
వికారాబాద్, సెప్టెంబర్ 11 : జాతీయ మెగా లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ 12వ అదనపు న్యాయమూర్తి వై.పద్మ తెలిపారు. శనివారం వికారాబాద్ కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ నిర్వహించగా, పలు రకాల కేసులను పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా ఇరువురికి సమాన న్యాయం జరుగుతుందన్నారు. చిన్న చిన్న తగాదాలతో కేసులు పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారు సమయాన్ని వృథా చేసుకోకుండా లోక్ అదాలత్ ద్వారా రాజీపడే అవకాశం ఉందన్నారు. కోర్ట్ కేసులు, భూములకు సంబంధించి, క్రిమినల్, కుటుంబానికి సంబంధించిన కేసులు లాంటి పలు రకాల కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు. జాతీయ లోక్ అదాలత్‌లో మొత్తం 90 కేసులు రాజీపడినట్లు 12వ అదనపు న్యాయమూర్తి తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగరాజు, జనరల్ సెక్రెటరీ రమేశ్ ముదిరాజ్, వైస్ ప్రెసిడెంట్ రమేశ్‌గౌడ్, న్యాయవాదులు, పోలీసులు పాల్గొన్నారు.
పరిగి కోర్టులో 478 కేసులు పరిష్కారం
పరిగి, సెప్టెంబర్ 11 : పరిగి కోర్టులో శనివారం నిర్వహించిన మెగా లోక్‌అదాలత్‌లో మొత్తం 478 కేసులు పరిష్కరించారు. పరిగి జూనియర్ సివిల్ జడ్జి ఇ.భారతి ఆధ్వర్యంలో మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా క్రిమినల్ కేసులు 121, సివిల్ కేసులు 3, లాక్డౌన్ కేసులు 229, బ్యాంకు కేసులు 12, ఎక్సైజ్ కేసులు 113 పరిష్కరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాముయాదవ్, ఏజీపీ బాలముకుందం, ప్రధాన కార్యదర్శి గౌస్‌పాషా, న్యాయవాదులు లింగం, నరేందర్‌యాదవ్, శ్రీనివాస్‌రెడ్డి, జయలక్ష్మి, దామోదర్‌రెడ్డి, ఆనంద్‌గౌడ్, వెంకట్రాములు, నరసింహారావు, కైసర్‌పాషా, శివారెడ్డి, విజయ్, కోర్టు సూపరింటెండెంట్ రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
లోక్ అదాలత్‌లో 160 కేసులు పరిష్కారం
చేవెళ్లటౌన్, సెప్టెంబర్ 11 : కక్షిదారులు కేసులను రాజీ కుదుర్చుకునేందుకు లోక్ అదాలత్ ఎంతో ఉపయోగపడుతుందని చేవెళ్ల మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి స్వాతీమురారి తెలిపారు. జాతీయ న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశం మేరకు శనివారం చేవెళ్ల కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ..చిన్న చిన్న కారణాలతో కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి సమయం వృథా చేసుకోవద్దన్నారు. అర్జిదారులు, కక్షిదారులు పరస్పర అవగాహనతో కేసులు రాజీ చేసుకుంటే లోక్ అదాలత్‌లో పరిష్కరిస్తుందన్నారు. లోక్ అదాలత్‌లో కొట్టివేసిన కేసులు పై కోర్టులో అప్పీలు చేయడానికి వీలుండదన్నారు. చేవెళ్ల 44, శంకర్పల్లి 65, షాబాద్ 42, బ్యాంక్ కేసులు 1, సివిల్ కేసులు 3, ఎన్ఐ ఏసీటీ 3, ఎక్సైజ్ శాఖ కేసులు 3, మొత్తం 160 కేసులను లోక్ అదాలత్ పరిష్కరించిందని వివరించారు.