బొడ్రాయిబజార్, ఏప్రిల్ 9 : ఎనిమిదేండ్ల క్రితం తండ్రిని, ఇటీవల తల్లిని పోగొట్టుకొని అనాథలై దిక్కుతోచని స్థితిలో ఉన్న నలుగురు ఆడబిడ్డలకు భరోసానిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. ఆత్మకూర్.ఎస్ మండల కేంద్రానికి చెందిన ముల్కలపల్లి కోటమ్మ-వీరయ్య దంపతులకు నలుగురు ఆడపిల్లలు. కాగా, ఎనిమిదేండ్ల క్రితం తండ్రి వీరయ్య, ఇటీవల తల్లి కోటమ్మ మృతి చెందడంతో నలుగురు ఆడబిడ్డలు అనాథలై వీధినపడ్డారు. ఈ విషయాన్ని ఓ నెటిజన్ ట్విట్ చేయడంతో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చలించారు.
వెంటనే ఆడబిడ్డలను ఆదుకొని భరోసా కల్పించాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్యాదేవరాజన్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి రవికుమార్‌ను ఆదేశించారు. జిల్లా బాలల పరిరక్షణ అధికారులు సిబ్బందితో కలిసి శనివారం ఆత్మకూర్.ఎస్ మండల కేంద్రంలోని బాలికలను పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. బాలికలు తెలిపిన వివరాల ప్రకారం.. తమ తండ్రి వీరయ్య 8 ఏండ్ల క్రితం, తల్లి కోటమ్మ గురువారం చనిపోయినట్లు తెలిపారు.
పని కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లామని, తమ తల్లికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో సూర్యాపేట జిల్లా ఆస్పత్రికి తీసుకురాగా చికిత్స పొందుతూ చనిపోయిందన్నారు. ఇద్దరు ఇంటర్, ఒకరు పదో తరగతి పూర్తి చేసినట్లు చెప్పారు. మరొకరు మూడో తరగతిలోనే చదువు ఆపేసినట్లు తెలిపారు. పిల్లలకు చదువు కొనసాగించేందుకు ప్రభుత్వం ద్వారా ఏదైనా గురుకులంలో అడ్మిషన్స్ ఇప్పించి సహాయం చేస్తామని, వారికి రక్షణ కల్పిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అనంతరం తక్షణ సాయంగా 15 రోజులకు సరిపోయేలా రూ.4 వేల నగదును స్పాన్సర్షిప్ ప్రోగ్రాం కింద అందించారు.
తల్లి కర్మకాండలు పూర్తయ్యే వరకు తమ మేనమామలు, అమ్మమ్మ, తాతయ్య సంరక్షణలో ఉంటామని చెప్పారు. గ్రామ సర్పంచ్, ఆర్ఐ, గ్రామస్తుల సమక్షంలో పిల్లలకు కౌన్సెలింగ్ నిర్వహించి శాఖ తరఫున చదువు కొనసాగించేందుకు ఉన్నతాధికారుల సూచనల మేరకు సహాయం అందించి భరోసా కల్పించనున్నట్లు కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి తెలిపారు.