
ఖమ్మం కల్చరల్, జనవరి 13: పవిత్ర ధనుర్మాసం శుక్ల ఏకాదశి గురువారం వైకుంఠ ఏకాదశి పర్వాన్ని భక్తులు అత్యంత భక్తి ప్రపత్తులతో జరుపుకున్నారు. ఉమ్మడి జిల్లాలోని వైష్ణవ ఆలయాల్లో శ్రీమహావిష్ణువు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమివ్వడంతో భక్తులు తరించారు. శ్రీమహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో కూడి ఉత్తర ద్వార దర్శనమివ్వడం అత్యంత పుణ్యఫలమని భక్తుల నమ్మకం. మూడు కోట్ల ఏకాదశిలతో సమానమైనదిగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు భక్తులు ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు చేసి తరించారు. ఉపవాసాలు, పూజలు, దాన ధర్మాలు చేసి స్వామి అనుగ్రహాన్ని పొందారు. భక్తులు అత్యంత నిష్టతో ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు. పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఖమ్మంలోని ప్రాచీన దివ్యక్షేత్రం శ్రీలక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో అధిక సంఖ్యలో భక్తులు పూజలు చేశారు. మామిళ్లగూడెం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం, కమాన్బజార్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం, రంగనాయకుల గుట్ట శ్రీలక్ష్మీ రంగనాథస్వామి ఆలయం, ఎన్ఎస్పీ, ప్రభాత్ టాకీస్ రామాలయాల్లో స్వామి ఉత్తర ద్వార దర్శనంతో భక్తులు పునీతులయ్యారు. శేషశయన విగ్రహంలో ప్రత్యేక ఆకర్షణతో రంగనాయకుల గుట్టపై కొలువైన రంగనాథస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వచ్చే మూడు రోజులు భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు ఉండడంతో వైకుంఠ ఏకాదశి మరింత ఆధ్యాత్మిక, భక్తి చింతనను నింపింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షం, కరోనా మహమ్మారి ప్రభావం ఉన్నప్పటికీ ముందస్తు జాగ్రత్తలతో భక్తులు ఆలయాల్లో పూజలు చేశారు.