
కొత్తూరు, సెప్టెంబర్ 11: రోజురోజుకు అడవులు అంతరించి పోతున్న తరుణంలో ప్రతి గ్రామానికి ఒక వనాన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా శ్రీకారం చుట్టారు. దీంతో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో అంటే 19,472 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. ఈ ప్రకృతి వనాల్లో భారీగా మొక్కలు పెంచడంతో విజయవంతమైంది. దీంతో మండలానికి ఒక బృహత్ ప్రకృతి వనం ఏర్పా టు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఈ బృహత్ ప్రకృతి వనాల ఏర్పాటు శరవేగంగా జరుగుతున్నది.
నియోజకవర్గంలో 5 వనాలు
షాద్‌నగర్ నియోజకవర్గంలో 5 బృహత్ ప్రకృతి వనా లు ఏర్పాటు చేస్తున్నారు. కొత్తూరు మండలంలోని సిద్ధాపూర్లో 10 ఎకరాల్లో, నందిగామ మండలం చేగూర్‌లో 8 ఎకరాల్లో, ఫరూఖ్‌నగర్ మండలంలోని చౌలపల్లిలో 10 ఎకరాల్లో, చౌదర్‌గూడ మండలంలో 10 ఎకరాల్లో, కొందుర్గు మండలంలో 10 ఎకరాల్లో
బృహత్ ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నారు. చేగూరులో సీఎస్ సోమేశ్‌కుమార్ ఈ మధ్యనే ప్రారంభించారు.
యజ్ఞంలా మొక్కలు నాటే కార్యక్రమం
నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న బృహత్ ప్రకృతి వనాల్లో మొక్కలు నాటే కార్యక్రమం యజ్ఞంలా కొనసాగుతున్నది. కొత్తూరు మండంలోని సిద్ధాపూర్లో మొత్తం 31,000 మొక్కలు నాటనున్నారు. నందిగామ మండలంలోని చేగూర్ బృహత్ ప్రకృతి వనంలో ఇప్పటి వరకు 11,500 మొక్కలు నాటారు. ఫరూఖ్‌నగర్ మండలంలోని చౌలపల్లిలో 3100 మొక్కల్లో ఇప్పటి వరకు 2,800 నాటారు. చౌదరిగూడ మండంలోని తూంపల్లిలో 23,000 వేలతో మొక్కలతో బృహ త్ ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కొందుర్గు మండలం కేంద్రంలో 31,000 మొక్కలతో బృహత్ ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేస్తున్నారు, ఇందులో ఇప్పటి వరకు యాభై శాతం మొక్కలు నాటారు. మిగితా పనులు జోరుగా కొనసాగుతున్నాయి.
వీలైనంత త్వరలో పూర్తిచేస్తాం
కొత్తూరు మండలంలోని సిద్ధాపూర్లో 10 ఎకరాల్లో ప్రకృతి వనం ఏర్పాటు చేస్తున్నాం. సిద్ధాపూర్‌లోని ప్రభుత్వ స్థలాన్ని చదును చేయడానికి సమయం పట్టింది. ఇప్పటి వరకు 1,850 మొక్కలు నాటాం. ఇంకా చాలా మొక్కలు నాటాల్సి ఉంది. యుద్ధప్రాతిపదికన మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాం. వీలైనంత త్వరగా టార్గెట్ పూర్తి చేస్తాం.