
కళలకు జీవంపోస్తున్న కళాకారుడు
చిన్న నాటి నుంచి పద్యాలు, నాటకాలపై ఆసక్తి
తండ్రి వారసత్వం నుంచి పుణికిపుచ్చుకున్న ప్రతిభాశాలి
సమాజాన్ని చైతన్యం చేసే నాటక ప్రదర్శనలు
వందల చోట ఎన్నో కళా ప్రదర్శనలు
ఆమనగల్లు, సెప్టెంబర్ 8 : రంగస్థలం ప్రదర్శనలకు రమేష్ లాంటి కళాకారులు జీవం పోస్తున్నారు. ఆధునిక సాంకేతికత ప్రవేశించి రంగస్థల కళలకు గడ్డు పరిస్థితి దాపురించినా.. కళాకారులు ఏమాత్రం నిరుత్సాహపడక అవకాశం, సందర్భం దొరికిన ప్రతిచోటా రంగస్థల ప్రదర్శనలు ఇస్తూ తమలో ఉన్న ప్రతిభను చాటుతున్నాడు. ఇప్పటికే వందలాది నాటకాలు, పద్యాలు అలవోకగా పాడుతూ తమలో ఉన్న నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. తన నాటకాలు పద్యాల ద్వారా సమాజాన్ని చైతన్యం చేస్తున్న యువకళాకారుడు అతడు. ప్రస్తుతం కల్వకుర్తి మండలంలోని మార్చల ఉన్నత పాఠశాలల్లో సబ్ఆర్డినేటర్గా విధులు నిర్వహిస్తూనే, తనకు ఇష్టమైన నాటకరంగంలో రాణిస్తూ అందరిచేత శభాష్ అనిపించుకుంటున్నాడు. రమేష్‌కు చిన్నప్పడి నుంచి కళల పట్ల మక్కువ. పద్యాలు, నాటకాలపై ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో సత్యహరిశ్చంద, శ్రీకృష్ణరాయబారం, గయోపాఖ్యానం, రామాంజనేయ యుద్ధం, భక్తకుచేలా లాంటి ప్రసిద్ధ రంగస్థలం నాటకాల్లో ప్రధాన పాత్రలు పోషించాడు. ప్రజాకళాకారుడు గోరటి వెంకన్న లాంటి గొప్ప కళాకారుల చేత అభినందనలు అందుకున్నాడు. రమేష్ నాటక ప్రదర్శన ద్వారా పాటలు, పద్యాలు పాడుతున్నాడంటేనే ఒకటే ఈలలు, చప్పట్లతో సభ ప్రాంగణం అంతా ప్రేక్షకులతో మార్మోగుతుంది.
తండ్రి వారసత్వం నుంచి..
నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని ఆవులోని బావికి చెందిన రమేష్ చిన్నప్పడి నుంచే నాటకాలపై మక్కువ పెంచుకున్నాడు. ప్రసిద్ధ కళాకారుడైన తండ్రి తాడూరి సుధాకర్ నుంచి వచ్చిన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడు. ఇప్పటివరకు హైదరాబాద్, బెంగళూరు, మద్రాస్, జిల్లాల్లో పలుచోట్ల వందలాది ప్రదర్శనలు చేశారు. పూర్వ మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్, దుంధుభి సాహితీ పీఠం, సరికొండ ధర్మన్న సాహితీ పీఠం, ఉత్తమ రంగస్థల కళారత్న అవార్డుతో సత్కరించింది. తన నాటకాల ద్వారా సమాజంలో తరిగిపోతున్న మానవ విలువలు, సాంఘిక సమస్యలు, బాల్య విహాలు, వరకట్న చావులు, ఆడపిల్లలపై సమాజంలో చిన్నచూపు, కులవివక్షత తదితర అంశాలను వేదికలపై తన నాటక ప్రదర్శనలు చేస్తూ సమాజాన్ని చైతన్యం చేసేవాడు. అంతే కాకుండా తాను విధులు నిర్వహించే పాఠశాలలో విద్యార్థులకు పద్యాలు, పాటలు, నాటకాలల్లో మెళకువలు నేర్పిస్తూ వారిని అన్ని రంగాల్లో రాణించడంలో తోడ్పాటునందిస్తున్నాడు.
నాన్నే నాకు తొలి గురువు
మా ఇంట్లో తాను చిన్నప్పడి నుంచి మా నాన్న పాడే పద్యాలు, పాటలపై ఇష్టం పెంచుకున్నా. మా ఊరిలో ఎక్కడ నాటకాలు, ఆటలు ఆడుతుంటే వెళ్లి నాకు తోచిన పద్యం, పాటలు పాడుతూ అలా నాటకాలపై ఆసక్తి పెంచుకున్నాను. పల్లెటూరి వాతావరణంలో ప్రజల జీవనవిధానాలపై పాటలు పాడటం ఇష్టం. నాన్నే నాకు తొలి గురువు, నేను చేస్తున్న ఉద్యోగం, ఎంచుకొన్న రంగస్థలం నాకు ప్రాణం.
కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహించాలి
చేస్తున్న ఉద్యోగానికి ఒక వైపు న్యాయం చేస్తూ మరోవైపు తనకు ఇష్టమైన కళారంగం పై మక్కువ పెంచుకున్న రమేష్ చాలా ప్రతిభావంతుడు. సమాజంపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ప్రోత్సహించాలి. ఇలాంటి కళాకారులను అన్ని రంగాల్లో రాణించేలా చేయూతనివ్వాలి. తాడూరి రమేష్ కళారంగంలో నూతన ఆవిష్కరణలకు జీవం పోస్తున్నాడు.
-జి. గోపాల్, అధ్యక్షుడు సరికొండ ధర్మన్న సాహితీ పీఠం. ఆమనగల్లు