‘సార్ నిన్నటి వరకు నేను ఒక బ్యూటీపార్లర్‌లో పనిచేశా. ప్రస్తుతం దళితబంధు పథకంతో బ్యూటీపార్లర్‌కు యజమానిగా మారాను. మరికొంత మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగాను.. నా ఎదుగుదలకు అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు
– లావణ్య, బ్యూటీ పార్లర్ యజమానురాలు
తెలంగాణలోని దళితులు దేశానికి రోల్‌మోడల్ కావాలి. దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేసి, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు సాయం అందజేస్తున్నారు. ఈ పథకంలో ఒక్క రూపాయి కూడా తిరిగి చెల్లించకుండా పూర్తిగా గ్రాంట్ కింద అందిస్తున్నారు. ఈ పథకాన్ని దళితులు సద్వినియోగం చేసుకోవాలి అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని మైత్రీ మైదానంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నియోజకవర్గంలో వందమంది లబ్ధిదారులకు ట్రాక్టర్లు, కార్లు, ఆటో ట్రాలీలు, జేసీబీలను అందజేశారు.
పటాన్చెరు, ఏప్రిల్ 1: తెలంగాణలోని దళితులు దేశానికి రోల్‌మోడల్ కావాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని మైత్రీ మైదానంలో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ దళితబంధు పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. అంతకుముందు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లబ్ధిదారులకు ట్రాక్టర్లు, కార్లు, ఆటో ట్రాలీలు, జేసీబీలు అందజేశారు. నియోజకవర్గ పరిధిలో జిన్నారం నుంచి కొడకంచి, పటాన్చెరు నుంచి బచ్చుగూడెం, గుమ్మడిదల నుంచి అనంతారం చెందిన గ్రామస్తులు వంద మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి దళితబంధు యూనిట్లను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మంత్రి స్వయంగా మాట్లాడి, ఆ యూనిట్‌పై వారికి ఉన్న అవగాహన, అనుభవాన్ని అడిగి తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్ సాయం చేయడంతోనే తమకు గొప్ప అవకాశం లభించిందని లబ్ధిదారులు మంత్రికి తెలిపారు. తమకు కేటాయించిన యూనిట్‌ను విజయవంతం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. మీ జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. పది లక్షల రూపాయలు ఒక కుటుంబానికి ఇచ్చి, వారు ఆర్థికంగా ఎదిగేందుకు సాయం అందజేస్తున్నామని అన్నారు. ఇలాంటి పథకం ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. గతంలో దళితులకు రుణాలు ఇస్తే ఆస్తులు తాక ట్టు పెట్టుకొని ఇచ్చేవారన్నారు. ఈ పథకం ద్వారా ఒక్క రూపాయి కూడా తిరిగి చెల్లించకుండా పూర్తిగా గ్రాంట్ కింద అందిస్తున్నట్లు తెలిపారు. దళితుల సంక్షేమం విషయంలో దేశానికి తెలంగాణ రోల్‌మోడల్ అని మంత్రి అన్నారు. ఈ బడ్జెట్లో దళితబంధుకు రూ.17,800 కోట్లు కేటాయించామన్నారు. త్వరలో ప్రతి నియోజకవర్గంలో 1500మందికి దళితబంధు ఇచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. దళితబంధు ప్రారంభించే ముందు ప్రతిపక్షాలను పిలిచి దళితులకు మేలు చేసేందుకు సలహాలు ఇవ్వాలని సీఎం సమావేశం ఏర్పాటు చేసి కోరితే, రెండు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు రుణాలు ఇవ్వాలని సూచించారన్నారు. కానీ, సీఎం రూ.10లక్షలు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా ఇస్తామని చెప్పడంతో నోరెళ్ల బెట్టారని చెప్పారు. దళితబంధుకు ఎంపికైన మూడు గ్రామాల లబ్ధిదారులు ప్రభుత్వ సహాయాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదుగుతామని హామీ ఇవ్వడం సంతోషకరంగా ఉందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. తమతో పాటు మరికొందరికి ఉపాధి కల్పిస్తామని చెప్పడం ఆనందంగా ఉందని తెలిపారు.
ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో వారంలో ఒక రోజు విద్యుత్ కోతలు, పవర్ హాలీడే అమలవుతున్నదని మంత్రి హరీశ్‌రావు గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆరు నెలల్లోనే విద్యుత్ సమస్యలను పరిష్కరించారన్నారు. పరిశ్రమలకు, రైతులకు, గృహాలకు కనురెప్ప కొట్టినంత సమయం కూడా విద్యుత్ కోత ఉండడం లేదని అన్నారు. దీంతో రైతులు, కార్మికులకు ఉపాధి దొరుకుతున్నదన్నారు. తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు. రూ.400 గ్యాస్ సిలిండర్ ధర ఉన్నప్పుడు బీజేపీ ఆందోళనలు చేసిందన్నారు. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యాస్ సిలిండర్ ధర రూ.1000 దాటిందని గుర్తుచేశారు. పెట్రో, డీజిల్ ధరలను 11రోజుల్లో 9సార్లు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అంటేనే ప్రజలు భారతీయ ఝూటా పార్టీ అని అంటున్నారని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, వైస్ చైర్మన్ ప్రభాకర్, కలెక్టర్ హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ రమణకుమార్, కార్పొరేటర్లు మెట్టుకుమార్‌యాదవ్, పుష్పానగేశ్, సింధూఆదర్శ్‌రెడ్డి, చైర్పర్సన్లు లలితాసోమిరెడ్డి, రోజాబాల్రెడ్డి, చైర్మన్ పాండురంగారెడ్డి, ఎంపీపీలు సుష్మశ్రీ వేణుగోపాల్‌రెడ్డి, దేవానంద్, విజయభాస్కర్‌రెడ్డి, జడ్పీటీసీలు సుప్రజావెంకట్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, కుమార్‌గౌడ్, ఆత్మకమిటీ చైర్మన్ గడీల కుమార్‌గౌడ్, ఏఎంసీ చైర్పర్సన్ హారిక విజయ్‌కుమార్, డీఆర్డీవో శ్రీనివాసరావు, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఎస్పీ భీంరెడ్డి, దళితబంధు ప్రత్యేకాధికారి ప్రసాద్, ఆర్డీవో నగేశ్, ఎంపీడీవో బన్సీలాల్, తహసీల్దార్ మహిపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు గూడెం మధుసూధన్‌రెడ్డి, దశరథ్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, నర్రబిక్షపతి, చంద్రశేఖర్‌రెడ్డి, అంతిరెడ్డి, ఆదర్శ్‌రెడ్డి, యాదగిరియాదవ్, నగేశ్‌యాదవ్, కృష్ణకాంత్, వెంకటేశంగౌడ్, సర్పంచ్‌లు సుమతీరాంచందర్, సుధీర్‌రెడ్డి, ఉపేందర్, అఫ్జల్, షకీల్, అక్రంపాషా, శ్రీధర్‌చారి, హాశం తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో దళితబంధు పథకం లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేసిన ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు లబ్ధిదారులతో కొద్దిసేపు మాట్లాడారు. దళితబంధు పథకం కింద బ్యూటీపార్లర్ నడుపుతున్న లావణ్య, జేసీబీ వాహనం కొనుగోలు చేసిన సుభాష్, బుల్డోజర్ కొనుగోలు చేసిన లబ్ధిదారుడు శ్రీకాంత్‌తో మంత్రి మాట్లాడారు. బ్యూటీ పార్లర్ ఏర్పాటు చేసుకుంటున్న లబ్ధిదారులు లావణ్య మాట్లాడుతూ.. ‘సర్ నిన్నటి వరకు నేను ఒక బ్యూటీపార్లర్‌లో పనిచేశాను, ప్రస్తుతం దళితబంధు పథకంతో బ్యూటీపార్లర్‌కు యజమానిగా మారి మరికొంత మందికి ఉపాధి కల్పించేస్థాయికి ఎదిగాను…నా ఎదుగుదలకు అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్ ధన్యవాదాలు’ అని తెలిపింది. జేసీవీ వాహనం కొనుగోలు చేసిన లబ్ధిదారుడు సుభాష్ మాట్లాడుతూ.. తాను ఒక జేసీబీ డ్రైవర్ అని, మరో ఇద్దరు మిత్రులతో కలిసి దళితబంధు పథకం కింద జేసీబీ కొనుగోలు చేసినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ దయతోనే డ్రైవర్‌గా ఉన్న తాను ప్రస్తుతం జేసీబీ ఓనర్‌గా ఎదిగినట్లు చెప్పారు. మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘సుభాష్ నీ జేసీబీకి డ్రైవర్‌ను పెట్టుకుంటావా’అని ప్రశ్నించగా, దీనికి సుభాష్ స్పందిస్తూ.. సర్ నేనే డ్రైవర్‌గా పనిచేస్తా… జేసీబీ నడపడంతో రూ.30 నుంచి రూ.40వేల వరకు ఆదాయం వస్తుందని ఆశిస్తున్నా. ఈ డబ్బులతో నా భార్యకు జిరాక్స్ మిషన్ కొనిచ్చి దుకాణం పెడతా అని తెలిపారు. నీకు ఆదాయం పెరుగుతుంది మరి నాకు…మీ ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిని ఇంటికి పిలిచి భోజనం పెడతావా?అని మంత్రి హరీశ్‌రావు అడగగా, సుభాష్ మాట్లాడుతూ.. సర్ మీ ఇద్దరిని మా ఇంటికి పిలిచి భోజనం పెడతా అని సమాధానం ఇచ్చారు. దళితబంధు పథకం కింద బుల్డోజర్ కొనుగోలు చేసిన శ్రీకాంత్ మాట్లాడుతూ కష్టపడి పనిచేసి ఆర్థికంగా ఎదుగుతానని తెలిపారు.
దళితబంధులో భాగంగా తొలి విడతలో ఎంపికైన వంద యూనిట్లు విజయవంతం కావాలి. గతంలో యూనిట్లు పెట్టుకునేందుకు బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. సీఎం కేసీఆర్ ఆలోచన నుంచి వచ్చిన దళితబంధు ద్వారా వారి ఆర్థికాభివృద్ధికి రూ.10లక్షల సహాయం నేరుగా అందుతున్నది. ప్రతి యూనిట్ విజయవంతం అవుతుందని నేను భావిస్తున్నా. జిల్లాలో నారాయణఖేడ్, పటాన్చెరులో వందశాతం యూనిట్ల గ్రౌండింగ్ పూర్తయ్యాయి.
– హనుమంతరావు, సంగారెడ్డి కలెక్టర్