నిర్మల్,ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో 80వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈమేరకు ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్ల విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నది. ముందుగా పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న ఎస్ఐ, కానిస్టేబుళ్ల పోస్టులకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దీంతో ఉద్యోగార్థులకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. మిగతా పోస్టులతో పోల్చితే పోలీస్ ఉద్యోగాల్లో ఫిజికల్ ఫిట్‌నెస్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. దీంతో యువత అందుకనుగుణంగా ముందస్తుగా సిద్ధమవుతున్నారు. అయితే గతంలో ఈ పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్లు వచ్చిన ప్రతీసారి శిక్షణ కోసం హైదరాబాద్‌కు వెళ్లేవారు. తెలంగాణ ప్రభుత్వం పేద, మధ్య తరగతి వర్గాలను దృష్టిలో ఉంచుకొని యువత ఎలాంటి వ్యయ ప్రయాసాలకు గురికాకుండా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎక్కడికక్కడ జిల్లా కేంద్రాల్లో ఉచిత శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీంతో నిర్మల్ ఎస్పీ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో యువతకు ప్రత్యేక శిక్షణనిచ్చేందుకు కార్యాచరణ రూపొందించారు. ఇందుకోసం డీఎస్పీ జీవన్‌రెడ్డిని ట్రైనింగ్ కో ఆర్డినేటర్‌గా నియమించారు. శిక్షణ కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం సన్నద్ధమయ్యే యువతకు ప్రత్యేక శిక్షణనిచ్చేందుకు జిల్లా పోలీస్ శాఖ సర్వం సిద్ధం చేసింది. ముందుగా శిక్షణకు అర్హులను గుర్తించేందుకు రాత పరీక్ష నిర్వహించారు. గత నెలలో నిర్మల్, ఖానాపూర్, భైంసా పట్టణాల్లో అర్హత పరీక్ష ఏర్పాటు చేయగా 2600మంది హాజరయ్యారు. మెరిట్ ఆధారంగా 555మందిని శిక్షణ కోసం ఎంపిక చేశారు. రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు గతనెల 31న ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 300ల మందికి త్వరలోనే శిక్షణ ప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఎంపికైన అభ్యర్థులకు ఇప్పటికే నిపుణులతో అవగాహన కార్యక్రమం కూడా నిర్వహించారు.
శిక్షణకు ఎంపికైన పేద, మధ్య తరగతి యువతకు అన్ని సదుపాయాలతో శిక్షణ ఇచ్చేందుకు జిల్లా పోలీస్ శాఖ ఏర్పాట్లు చేసింది. నిర్మల్ పాలిటెక్నిక్ కళాశాలలో తరగతులు నిర్వహించనున్నారు. ఇందుకు జిల్లా విద్యాశాఖ… ఆయా సబ్జెక్టుల్లో నిపుణులైన 10 మంది ఉపాధ్యాయులను కేటాయించింది. ఆయా సబ్జెక్టులపై వీరు నిత్యం తరగతులు నిర్వహిచనున్నారు.ఎస్సై, సీఐ, డీఎస్పీ స్థాయి అధికారులు కూడా తమ అనుభవాలను, ఉద్యోగ సాధనకు అవసరమైన మెళకువలను ప్రత్యేక తరగతుల ద్వారా తెలియజేయనున్నారు. అవుట్ డోర్ శిక్షణ కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానాన్ని ఎంపిక చేశారు. నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో ఫిజికల్ ఫిట్‌నెస్‌పై శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం ఇద్దరు పీఈటీలను కేటాయించారు. ముగ్గురు రిజర్వు ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో ఈ శిక్షణ కొనసాగనుంది. 100, 800 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, హైజంప్, షార్ట్‌పుట్ అంశాల్లో అభ్యర్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. మొత్తం 45 రోజుల పాటు ఈ శిక్షణ కొనసాగనుంది. అవసరమైన వారికి ఉచిత వసతితో పాటు ప్రతి ఒక్కరికీ భోజన సదుపాయాన్ని కల్పించనున్నారు.
ఎంపికైన అభ్య ర్థు లు కోచింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలి. శిక్షణ సమయంలో క్ర మశిక్షణతో మెలుగుతూ నిపుణుల సూచనలతో లక్ష్యం వైపు ముందుకు సాగాలి. ఎస్పీ ఆదేశాల మేరకు పకడ్బందీగా శిక్షణనిచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఇక్కడ శిక్షణ పొందిన అభ్యర్థులందరూ నూటికి నూరు శాతం విజయం సాధించేలా ప్రత్యేక తర్ఫీదును ఇవ్వబోతున్నాం. తరగతులను ఎప్పటి నుంచి ప్రారంభిస్తామనే విషయాన్ని అభ్యర్థుల సెల్‌ఫోన్‌కు మెసేజ్ పంపిస్తాం. ఎప్పుడు పిలిచినా వచ్చేందు అభ్యర్థులు సిద్ధంగా ఉండాలి.
జీవన్‌రెడ్డి, డీఎస్పీ, శిక్షణ కో ఆర్డినేటర్
జిల్లా వ్యాప్తంగా సివిల్, ఏఆర్ తోపాటు ఇతర విభాగాల్లో సుమారు 200లకు పైగా కానిస్టేబుల్ పోస్టుల ఖాళీలను గుర్తించారు. పేదలకు కోచింగ్ భారం కాకూడదన్న ఉద్దేశంతో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణనివ్వాలని నిర్ణయించాం. ఏర్పాట్లు కూడా పూర్తి చేశాం. ఈ నెల 15 కల్లా ఎంపిక చేసిన అభ్యర్థులందరికీ శిక్షణ తరగతులను ప్రారంభిస్తాం. శిక్షణతోపాటు ఎప్పటికప్పుడు వారి ప్రతిభను గుర్తించేందుకు మాక్ టెస్టులు నిర్వహిస్తాం. ఈ పరీక్షల ద్వారా అభ్యర్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తూ ఫైనల్ పరీక్షలకు సిద్ధం చేస్తాం.
సీహెచ్ ప్రవీణ్‌కుమార్, నిర్మల్ ఎస్పీ