కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఆసరా పింఛన్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నది. ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులు, ఒంటరి మహిళలు, హెచ్ఐవీ బాధితులకు ఈ పథకం ద్వారా పింఛన్లు అందుతున్నాయి. వృద్ధుల పింఛన్ అర్హత వయస్సును సర్కారు 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గించి ఈ నెల నుంచి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే మీ సేవ కార్యాలయాల్లో దరఖాస్తుదారుల వివరాలను గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ప్రభుత్వం సేకరించింది. నల్లగొండ జిల్లాలో కొత్తగా 41,063 మంది వృద్ధులు, 17,610 మంది ఇతరులకు ఆసరా పింఛన్లు మంజూరు కానున్నాయి.
నల్లగొండ, ఏప్రిల్ 3 : ఆసరా పింఛన్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పనుంది. కొంతకాలంగా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారి నిరీక్షణకు తెరదించి వచ్చే నెల నుంచి పింఛన్ అందజేయాలని యోచిస్తున్నది. నాలుగేండ్లుగా ప్రభుత్వం నూతన పింఛన్లు మంజూరు చేయకపోవడంతో దరఖాస్తు చేసుకున్న అర్హులు ఎదురుచూస్తున్నారు. వీరిలో ప్రధానంగా వృద్ధులే ఉన్నారు. 65 ఏండ్లు నిండిన వృద్ధులకు మాత్రమే ఆసరా పింఛన్లు ఇవ్వగా ప్రస్తుతం 57 ఏండ్లు నిండిన వారంందరికీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రకారం వివరాలు సేకరించిన ప్రభుత్వం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. అయితే మరోసారి అవకాశం ఇచ్చి అందరికీ ఒకేసారి పింఛన్ అందజేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది.
జిల్లాలో ఇప్పటివరకు 1,70,323 మందికి రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పథకం కింద ఆయా వర్గాలకు పింఛన్ ఇస్తుండగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న 58,633 మందికి పింఛన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. కాగా వయో పరిమితిని వృద్ధులకు 65 నుంచి 57 ఏండ్లకు కుదించగా గీత, చేనేత వర్గాల వారికి 50 ఏండ్లు దాటిన తర్వాత అందజేస్తుంది. వీరితో పాటు వయసుతో సంబంధం లేకుండా దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, హెచ్ఐవీ, బొదకాల బాధితులకు ప్రభుత్వం పింఛన్ అందజేస్తున్నది.
జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 1,70 320 మందికి నెలకు రూ. 42,19,33,168 ఆసరా పింఛన్లను లబ్ధిదారులకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అందచేస్తున్నది. ఇందులో 28,694 మంది దివ్యాంగులు ఉండగా వారికి రూ.3016, మిగిలిన వారికి రూ.2016 చొప్పున అందిస్తున్నది. ఇక నూతనంగా జిల్లాకు 58,633 పింఛన్లు మంజూరు కానుండగా ప్రభుత్వంపై నెలకు అదనంగా రూ.12.30 కోట్ల భారం పడనుంది. ఆసరా పథకం కింద జిల్లాలో ఇప్పటివరకు నెలకు రూ. 42.20 కోట్లు ఇస్తుండగా, పాత, కొత్త పింఛన్లు కలిపి 2,28,956 మందికి రూ.54.50 కోట్లు వెచ్చించాల్సి ఉన్నది.
జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 1.70 లక్షల మందికి ఆసరా పింఛన్లు అందుతున్నాయి. ఈసారి 57 ఏండ్లు నిండిన వారికి కూడా ఇవ్వనుండటంతో వారి సంఖ్య పెరుగనుంది. ఇప్పటికే గుర్తించిన వారు 41 వేలకు పైగా ఉన్నారు. వీరితో పాటు ఇతర సామాజిక వర్గాలు కూడా దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ ప్రభుత్వం త్వరలో పింఛన్ మంజూరు చేయనుంది. ప్రస్తు తం దివ్యాంగులకు నెలకు రూ.3,016, ఇతర వర్గాలకు రూ. 2,016 ఇస్తుండగా కొత్త వారికి కూడా ఇదేవిధంగా ప్రభుత్వం అంజేయనుంది.
– కాళిందిని, డీఆర్డీఓ, నల్లగొండ