నార్నూర్/నిర్మల్ చైన్గేట్, ఏప్రిల్ 3 : భానుడు భగభగమండుతున్నాడు. అధిక ఉష్ణోగ్రతలతో ఠారెత్తిస్తున్నాడు. ఉదయం 10 గంటలు దాటిందంటే బయటకు రావడానికి ప్రజలు జంకుతున్నారు. ఇంట్లో కూడా ఉండలేని పరిస్థితి నెలకొంది. వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉన్నది. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని, వడదెబ్బపై అవగాహన కలిగి ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎండలో ఎక్కువగా తిరగడం, ఎండలో పనిచేయడం వల్ల మెదడులో ఉష్ణోగ్రతను నియంత్రించే కేంద్రం దెబ్బతినడంతో వడదెబ్బ సోకుతుందని పేర్కొంటున్నారు.
శరీర సాధరణ ఉష్ణోగ్రత 98.4 డిగ్రీల ఫారన్హీట్. వడదెబ్బకు గురైనవారి శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీలకు పెరుగుతుంది. అలాంటి సమయంలో గుండే, మూత్రపిండాలు, కాలేయం పనితీరు దెబ్బతింటాయి. చర్మం పొడిబారుతుంది. ఎర్రబడుతుంది. శ్వాస ఎక్కువగా తీసుకోవడం, వాంతులు, తలతిప్పడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మూత్రం విసర్జనలో మంట ఉంటుంది. సృ్పహ కోల్పోతారు.
ఎండదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే నీడ ఉన్న ప్రదేశానికి చేర్చాలి. శరీరంపై ఉండే దస్తులను తొలగించి, చల్లని నీటితో కడగాలి. లేకపోతే నీటిలో తడిపిన గుడ్డతో శరీరాన్ని తుడవాలి. చల్లని నీరు, ఉప్పు ఇతర లవణాలు కలిపిన నీటిని తాగించాలి. శరీరంపై వచ్చే కురుపులకు నూనె గానీ, ఆయింట్మెంట్ గానీ పూయకూడదు. వడదెబ్బకు గురైన వ్యక్తి ఎంత నీరు తాగితే అంత తాగించాలి. ముఖ్యంగా ఓఆర్ఎస్ ద్రావణాన్ని తాగించాలి. బాధితుడికి వైద్యుడికి చూపించేలోగా చేయాల్సిన చర్యలు. స్పృహకోల్పోతే మాత్రం సమయం వృథా చేయకుండా వైద్యసాయం అందేలా ఏర్పాటు చేయాలి
ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతలు నమోదవతున్న దృష్ట్యా ప్రజలు ఆరోగ్య సూత్రాలు పాటించాలి. అవసరమైతేనే బయటకు రావాలి. ఎండలో తిరగడం వల్ల వడదెబ్బ తాకే ఆస్కారం ఉంది. వడదెబ్బపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి. వడదెబ్బ తాకిన వారికి వెంటనే ప్రథమ చికిత్స చేయించి, సమీపంలోని దవాఖానకు తీసుకురావాలి. ఓఆర్ఎస్ ప్యాకెట్లు జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానలు, ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి. గ్రామాల్లోని ఆశ కార్యకర్తలు ఉచితంగా అందిస్తారు. అత్యవసర సమయాల్లో 108 సేవలు ఉపయోగించుకోవాలి.
– ధన్రాజ్, జిల్లా వైద్యాధికారి, నిర్మల్
వేసవిలో సరైన మోతాదులో నీటిని తాగకపోవడం వల్ల డీ హైడ్రేషన్ వస్తుంది. దీనివల్ల మూత్రం పచ్చగా మారుతుంది. కిడ్నీలో రాళ్లు కూడా ఏర్పడతాయి. దీంతో విపరీతంగా కడుపునొప్పితో మా వద్దకు వచ్చే వారి సంఖ్య ఈ సీజన్లో ఎక్కువగా ఉంటుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడడం వల్ల కిడ్నీ వాపునకు గురై దెబ్బతింటుంది. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఎండలో ఎక్కువగా తిరగకుండా రోజుకు 4-5 లీటర్ల నీటిని తాగాలి. ఆహారంలో ఉప్పు తగ్గించాలి. సమతుల్య ఆహారం తీసుకోవాలి. దీనివల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.
– పవన్ కుమార్, మెడికల్ అధికారి, నార్నూర్