
తాండూరు రూరల్, ఆగస్టు 10 : జిల్లాలో హరితహారం లక్ష్యం 75శాతం పూర్తయ్యిందని డీఆర్డీవో కృష్ణన్ అన్నారు. మంగళవారం తాండూరు మండలం ఖాంజాపూర్లోని వ్యవసాయ మార్కెటింగ్ గోదాంలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దసరా పండుగ ప్రభుత్వం అందించే బతుకమ్మ చీరలను భద్ర పరిచేందుకు గోదాంలను పరిశీలించినట్లు తెలిపారు. జిల్లాకు 3 లక్షల 38 వేల చీరలు రావాల్సి ఉందన్నారు. పరిగి, వికారాబాద్, తాండూరులో గోదాంలను పరిశీలించామని, త్వరలోనే కలెక్టర్కు నివేదిక అందజేస్తామన్నారు. జిల్లాలోని 19 మండలాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలని సంకల్పించామన్నారు. పరిగి, దోమ, బంట్వారం, కులకచర్ల, కొడంగల్, చౌడాపూర్ మండలాల్లో ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేవని తెలిపారు. మిగతా 13 మండలాల్లో స్థల సేకరణ పూర్తయిందన్నారు. జిల్లాలోని ప్రధాన రహదారులు, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రోడ్ల వారీగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. సుమారు 300 కిలో మీటర్ల టార్గెట్ పెట్టుకున్నామన్నారు.
ఉపాధి హామీ పథకంలో 100 రోజుల పనిదినాలు పూర్తి చేసుకున్న యువతి, యువకులకు కంప్యూటర్లో శిక్షణ ఇచ్చేందుకు ‘ఉన్నతి ’ పేరిట కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. పదోతరగతి పాసై 18 ఏండ్లు నిండిన వారు ఆయా మండలాల్లోని ఎంపీడీవోలకు దరఖాస్తు చేసుకుంటే శిక్షణ ఇప్పిస్తామని స్పష్టం చేశారు. శిక్షణ సమయంలో ఉచిత భోజనం, వసతితోపాటు రోజుకు రూ.237 నగదు ప్రోత్సాహం అందజేస్తామన్నారు. శివారెడ్డిపేటలో శిక్షణ ఉంటుందని తెలిపారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ బాలికలకు అప్పరెల్ శిక్షణ ఇప్పిస్తామన్నారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.