
మండల పరిధిలోని తీగాపూర్ అభివృద్ధికి కేరాఫ్‌గా మారింది. గ్రామం జనాభా 1457. గ్రామంలోని ఇండ్ల సంఖ్య 400 వరకు ఉంటుంది. ఇక గ్రామంలో రూ.3,98,892 వెచ్చించి ఊర్లోని రోడ్లన్నింటిని సీసీలుగా మార్చారు. రూ.44 వేలతో ఊర్లో చెత్త కుండీలను ఏర్పాటు చేశారు. అంతర్గత కాలువల నిర్మాణాలు, మరమ్మతుల కోసం రూ.26,48,413 ఖర్చు చేశారు. గ్రామంలో వైకుంఠధామాన్ని నిర్మించి వాడుకలోకి తెచ్చారు.
తీగాపూర్ గ్రామంలో పచ్చదనానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. గ్రామంలో ఒక నర్సరీని ఏర్పాటు చేశారు. ఊర్లోని రోడ్ల పక్కన, ఖాళీ ప్రదేశాల్లో 1500 మొక్కలు నాటారు. గ్రామంలో రెండు పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. తీగాపూర్లోని ఓ వెంచర్లో 10 శాతం భూమిలో ఒకటి, ఫాతిమాపూర్లో మరో పల్లెప్రకృతి వనాన్ని నెలకొల్పారు. గ్రామంలోని ప్రతి మొక్కకు ట్రీ గార్డులను ఏర్పాటు చేశారు.
ప్రతిరోజూ మిషన్ భగీరథ నీరు
మూడు మిషన్ భగీరథ వాటర్ ట్యాంకుల ద్వారా 400 ఇండ్లకు ప్రతిరోజూ సరిపడ తాగునీటిని అందిస్తున్నారు. తాగునీటి పైప్‌లైన్ ఏర్పాటు, మరమ్మతుల కోసం రూ.4,05,229 వెచ్చించారు. గతంలో గ్రామం చుట్టుపక్కల పరిశ్రమలు ఉండడంతో గ్రామంలో ఎక్కడ బోరు వేసినా కలుషిత నీరు వచ్చేది. దీంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు గ్రామస్తులు. కానీ నేడు మిషన్ భగీరథ నీటితో ఆ సమస్య తీరిపోయింది.
పరిశుభ్రతకు ప్రాధాన్యం
గ్రామంలో పల్లెప్రగతిలో భాగంగా ఒక ట్రాక్టర్, ఒక ట్రాలీ కొనుగోలు చేశారు. దీంతో గ్రామంలో ప్రతి రోజూ ఊరంతా తిరిగి చెత్తను సేకరిస్తున్నారు మున్సిపాలిటీ సిబ్బంది. సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. అంతే కాకుండా రోడ్లను కూడా ప్రతి రోజూ శుభ్రపరుస్తున్నారు.
ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి – రమాదేవి, సర్పంచ్, తీగాపూర్
ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సహకారంతో గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నాం. గ్రామానికి అవసరమైన నిధులు అందుతున్నాయి. ప్రతిరోజూ కావాల్సినంత మిషన్ భగీరథ నీటిని అందిస్తున్నాం. పంచాయతీ కార్యాలయం వద్ద వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేశాం. రోడ్లన్నింటిని సీసీలుగా మార్చాం. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలను ఏర్పాటు చేశాం. పచ్చదనానికి, శుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం.
అన్ని సౌకర్యాలు కల్పించారు : బాలకృష్ణ, గ్రామస్తుడు
గ్రామస్తులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించారు. ముఖ్యంగా తాగునీటికి ఇబ్బందులు లేకుండా చేశారు. గ్రామంలో ఎక్కడ చూసినా పచ్చదనమే. రోడ్ల వెంబడి, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి వాటికి ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేశారు. చెత్త సేకరణతో గ్రామాన్ని శుభ్రంగా ఉంచుతున్నారు.