
వ్యవసాయంలో మార్పును ఆహ్వానించింది. వరిలో నష్టాలకు చెక్ పెడుతూ ఇతర పంటల సాగులో మంచి ఫలితాలను రాబట్టింది. మూడేండ్లుగా కూరగాయల సాగులో లాభాలు గడిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది.
వరి వదిలేసి ఇంతర పంటల సేద్యం కొత్త జాల రైతులు ఏండ్ల తరబడి సంప్రదాయ పంటలు సాగు చేసేవారు. అధిక పెట్టుబడులతో ఆదాయం తగ్గిపోగా నష్టాలు చవిచూశారు. ఈ నేపథ్యంలో మూడేండ్ల కిందట పలువురు రైతులు కూరగాయల సాగు చేపట్టి లాభాలు పొందారు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం సైతం యాసంగిలో ఇతర పంటలను సాగు చేయాలని చెప్పడంతో రైతులంతా వరికి స్వస్తి పలికారు. వ్యవసాయాధికారుల సూచనలు పాటిస్తూ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంటలు సాగు చేస్తున్నారు. తక్కువ సమయంలో చేతికందే వివిధ రకాల కూరగాయలను పండించి అధిక లాభాలు గడిస్తున్నారు.
ఇతర పంటల వైపు దృష్టి…
సంప్రదాయ పంటల సాగు లాభసాటిగా లేక పోవడంతో రైతులు ఇతర పంటలు, నూతన సాగు విధానాలపై దృష్టి సారిస్తున్నారు. విభిన్నమార్గంలో నడిచి తొలి దశలో ఎదురయ్యే కష్టాలను అధిగమించి వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలతో ముందుకు సాగుతూ కాసుల పంట పండిస్తున్నారు. కొత్తజాల పల్లెలో 100 మంది రైతులు గతంలో అందరిలాగానే తమకున్న వ్యవసాయ భూముల్లో వరి, పత్తి, కంది సాగు చేశారు. కాలం అనుకూలించినా వేసిన పంటలకు పెద్దగా లాభం రాకపోగా అప్పులే మిగిలాయి. దాంతో సగానికి పైగా రైతులు అధునిక పద్ధతుల్లో వివిధ రకాల కూరగాయలు సాగుకు శ్రీకారం చుట్టారు.
డ్రిప్ విధానంతో సాగు…
కొత్తజాలలో పెద్దగా జల వనరుల్లేవు. బోరు బావులే ఆధారంగా పంటలు పండిస్తున్నారు. మల్బింగ్, డ్రిప్ పద్ధతుల్లో తక్కువ నీరు సరిపోతుందని, కలుపు ఎక్కువ రాదని, కూలీల ఖర్చు కూడా తగ్గుతుందని తెలుసుకున్నారు. కొంత మంది ప్రభుత్వ సహకారంతో మరికొంత మంది రైతులు సొంతగా ఎకరాకు రూ. 30 వేల వరకు ఖర్చుతో మల్బింగ్, డ్రిప్ ఏర్పాటు చేసుకున్నారు. తమకున్న కొద్దిపాటి నీటితో డ్రిప్ పద్ధతిలో ఎకరాకు రూ.25 వేల నుంచి 30వేల వరకు పెట్టుబడి పెట్టారు. 45 నుంచి 90 రోజుల వరకు చేతికందే పంటలైన టమాట, వంకాయ, సొరకాయలతో పాటు మిర్చి, బీర, కాకర, చిక్కుడు సాగు చేస్తూ ఎకరాకు లక్షకు పైగా ఆదాయాన్ని పొందుతున్నారు.
నేరుగా సంతలోనే విక్రయాలు…
రైతులు ఆరుగాలం కష్టించి పండించిన కూరగాయలను దళారులకు విక్రయించకుండా నేరుగా వారసంతలో విక్రయిస్తున్నారు. మండల కేంద్రంలో ప్రతి గురువారం జరిగే వారసంతలోనే కాకుండా సమీపంలోని యాదగిరిగుట్ట, వరంగల్ జిల్లా చేర్యాల, బచ్చన్నపేట, మెదక్‌జిల్లా జగదేవ్‌పూర్ సంతల్లో నేరుగా అమ్ముకుంటున్నారు. నీటి సౌకర్యాన్ని బట్టి కూరగాయల పండిస్తూ జీవనోపాధిని వినూత్నంగా మలుచుకుని ఆదర్శంగా నిలుస్తున్నారు.
డైరెక్ట్‌గా సంతకే తీస్కపోతున్నాం..
నీటి సౌకర్యం బట్టి కూరగాయలు పండిస్తున్నాం. బీర, సొర, టమాట, మిర్చి పంటలను దళారులకు అమ్మకుండా డైరెక్ట్‌గా సంతలకే తీస్కపోతున్నాం. రాజాపేట సంతతోపాటు చుట్టుపక్కల అన్ని సంతల్లో మేమే అమ్ముకుని ఆదాయం పొందుతున్నాం.
అధిక దిగుబడి సాధిస్తున్నాం…
వర్షాభావ పరిస్థితుల్లో బోరు బావిలో నీళ్లు అడుగంటినయి. కొద్దిపాటి నీటి వసతికి అనుగుణంగా వరిపంటకు బదులు కూరగాయలు సాగు చేస్తున్నాను. వ్యవసాయ అధికారుల సలహా మేరకు ప్రభుత్వం అందించిన సబ్సిడీతో మల్చింగ్, డ్రిప్ ఏర్పాటు చేసుకొని రెండు ఎకరాల్లో బీరకాయలు పండిస్తున్నా. అధిక దిగుబడి, మంచి లాభాలు వస్తున్నాయి.