
పర్యావరణ హితమే తమ అభిమతమని చాటి చెబుతూ మట్టి గణపయ్యలకే జై కొడుతున్నారు జనం. ప్లాస్టర్‌ఆఫ్ పారిస్‌తో తయారుచేసే విగ్రహాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ వేత్తలు, అధికారులు చేస్తున్న ప్రచారం ఫలిస్తున్నది. పలు సంస్థలు, ట్రస్టులు, సంఘాలు ఉచితంగా మట్టిగణపతులను పంపిణీ చేసూ ్త ప్రోత్సహిస్తున్నారు. దీంతో పర్యావరణంపై అవగాహన పెరగడంతో ప్రజలంతా మట్టి వినాయకులకే మొగ్గు చూపుతున్నారు.
ఆమనగల్లు/కులకచర్ల, సెప్టెంబర్9: పల్లెలు, పట్టణాలకు గణేశ్ నవరాత్రోత్సవాల శోభ వచ్చింది. కరోనా కారణంగా ప్రజల్లో పర్యావరణంపై అవగాహన పెరిగింది. స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ వేత్తలు, వివిధ శాఖల అధికారులు మట్టి గణపతుల వల్ల కలిగే ప్రయోజనాలు వివరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసిన విగ్రహాలను కొనేందుకు ఆసక్తి కనబరుస్తలేరు. ఇండ్లు, కాలనీల్లో ఏర్పాటు చేసిన మండపాల్లో మట్టి గణపతులను ప్రతిష్ఠించేందుకే మొగ్గు చూపుతున్నారు. ఆమనగల్లు బ్లాక్ మండలాల్లో పలువురు వ్యాపారులు మట్టి గణపతులు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. మట్టి గణపతుల సైజ్, ఆకారాన్ని బట్టి ధరను నిర్ణయిస్తున్నారు. రూ.10 నుంచి మొదలుకొని పదివేల వరకు విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి.
ఉచితంగా పంపిణీ చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు
పర్యావరణ హితాన్ని ఆకాంక్షించే స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణవేత్తలు ప్రజలకు ఉచితంగా మట్టి గణపతులు పంపిణీ చేస్తున్నారు. లయన్స్‌క్లబ్, వివిధ శాఖల అధికారులు ప్రతియేటా మట్టి గణపతులను పండుగకు ముందు ప్రజలకు అందజేస్తున్నారు. ఈ ప్రతిమలను ప్రత్యేక కూడళ్ల వద్ద స్టాళ్లను ఏర్పాటు చేసి ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. ప్రజల ఆసక్తిని గమనించి కొందరూ నిర్వాహకులు మట్టి గణపతులనే విక్రయించేందుకు ముందుకొస్తున్నారు. పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు పలువురు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వల్ల కలిగే పరిణామాలు, చెరువులు, కుంటల్లో వాటితో తయారు చేసిన గణపతులు నిమజ్జనం చేస్తే, వాటిలో ఉండే రసాయనాలతో జీవరాశులకు కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నారు. శాంతి సమావేశాల్లో పోలీసు అధికారులు కూడా మట్టి గణపతులు ప్రతిష్ఠించేందుకు ప్రజలు మొగ్గుచూపాలని ఉత్సవ కమిటీ నిర్వాహకులకు కౌన్సెలింగ్‌లో చెబుతున్నారు. దీంతో ప్రజలు మట్టి గణపతులు కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.