తెలుగింట నూతనత్వం, నవ్యత, ఆనందం వెల్లివిరిసింది. సంప్రదాయ వస్త్రధారణలతో తెలుగుదనం ఉట్టిపడింది. ఆరు రుచుల జీవితానుభవాల ఉగాది పచ్చడి నోరూరించింది. రాశి ఫలాలు, పంచాంగ శ్రవణాలు, కవి సమ్మేళనాలు, భక్తుల పూజలతో ఆలయాల్లో సందడి నెలకొంది. శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉగాది పర్వదినాన్ని ఆనందోత్సాహాల మధ్య జరుపుకొన్నారు. సూర్యాపేటలో జరిగిన ఉగాది వేడుకల్లో మంత్రి జగదీశ్‌రెడ్డి, పలుచోట్ల ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. శుభకృత్ నామ సంవత్సరమంతా శుభమే జరుగాలని, ప్రకృతి కరుణించి ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని మంత్రి ఆకాంక్షించారు.
సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 2 : ఉగాది పండుగ మొదలుకుని శుభకృత్ నామ సంవత్సరమంతా శుభమే జరుగాలని.. ప్రకృతి కరుణించి ప్రజలంతా ఐక్యతతో, సుఖసంతోషాలతో జీవించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆకాంక్షించారు. ఉద్యమ కాలంలోనే అందరి కష్టాలు తెలుసుకుని.. సుదీర్ఘ పోరాటంతో రాష్ర్టాన్ని సాధించి.. నిరంతరం అభివృద్ధి పాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని కొనియాడారు. శనివారం ఉగాది పర్వదిన వేడుకను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి జగదీశ్‌రెడ్డికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. వేద పండితుల ఆశీర్వచనాలు, అధికారులు, టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి శాలువాలు, బొకేలతో సత్కరించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి జిల్లా కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం, శ్రీ వేదాంత భజన మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పలు చోట్ల పంచాగాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం ఈ ఏడాది పేరులో శుభం ఉందని.. ఈ ఏడాదంతా అందరికీ మంచి జరిగి.. అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించుకుందామన్నారు. ప్రకృతి కరుణించి వర్షాలు సకాలంలో సమృద్ధిగా కురిసి పాడి, పంటలతో తులతూగాలని అన్నారు. రాష్ర్టాన్ని సాధించుకున్న ఎనిమిదేండ్లలో ఎంతో ప్రగతి సాధించుకున్నామని.. రాబోయే రోజుల్లోనూ మరింత అభివృద్ధితో ముందుకు సాగుదామన్నారు. వేడుకలకు హాజరైన మంత్రి జగదీశ్‌రెడ్డికి ఆయా దేవాలయాల అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి సంప్రదాయ పద్ధతిలో ఆశీర్వచనం అందించారు. వేడుకల్లో మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మార్కెట్ చైర్పర్సన్ ఉప్పల లలితా ఆనంద్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, జడ్పీటీసీ జీడి భిక్షం, ఉప్పల ఆనంద్, మొరిశెట్టి శ్రీనివాస్, గుడిపూడి వెంకటేశ్వర్రావు, గోండ్రాల అశోక్, తోట శ్యామ్, కాసర్ల సురేందర్ రెడ్డి, అనిల్‌రెడ్డి, రమాకిరణ్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.