కాకతీయుల స్ఫూర్తితో చెరువుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం అద్భుత ఫలితాలనిస్తున్నది. నాలుగు విడుతలుగా వేలాది కోట్లు వెచ్చించి చిన్ననీటి వనరులను బాగు చేయించారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో 667 చెరువులకు మరమ్మతు చేయగా.. జలకళతో ఉట్టిపడుతు న్నాయి. లక్షలాది ఎకరాలకు సాగు నీరు అందుతున్నది. మండుటెండల్లోనూ నిండుకుండలను తలపిస్తున్నాయి. యాసంగి, వానకాలం పంటలకు ఢోకా లేకుండా పోయింది. సీమాంధ్రుల పాలనలో నెర్రలుబారిన నేలల్లో పసిడి పంటలు పండుతున్నాయి. భూగర్భ జలాలు పెరుగడంతోపాటు మత్స్యకారులు ఆర్థికంగా ప్రయోజనం పొందుతున్నారు.
ఆదిలాబాద్, ఏప్రిల్ 4 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి రాష్ట్రంలో గ్రామాల్లోని చెరువుల పరిస్థితి అధ్వానంగా ఉండేది. కాకతీయ రాజులు నిర్మించిన వాటితో పాటు ప్రభుత్వం వివిధ పథకాల కింద నిర్మించిన చెరువుల ఆనవాళ్లు లేకుండా పోయాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం చెరువుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా మిషన్ కాకతీయ పథకాన్ని అమలు చేస్తున్నది. ఈ పథకంలో భాగంగా చెరువులకు మరమ్మతు చేపట్టడం, పూడిక తీత, కాలువలు, మత్తడి, కట్టల ఎత్తు పెంచడం, వర్షపు నీరు చెరువుల్లోకి వచ్చే చేరేలా పనులు చేపట్టారు.
మిషన్ కాకతీయ పథకంలో భాగంగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో కలిపి ఐదు విడుతల్లో మొత్తం 667 చెరువులను అభివృద్ధి చేశారు. నిర్మల్ జిల్లాలో 434, ఆదిలాబాద్ జిల్లాలో 232 చెరువుల మరమ్మతు చేపట్టారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా గ్రామాల్లో చెరువులు గత వైభవాన్ని సంతరించుకున్నాయి. గతంలో చుక్క నీరు కనిపించని చెరువులు ఇప్పుడు నిండుకుండను తలపిస్తున్నాయి.
గతంలో చెరువులు ఉన్నా రైతులు తమ పంటలను సాగు నీరు అందించుకోలేని పరిస్థితి. మిషన్ కాకతీయలో చెరువుల మరమ్మతుతో రైతులు రెండు పంటలకు సాగునీటిని అందిస్తున్నారు. రెండు జిల్లాల్లో ఏటా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఈ ఏడాది నిర్మల్ జిల్లాలో 1460 మిల్లీ మీటర్లు, ఆదిలాబాద్ జిల్లాలో 1320 మిల్లీ మీటర్ల వర్షంపాతం నమోదైంది. వానకాలంలో పడుతున్న వర్షాలతో చెరువులు నిండి మత్తడి దూకుతున్నాయి. మిషన్ కాకతీయ ఫలితంగా ఆదిలాబాద్ జిల్లాలో 18 వేల ఎకరాలు, నిర్మల్ జిల్లాలో 28 వేల ఎకరాల ఆయకట్టుకు అదనంగా నీరు అందుతున్నది. రైతులు వానకాలంలో వరి, పత్తి, కంది పంటలకు, యాసంగిలో వరి, శనగ, గోధుమ, జొన్న పంటలకు చెరువుల నుంచి నీటిని అందిస్తున్నారు. వేసవిలో సైతం చెరువుల్లో పుష్కలంగా నీరు ఉంటున్నది. మత్స్యకారులకు ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తుండడంతో మరమ్మతులు చేపట్టిన చెరువుల్లో వారు చేపల పెంపకం చేపడుతూ ఉపాధి పొందుతున్నారు. గ్రామాల్లో వేసవిలో పశువులు, అటవీ జంతువులు తాగునీరు దొరక్క అలమటించేవి. ఇప్పుడు అవి చెరువుల్లోని నీటిని తాగుతూ దప్పిక తీర్చుకుంటున్నాయి. గ్రామాల్లో భూగర్భ జలాలు సైతం పెరుగడంతో స్థానికులకు తాగునీటి సమస్య లేకుండా పోయింది. గతంలో వేసవి వచ్చిందంటే చాలు నీళ్లకోసం బాగా ఇబ్బందులు పడేవాళ్లమని మిషన్ కాకతీయ కారణంగా చెరువులు నిండిపోవడంతో ఏడాది పొడవునా నీళ్లను చూస్తున్నామని స్థానికులు అంటున్నారు.
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండ లం పిప్పల్‌కోటిలో పురాతన తుమ్మలకుంట చెరువు ఎన్నో ఏళ్లుగా సాగునీరు తాగునీటికి మూలంగా ఉండేది. ఈ చెరువు క్రమంగా అంతరించిపోయే ప్ర మాదం నెలకొంది. తెలంగాణ సర్కారు వచ్చిన తరువాత మిషన్‌కాకతీయ మొద టి విడుతలో ఈ చెరువును పునరుద్ధరించింది. దీంతో 200 ఎకరాల ఆయకట్టు రైతులకు సాగునీరు అందుతుంది. ఇందు లో నీరు నిండుగా ఉండడంతో భూగర్భజలాలు పెరిగి ఈ ప్రాంత రైతులు బోరుబావులు వేసుకున్నారు. 60 మంది మత్స్యకారులు చేపల పెంపకంతో ఉపాధి పొందుతున్నారు. చెరువుతో భూగర్భజలాలు సమృద్ధిగా చెంది గ్రామ బోర్లు, వ్యవసాయ బోర్లలో పుష్కలంగా నీటివనరులు సమకూరుతున్నాయి.
మిషన్ కాకతీయలో మా సత్యం చెరువు మరమ్మతుకు రూ.50 లక్షలు మంజూర య్యాయి. వీటితో పనులు పూర్తయ్యాయి. చెరువు నుంచి నీరు వృథా పోకుండా ఉంటు న్నాయి. గ్రామంలో భూగర్భ జలాలు అమాంతం పెరిగాయి. దీని వల్ల గ్రామంలో తాగు నీటికి కొదువ లేదు. వ్యవసాయ భూముల్లో వేసిన బోర్లలో పుష్కలంగా నీళ్లు పడుతున్నాయి. దీంతో రైతులందరూ రెండు పంటలు సాగు చేసి ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. చెరువు కింద 40 ఎకరాల్లో వరి సాగవుతోంది. పశువులకు తాగునీరు అందుతుండడంతో పశు సంతతి పెరిగింది.
సింధే అనిల్ కుమార్, మాజీ సర్పంచ్