రాష్ట్రంలో పేదలందరికీ ఆంగ్ల విద్య అందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ చేపట్టిన ‘మన ఊరు.. మన బడి’, మన బస్తీ.. మన బడి కార్యక్రమం మార్పునకు నాంది పలుకుతున్నది. ఆంగ్ల విద్యతో విద్యార్థుల ప్రవేశాలు పెరుగడంతో పాటు, ప్రత్యేక నిధులతో సకల సౌకర్యాలు సమకూరనున్నాయి. ఉపాధ్యాయుల కొరత లేకుండా అన్ని ఖాళీలను భర్తీ చేయనున్నారు. వచ్చే ఏడాది నుంచి దశల వారీగా ఇంగ్లిష్ మీడియం అమలు చేయనున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలు నూతన శోభను సంతరించుకుంటున్నాయి.
మిర్యాలగూడలో 1917లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల పాత రెవెన్యూ డివిజన్ పరిధిలో మొట్టమొదటిది. ఈ పాఠశాలలో చదివిన ఎంతో మంది విద్యార్థులు ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో ఉన్నారు. సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి సైతం ఇదే పాఠశాలలో చదివినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. అప్పట్లో సుమారు 14 మండలాల నుంచి ఎంతో మంది ఈ పాఠశాలలో చదువుకునేవారు. పాఠశాలలో ప్రస్తుతం 456 మంది విద్యార్థులు ఉన్నారు. ఇంగ్లిష్ మీడియంలో 326 మంది, తెలుగు మీడియంలో130 మంది చదువుతున్నారు. ప్రస్తుతం 14 తరగతి గదులు ఉండగా 16 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. పాఠశాలకు 22 పోస్టులు మంజూరు కాగా 6 ఖాళీలు ఉన్నాయి. తెలుగు, బయోసైన్స్, ఫిజికల్ సైన్స్, సోషల్, గెజిటెడ్ హెచ్ఎం, డ్రాయింగ్ టీచర్ ఖాళీలున్నాయి. మన ఊరు మన బస్తీ తొలి విడుతలో ఈ పాఠశాలను ఎంపిక చేశారు. కార్యక్రమంలో భాగంగా నీటి సౌకర్యంతో కూడిన టాయిలెట్లు, విద్యుదీకరణ, తాగునీటి సరఫరా, విద్యార్థులు, సిబ్బందికి సరిపడా ఫర్నిచర్, పాఠశాలకు మరమ్మతులు, భవనాలకు పెయింటింగ్, గ్రీన్ బోర్డులు, ప్రహరీలు, కిచెన్ షెడ్లు, శిథిలమైన గదుల స్థానంలో కొత్త భవనాలు, డైనింగ్ హాల్, డిజిటిల్ బోధన వసతులు కల్పించనున్నారు.
పూర్వ విద్యార్థులు మిర్యాలగూడ ఉన్నత పాఠశాల అభివృద్ధికి సహకారం అందిస్తున్నారు. రాగిరెడ్డి ఉపేందర్‌రెడ్డి రూ.22 వేలతో స్టేజీ పైకప్పు, వేముల లింగయ్య రూ.10 వేలతో భోజనం ప్లేట్లు, బత్తుల లక్ష్మారెడ్డి రూ.20 వేలతో మైక్‌సెట్, పానుగోతు లక్పతినాయక్ పాఠశాల గేటు, నంద్యాల వేణూధర్‌రెడ్డి రూ.30 వేలతో కంప్యూటర్, జీ.కృష్ణయ్య రూ.15 వేలతో బీరువా, ఫ్యాన్లు అందజేశారు. పాఠశాల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
సీఎం కేసీఆర్ నిరుపేదలందరికీ ఆంగ్ల విద్య అందించాలనే మహా సంకల్పంతో చేపట్టిన మన బస్తీ.. మన బడి కార్యక్రమం ఎంతో గొప్పది. ఇది పేద విద్యార్థులకు వరం లాంటిది. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్య అందుబాటులోకి వస్తుంది. దాంతో ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు కట్టలేని ఎంతో మంది సంతోషంగా ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ తీసుకోవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఫలితాలు వస్తున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం, పుస్తకాలు, దుస్తులు అందుతున్నాయి.
మా స్కూల్లో ఇంతకు ముందు నుంచే ఇంగ్లిష్ మీడియం చెప్తున్నరు. స్టడీ చాలా బాగుంది. అన్ని సబ్జెక్టుల ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడంతో పాటు పరీక్షలు పెట్టి ఎప్పటికప్పుడు రివిజన్ చేస్తున్నరు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి బోధిస్తున్నరు. వచ్చే సంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది.
– పాండు, 10వ తరగతి విద్యార్థి