
ఏ రైతు, ఏ పంట, ఎన్ని ఎకరాలు వివరాలన్నీ ఆన్లైన్లో నమోదు
పంటలు అమ్ముకునేందుకు ఈ లెక్కలే కీలకం
వివరాలు ఉంటేనే ఐకేపీ, సీసీఐ, మార్క్‌ఫెడ్, పీఏసీఎస్‌లలో ధాన్యం కొనుగోలు
రంగారెడ్డి జిల్లాలో వానకాలం సాగు 4.20 లక్షల ఎకరాలు
ఇప్పటి వరకు 1.70 లక్షల ఎకరాల సాగు వివరాల సేకరణ
వికారాబాద్ జిల్లాలో 5,88,475 ఎకరాల్లో వానకాలం సాగు
ఇప్పటివరకు 4,49,546 ఎకరాల పంటల వివరాలు సేకరణ
ఏఈవోలతో పంటల వివరాలు నమోదు చేయించుకోవాలని
రైతులకు వ్యవసాయ శాఖ సూచన
అన్నదాతలకు తెలంగాణ సర్కార్ కొండంత అండగా నిలుస్తున్నది. సాగు పనులు మొదలు పంట చేతికొచ్చాక గిట్టుబాటు ధరను అందిస్తూ వెన్నుదన్నుగా నిలుస్తున్నది. అదునుకు ముందే పెట్టుబడి సాయం, సబ్సిడీ ఎరువులను సైతం అందజేస్తున్నది. పంట చేతికొచ్చాక ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్ముకునేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంటల వివరాలను సేకరించి ఆన్లైన్లో నమోదు చేస్తున్నది. ఆన్లైన్లో నమోదైన వివరాలను బట్టి ఐకేపీ, సీసీఐ, మార్క్‌ఫెడ్, పీఏసీఎస్‌లలో ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నారు. ఇందులో భాగంగా 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌గా విభజించి, వివరాలు సేకరించాల్సిన బాధ్యతను ఏఈవోలకు అప్పగించారు. దీంతో ఏ ఊరు, ఏ రైతు, ఏ పంట, ఎన్ని ఎకరాల్లో సాగు చేశారన్న వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తుండగా, ప్రతి రోజు జిల్లా వ్యవసాయ అధికారి పరిశీలిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఈ వానకాలంలో 4.20 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, ఇప్పటి వరకు 1.70 లక్షల ఎకరాల పంటల వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. వికారాబాద్ జిల్లాలో 5,88,475 ఎకరాల్లో సాగు కాగా, ఇప్పటి వరకు 4,49,546 ఎకరాల్లో సాగైన పంటల వివరాలను సేకరించారు. సంబంధిత ఏఈవోలకు తమ పంటల వివరాలను తెలియజేయాలని వ్యవసాయ శాఖ రైతులకు సూచిస్తున్నది.
పరిగి/షాబాద్, సెప్టెంబర్ 8 : ఉమ్మడిజిల్లా పరిధిలో వానకాలంలో ఏఏ పంటలు, ఏ రైతులు, ఎంత విస్తీర్ణంలో సాగు చేశారనే సర్వే ముమ్మరంగా కొనసాగుతున్నది. పంటల సాగు వివరాల లెక్క పక్కాగా తేల్చేందుకు ప్రభుత్వం ఈ సర్వే చేయిస్తున్నది. వ్యవసాయాధికారుల ద్వారా ఈ సర్వే పనులు కొనసాగుతున్నాయి. అన్ని గ్రామాల్లో ప్రతి రైతుకు సంబంధించిన భూమిలో సాగు చేసిన పంటలకు సంబంధించి సర్వే చేపడుతారు. ఆగస్టు నెలలో ప్రారంభమైన ఈ సర్వే నెలాఖరుకు పూర్తయ్యేలా వ్యవసాయ విస్తరణాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ వానకాలం సీజన్లో వికారాబాద్ జిల్లాలో 5,88,475 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేపట్టగా ఇప్పటివరకు 4,49,546 ఎకరాల్లో, రంగారెడ్డి జిల్లాలో 4.20 లక్షల ఎకరాలకుగాను 1.70 లక్షల ఎకరాల్లో సాగు చేసిన పంటల వివరాల సేకరణ పూర్తయింది. వ్యవసాయ విస్తరణ అధికారులు(ఏఈవోలు) ప్రతి గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పంటల సాగు వివరాలను సేకరించి ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. వీటి ఆధారంగానే రానున్న రోజుల్లో రైతుల నుంచి పంట ఉత్పత్తులను కొనుగోలు చేసే ఆవకాశం ఉంటుంది.
కొనసాగుతున్న సర్వే
వికారాబాద్ జిల్లా పరిధిలో 99 క్లస్టర్లలో, రంగారెడ్డి జిల్లాలో 83 క్లస్టర్లలో పంటల వివరాల నమోదు కార్యక్రమం కొనసాగుతున్నది. వికారాబాద్‌లో 93 మంది ఏఈవోలకుగాను 96 మంది ప్రస్తుతం పనిచేస్తున్నారు. ముగ్గురు సెలవులో ఉన్నారు. రంగారెడ్డిలో 83 మంది పనిచేస్తున్నారు. ప్రతి గ్రామంలో పంటల సాగు వివరాల సేకరణ చేపడుతున్నారు.
పక్కాగా పంటల లెక్కలు
వ్యవసాయ విస్తరణాధికారులు ప్రతి గ్రామంలోని సర్వే నెంబర్ల ఆధారంగా, ఆయా భూముల్లో ఎంత విస్తీర్ణంలో ఏ రకం పంటలు సాగు చేశారన్నది స్వయంగా పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. ప్రతి గుంటలో సాగు చేసిన పంటల పూర్తి వివరాలోపాటు రైతుల ఫోన్ నెంబర్లు కూడా నమోదు చేస్తున్నారు. దీంతో ఏ గ్రామంలో, ఏ మండలంలో ఎంత మేరకు ఏ పంటలు సాగు చేయబడ్డాయన్నది తేలుతుంది. తద్వారా దిగుబడి అంచనాతోపాటు మార్కెటింగ్ సదుపాయం కల్పించడం కోసం అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపడుతుంది. ఆన్లైన్లో పొందుపర్చినవిధంగా కొనుగోలు కేంద్రాలద్వారా ఉత్పత్తులను సేకరిస్తుంది. ఆగస్టు 22 నుంచి పంటల వివరాల సేకరణ కార్యక్రమం ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈ సర్వే కొనసాగుతున్నది. ఈ కార్యక్రమం ఈ నెలాఖరులోగా పూర్తి చేసేందుకు వ్యవసాయధికారులు మరింత వేగంగా సర్వే జరుపుతున్నారు.
వివరాలుంటే పంటల కొనుగోలు సులభం
రైతులు పండించిన పంటలను ఇబ్బందులు లేకుండా మార్కెట్లో అమ్ముకునేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతులకు ఎంతగానో ఉపయోగపడనుంది. ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతు ఆ పంటను అమ్ముకోవాలంటే ఎలాంటి కష్టాలు ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పంటల సాగు వివరాల సేకరణ చేపడుతున్నారు. ఆ వివరాలు ఉంటేనే పంటలను కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. సీసీఐ, మార్క్‌ఫెడ్, ఐకేపీ, పీఏసీఎస్‌ల ద్వారా రైతుల నుంచి పత్తి, వడ్లు, కంది, ఇతర దిగుబడులను ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. ఆన్లైన్లో వివరాలు లేని రైతుల నుంచి పంటల కొనుగోలును నిరాకరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి రైతు తాము సాగుచేసిన పంటల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయించాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు.
త్వరలోనే సర్వే పూర్తి : గోపాల్, జిల్లా వ్యవసాయాధికారి
వికారాబాద్ జిల్లా పరిధిలోని గ్రామాల్లో పంటల వివరాల సేకరణ సర్వే త్వరలో పూర్తవుతుంది. జిల్లావ్యాప్తంగా వానకాలంలో 5,88,475 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా ఇప్పటివరకు 4,49,546 ఎకరాల్లో పంటల వివరాల సేకరణ పూర్తయింది. సేకరించిన వివరాలను ఆయా క్లస్టర్ల ఏఈవోలు ఆన్లైన్లో ఎప్పటికప్పుడు పొందుపరుస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ పంటల వివరాల సేకరణ పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాం. సర్వే పూర్తయితే ఏ పంట ఎంతమంది రైతులు, ఎంత విస్తీర్ణంలో సాగు చేశారనేది తెలియడంతోపాటు ఎంతమేరకు దిగుబడి వస్తుందో అంచనా వేయవచ్చు.
పకడ్బందీగా సాగు వివరాల సేకరణ : గీతారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి
రంగారెడ్డి జిల్లాలో పంటల సాగు వివరాల సేకరణ కార్యక్రమం పకడ్బందీగా కొనసాగుతున్నది. వానకాలంలో రైతులు సాగుచేసిన పంటల వివరాలను తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేయించుకోవాలి. ప్రస్తుతం సేకరించిన వివరాల ఆధారంగానే పంటల ఉత్పత్తులు మార్కెట్లో అమ్ముకునే అవకాశం ఉంటుంది. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 4.20 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయగా, ఏఈవోలు గ్రామాల్లో పర్యటించి రైతుల పంటల వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటివరకు 1.70 లక్షల ఎకరాల పంటల వివరాలు ఆన్లైన్లో నమోదు చేశారు. జిల్లాలో జరుగుతున్న పంటల వివరాల సేకరణను ఎప్పటికప్పుడూ పరిశీలిస్తున్నాం. రైతులు ఈ ఆవకాశాన్ని వినియోగించుకుని తమ పంటల వివరాలు ఏఈవోల వద్ద నమోదు చేయించుకోవాలి.