పరిగి, సెప్టెంబర్30: పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అన్నారు. గురువారం ఆమె కలెక్టరేట్లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణ స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా స్వచ్ఛత ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, బట్ట సంచులను వాడాలన్నారు. ఇంటి పరిసరాలు, గ్రామాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ప్రజలు తడి, పొడి చెత్తను వేరు చేసి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రతిరోజూ చెత్త సేకరణకు వచ్చే వాహనాల్లో వేయాలన్నారు. ఇంటి పరిసరాల్లోని గుంతల్లో నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలన్నా రు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించేందుకు ముద్రించిన కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రయ్య, మోతీలాల్, జడ్పీ సీఈవో జానకీరెడ్డి, డీఆర్డీవో కృష్ణన్, సిబ్బంది పాల్గొన్నారు.
అక్రమ నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి
జిల్లాలో అక్రమ నిర్మాణాలు, లే-అవుట్లను గుర్తించేందుకు సంబంధిత శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని కలెక్టర్ నిఖిల ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి టీఎస్-బీపాస్ టాస్క్‌ఫోర్స్ కమిటీ మొదటి సమావేశం ఆమె అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా లో గృహ నిర్మాణాలకు సంబంధించి ఆన్లైన్ ద్వారా ఎన్ని దరఖాస్తులొచ్చాయని ఆమె సంబంధిత శాఖ అధికారులను అడుగగా నాలుగు మున్సిపాలిటీల్లో 910 వచ్చినట్లు తెలిపారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించి 548 నిర్మాణాలకు ఆమోదించినట్లు, 202 దరఖాస్తులను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు, మిగతావి పరిశీలనలో ఉన్నట్లు వారు తెలిపారు. అదేవిధంగా జిల్లా పరిధిలో 45 అక్రమ నిర్మాణాలను గుర్తించినట్లు కమిటీ సభ్యులు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గృహ నిర్మాణాల అనుమతు లు, అక్రమలే అవుట్లు, అక్రమ నిర్మాణాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి జా గ్రత్తగా పరిష్కరించాలన్నారు. టాస్క్‌ఫోర్స్ సమావేశం ప్రతి 15 రోజులకు ఒకసారి నిర్వహించాలని సభ్యులకు కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నారాయణ, జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, వికారాబాద్, తాండూరు ఆర్డీవోలు ఉపేందర్‌రెడ్డి, అశోక్‌కుమార్, మున్సిపల్ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్, నీటి పారుదల, ఆర్అండ్బీ శాఖల అధికారు లు, జిల్లా ఫైర్ ఆఫీసర్, పరిశ్రమల శాఖ ఏడీ తదితరులు పాల్గొన్నారు.