పుడమి తల్లి పులకించి మెచ్చుకునేలా పల్లెలన్నీ పచ్చని మొక్కలతో కళకళలాడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘హరితహారం’ కార్యక్రమం సత్ఫలితాలనిస్తున్నది. ప్రతి పల్లె రోడ్లు హరిత తోరణాలతో స్వాగతం పలుకుతున్నాయి. ఏ వీధి చూసినా పచ్చని మొక్కలతో పరిశుభ్రంగా కండ్ల సంబురంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ రాక ముందు అస్తవ్యస్తంగా ఉన్న గ్రామాలు… నేడు అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తున్నాయి. నాటి పల్లె తీరు.. నేడు మారిన రూపును చూసి పల్లెజనం హర్షిస్తున్నారు. మున్సిపాలిటీల్లో ప్రైవేటు లే అవుట్లలోనూ మొక్కలను పెంచడంతో కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ హరితనిధిని కేటాయించి పల్లెల పచ్చదనానికి ప్రాధాన్యతనిస్తుండడంతో పల్లెజనం జేజేలు పలుకుతున్నారు.
పరిగి, అక్టోబర్ 3 : సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న హరితహారం ద్వారా పల్లెలన్నీ పచ్చందాలు పరుచుకున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు సీఎం కేసీఆర్ నడుం బిగించారు. ప్రతి సంవత్సరం ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో 40వేల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో ఇప్పటివరకు 2.5కోట్లు మొక్కలు నాటారు. ఈసారి 40,75,000 మొక్కలు నాటాలని నిర్దేశించగా ఇప్పటివరకు 40లక్షల మొక్కలు నాటి వాటి సంరక్షణ చర్యలు చేపడుతున్నారు.
ఊరూరా విరివిగా మొక్కలు..
వికారాబాద్ జిల్లా పరిధిలో ఆయా గ్రామాలకు వెళ్లే రహదారుల పక్కన అవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి రోడ్లకు పచ్చందాలు చేకూరుస్తున్నాయి. వికారాబాద్ జిల్లా పరిధిలోని పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, జాతీయ రహదారుల పక్కన మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్ పనులు కొనసాగుతున్నాయి. జిల్లాలో 254 కిలోమీటర్ల రోడ్లకు ఇరువైపులా రెండుమూడు వరుసల్లో మొక్కలు నాటుతారు. జిల్లా పరిధిలో ఈ కార్యక్రమం కింద లక్షా 26వేల మొక్కలు నాటడం కొనసాగుతున్నది.
రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా..
షాబాద్, అక్టోబర్ 3 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమంతో గ్రామాలకు హరితశోభ సంతరించుకున్నది. మారుమూల పల్లెలన్నీ హరితస్వాగతం పలుకుతున్నాయి. గ్రామాలకు వెళ్లేదారిలో రోడ్డుకు ఇరువైపులా వివిధ రకాల మొక్కలు నాటడంతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్(కల్వకుర్తి)నియోజకవర్గాల పరిధిలోని అన్ని మండలాల్లో హరితహారం కార్యక్రమంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమం ద్వారా గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కల సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్నారు. ప్రతిరోజు పంచాయతీ సిబ్బంది రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలకు నీరుపోస్తున్నారు. ఏ గ్రామానికి వెళ్లినా పచ్చదనంతో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. దీనికి తోడు సీఎం కేసీఆర్ హరితనిధిని ఏర్పాటు చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామం పచ్చదనంగా మారింది
మా గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా బీటీ రోడ్డు నుంచి గ్రామం వరకు రోడ్డుకు ఇరువైపులా వివిధ రకాల మొక్కలు నాటారు. దీంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది. గ్రామంలో కూడా నీడనిచ్చే మొక్కలు పెట్టారు. పంచాయతీ సిబ్బంది నీరుపోసి సంరక్షిస్తున్నారు. గ్రామం మొత్తం పచ్చదనంగా మారిపోయింది.
మొక్కలు నాటడం మంచి పరిణామం
హరితహారం ద్వారా ప్రభుత్వం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం మంచి పరిణామం. మా గ్రామంలో రోడ్లకు ఇరువైపులా మొక్కలు పెంచుతున్నారు. మొక్కలతో ప్రజలకు మంచి వాతావరణం లభిస్తుంది. ఊర్లకు వస్తుంటే రోడ్డుకు ఇరువైపులా ఉన్న మొక్కలు స్వాగతం పలుకుతున్నాయి.
హరితనిధికి నావంతు సహకారం అందిస్తా
హరితనిధి ఏర్పాటు భవిష్యత్‌లో నిరంతరంగా మొక్కలు పెంచేందుకు ఉపయోగపడుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఇప్పటికే హరితహారం కార్యక్రమంతో పల్లెరోడ్లన్నీ పచ్చగా మారాయి. పచ్చనిచెట్లతో సకాలంలో వర్షాలు పడుతాయి. హరితనిధికి నావంతు సహకారం అందిస్తా.
-శ్యాంసుందర్‌రెడ్డి, సర్పంచ్ రాంపూర్, తలకొండపల్లి
దారుల వెంట పెద్దగా పెరిగాయి..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు మొక్కలను పెంచేవాళ్లు లేకుండే. ఊరిలో ఎవ్వరి ఇంటి ముందైనా చెట్టు ఉంటే అందరూ ఆడనే కూసునెటోళ్లు. కానీ తెలంగాణ సర్కారు వచ్చినంక అందరూ చెట్లను పెంచుతున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో చెట్ల పెంపకంపై అవగాహన పెరిగింది. దారులవెంట చెట్లు పెద్దగా పెరిగినయి. మంచి వాతావరణం వచ్చింది. పచ్చని చెట్లను చూస్తుంటే సంతోషంగా అనిపిస్తుంది.
పట్టుమని పది చెట్లు లేకుండే..
హరితహారం కార్యక్రమం చేపట్టకముందు గ్రామంలో పట్టుమని పది చెట్లు లేకుండే ఇప్పుడు ఊరంతా చెట్లే. ఎండకు కూర్చొందామంటే నిలువ నీడ లేకపోతుండే.. ఇప్పుడు ఎక్కడపోయినా చెట్లే కనిపిస్తున్నాయి. హరితహారం కార్యక్రమంతో ఆకుపచ్చ గ్రామంగా మారిపోయింది. గ్రామంలోకి అడుగుపెడుతుంటే పచ్చనిచెట్లు స్వాగత తోరణంలా స్వాగతం పలుకుతున్నాయి. హరితనిధిని ఏర్పాటుచేసి, మొక్కల పెంపకానికి ఖర్చుచేయటం ఎంతో సంతోషంగా ఉంది.
-బి.సత్తయ్య, శేరిగూడబద్రాయపల్లి గ్రామం, కొత్తూరు మండలం