భానుడు భగ్గుమంటున్నాడు. నెత్తిన నిప్పులు కురిపిస్తున్నాడు. రాష్ట్రంలోనే కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గురువారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కెరమెరి మండలంలో 43.8, వాంకిడి మండలంలో 43.7, కౌటాల మండలంలో 43.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన పది ప్రాంతాల్లో మన జిల్లాకు చెందిన మూడు ప్రాంతాలు ఉండడంతో ప్రజలు భయపడుతున్నారు. మధ్యాహ్నం బయటకు వెళ్లడానికి జంకుతున్నారు. దీనికితోడు వేడిగాలులు తోడవడం, ఉక్కపోతతో కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. సర్కారు సూచనలు పాటించాలని, నిర్లక్ష్యం వహించవద్దని, జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
మంచిర్యాల, మార్చి 31, నమస్తే తెలంగాణ : జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. మంచిర్యాలలో బుధవారం 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. గురువారం నుంచి రాష్ట్రంలో 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు అదనంగా నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణలో శుక్ర, శనివారాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొన్నది. మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈ ప్రభావం ఉంటుందని హెచ్చరించింది. ఈ యేడాది పగటి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉంటుందని తెలిపింది. మంచిర్యాల జిల్లాల్లోనూ వేడిగాల్పులు అధికంగా వీస్తాయని, తగు జాగ్రత్తలు పాటించాలని బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డా.రాజేశ్వర్ నాయక్ సూచించారు.
జిల్లాలో భానుడు విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. ఎండలు మండుతుండడంతో ప్రజలు రోడ్డుపైకి రావాలంటేనే భయపడుతున్నారు. వారం రోజులుగా 40 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోడ్లన్నీ కర్ఫ్యూను తలపిస్తున్నాయి. రెండురోజులుగా పగటి ఉష్ణోగ్రత 43 డిగ్రీలు నమోదయ్యింది. ఈ నేపథ్యంలో గురువారం నుంచి పాఠశాలలను ఉదయం 8 గంటల నుంచి 11:30 గంటల వరకే నిర్వహిస్తున్నారు. పగటి పూట గరిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటున్నాయని, మున్ముందు తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున సమయాన్ని తగ్గించారు. మరోవైపు ఉపాధి కూలీలు ఎండలో పనిచేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి సూచించారు. వేసవిలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందునా, అగ్నిమాపక శాఖను అప్రమత్తం చేయాలని సూచించారు. అలాగే ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, సబ్ సెంటర్లు, దవాఖానల్లో వైద్యులు, సిబ్బంది అన్ని వేళల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
రాబోయే నాలుగు రోజుల్లో మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్‌తో పాటు రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీల వరకు పెరగడమే కాకుండా, వేడిగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. తప్పనిసరి అయితేనే బయటకు ఆవాలనిసరయితే తప్ప బయటకు వెళ్లాలని బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ రాజేశ్వర్ నాయక్ సూచిస్తున్నారు. వేడిగాలుల దృష్ట్యా నీటి లభ్యత కరువయ్యే అవకాశం ఉందని, ఉదయం సాయంత్రం నీటి తడులు ఇవ్వడం ద్వారా పంటలను కొంతవరకు కాపాడుకోవచ్చని తెలిపారు. పాడి పశువులను ఎండకు తిప్పడం మానేయాలని, సరైన నీడ ప్రదేశాల్లో కట్టేసి, సరిపడేలా తాగునీటిని అందించాలని పేర్కొన్నారు. కోళ్ల పెంపకందారులు షెడ్లలో ఫ్యాన్లు, ఫ్యాగర్స్ను అమర్చుకోవాలని సూచించారు. షెడ్లను వరిగడ్డితో కప్పి స్ప్రింక్లర్లు అమర్చుకోవడం ద్వారా అధిక ఉష్ణోగ్రతలను తగ్గించుకోవచ్చు. నీరు అందించలేని పరిస్థితి ఉంటే యూరియా ద్రావణాన్ని కానీ, డీఏపీ ద్రావణం లేదా 19:19:19 ద్రావణాన్ని పై పాటుగా పిచికారీ చేయడం ద్వారా మొక్కలను కాపాడుకోవచ్చని వివరించారు.