టు 12 : పర్యావరణ పరిరక్షణ కోసం విరివిగా మొక్కలు నాటి, సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా ఎస్పీ నారాయణ అన్నారు. గురువారం తాండూరు మండలం, మల్కాపూర్ గ్రామ పరిధిలోని ఐసీఎల్ సిమెంట్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫ్యాక్టరీ పరిధిలోని భూమిలో పోలీసు, ఐసీఎల్ సిబ్బంది 300 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఫ్యాక్టరీలున్న ప్రాంతాల్లో అధిక మొత్తంలో మొక్కలు నాటి రక్షించాలని సూచించారు. వాతావరణం సమతుల్యానికి, కాలుష్య నివారణ కోసం మొక్కలు నాటాలన్నారు. ఐసీఎల్ ఫ్యాక్టరీ పరిధిలో మొక్కలు నాటడం అభినందనీయమన్నారు. జిల్లాలోని పోలీసు స్టేషన్ల పరిధిలోని ఎస్సై, సీఐలు ప్రభుత్వ భూముల్లోగానీ, ప్రైవేట్ స్థలాలను గుర్తించి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని సూచించారు.
ఐసీఎల్ ప్లాంట్ హెడ్ దినేష్ మంగళ్ మాట్లాడుతూ.. హరితహారంలో భాగంగా ఫ్యాక్టరీ పరిధితోపాటు చుట్టు పక్కలప్రాంతాల్లో మొక్కలు నాటి, సంరక్షణకు కృషి చేస్తామని తెలిపారు. నాటిన మొక్కల చుట్టూ కంచె ఏర్పాటు చేస్తామని తెలిపారు. అడిషనల్ ఎస్పీ రశీద్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అడవుల శాతం పెరిగితే ప్లాస్టిక్ వాడకం కూడా తగ్గిపోతుందన్నారు. భూమిపై ప్లాస్టిక్ వాడం ఎక్కువైందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో తాండూరు డీస్పీ లక్ష్మీనారాయణ, సీఐలు జలంధర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, ఐసీఎల్ జాయింట్ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్) మోజెస్, చీఫ్ సెక్యూరిటీ అధికారి సదానిరంజన్, కరణ్‌కోట, పెద్దేముల్, బషీరాబాద్, తాండూరు, యాలాల, ఎస్సైలు ఏడుకొండలు, గఫార్, చరణ్‌రెడ్డి, గిరి, వెంకటప్ప, పోలీసు సిబ్బంది ఉన్నారు.
మొక్కలు నాటిన పోలీసు, ఐసీఎల్ సిబ్బంది
అనంతరం తాండూరు, కరణ్‌కోట, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల నుంచి విచ్చేసిన పోలీసు సిబ్బందితోపాటు ఐసీఎల్ సిబ్బంది ఫ్యాక్టరీ పరిధిలోని భూమిలో మొక్కలు నాటారు. మొక్కలను నాటి, సంరక్షిస్తామంటూ ఎస్పీతోపాటు పోలీసు, ఐసీఎల్ సిబ్బంది ప్రతిజ చేశారు.