
కొడంగల్, సెప్టెంబర్ 9 : తన ప్రతిభ, ఆలోచనలతో నూతన ఆవిష్కరణలు చేస్తూ అబ్బురపరుస్తున్నాడు కొడంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్ మండలంలోని గాకాఫసల్వాద్ విద్యార్థి అశోక్. తల్లిదండ్రులు రాందాస్, భీమమ్మ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అశోక్ దౌల్తాబాద్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు చదువుకుని, ఆ తరువాత అదే గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేరాడు. చదువుల్లో రాణిస్తూ నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాడు. గైడ్ టీచర్ శాంత్‌కుమార్ ప్రోత్సాహాన్ని అందించడంతో రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి ఇన్స్పైర్ పోటీల్లో విజేతగా నిలిచాడు.
పరికరంతో పనులు..
అశోక్ తయారు చేసిన పరికరంతో ఎవరి సహాయం లేకుండా ఒక్కరే ఆయా పనులు నిర్వహించుకునే విధంగా ఈ పరికరం ఉపయోగకరంగా ఉంటుంది. సీలింగ్ ఫ్యాన్లు బిగించడం ఒక్కటే కాదని, సీలింగ్, ఎత్తు గోడలకు సిమెంటు చేయడానికి ఇతరత్రా బరువులు మోసేందుకు, గోడల రంగులు వేసుకోవడానికి వీలుగా, ఎలక్ట్రికల్, ప్లంబర్ వంటి పనులు కూడా నిర్వహించుకునేలా ఉంటుందని తెలిపారు. పరికరం భాగాలను విడిగా చేస్తే ఫ్రిజ్‌ను ఏర్పాటు చేసుకునే స్టాండ్, పలు విధాలుగా వాడుకోవచ్చని పేర్కొన్నారు. పరికరాన్ని ఇనుప రాడ్స్‌తో తయారు చేయగా, క్యారీ చేసేందుకు కూడా చాలా సులువుగా ఉంటుందని తెలిపారు.
రాష్ట్ర, జాతీయస్థాయిలో..
ఈ విద్యా సంవత్సరంలోని ఫిబ్రవరి మాసంలో ఆన్లైన్ ద్వారా నిర్వహించిన రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ పోటీల్లో ఇదే పరికరాన్ని ప్రదర్శించి అందరినీ అబ్బుర పరిచి జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. అదేవిధంగా ఈ నెల 4 నుంచి 7వ తేదీ వరకు ఆల్‌లైన్ వేదికగా జాతీయ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. 8వ తేదీ కేంద్ర శాస్త్ర సాంకేతిక, ఎర్త్‌సైన్స్ మంత్రివర్యులు జితేంద్రసింగ్ ఆధ్వర్యంలో ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ పోటీలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల నుంచి మొత్తం 1000 మంది విద్యార్థులు పాల్గొనగా, రాష్ట్రం నుంచి 33 మంది విద్యార్థులు పాల్గొన్నారు. దౌల్తాబాద్ మండలంలోని గోకాఫసల్వాద్కు చెందిన దాసరి అశోక్ ఈ పోటీల్లో పాల్గొని తాను తయారు చేసిన సీలింగ్ఫ్యాన్ లిఫ్టింగ్ పరికరాన్ని పోటీల్లో ప్రదర్శించాడు. ఈ ప్రదర్శన జాతీయ స్థాయిలో 3వ స్థానంలో నిలిచింది. దీంతో విద్యార్థిని ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులతో పాటు తల్లిదండ్రులు అభినందించారు. ఉత్తమ ప్రదర్శనకు విద్యార్థి పతకంతో పాటు రాష్ట్రపతి పురస్కారాన్ని అందుకున్నాడు. త్వరలో జపాన్‌లో జరిగే అంతర్జాతీయ సైన్స్‌ఫెయిర్ పోటీల ఎంపికకు అవకాశం ఉందని ఉపాధ్యాయులు తెలిపారు. విద్యార్థి ప్రతిభకు గురువారం పాఠశాల ఆవరణలో సమావేశాన్ని ఏర్పాటు చేసి సర్పంచ్, పాఠశాల చైర్మన్‌తో పాటు ఉపాధ్యాయులు, గ్రామస్తులు విద్యార్థిని సన్మానించారు.
జవాన్‌గా దేశ సేవ చేస్తా
దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పం చిన్న నాటి నుంచి ఉంది. దేశం మనకేమిచ్చింది అని అనుకోకుండా దేశానికి మనం ఏమి చేశామనేది గుర్తించడం ముఖ్యం. ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలనే కోరిక ఉంది.