
తెలంగాణ ప్రభుత్వం విద్యరంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నది. పాఠశాలల్లో మెరుగైన విద్యనందించడంతోపాటు మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నది. అంతేకాదు, జీవో నెం 317తో ఏజెన్సీ, మారుమూల ప్రాంతాల పాఠశాలలు, ప్రభుత్వ విద్యకు జవసత్వాలు తీసుకొచ్చింది. సీనియార్టీ ప్రాతిపదికన జరిగిన బదిలీల్లో ఉపాధ్యాయులు లేని పాఠశాలలకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. రెగ్యులర్ టీచర్లు లేని, వలంటీర్లతో నెట్టుకొస్తున్న పాఠశాలలకు పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులను కేటాయించింది. దీంతో మారుమూల గ్రామాల బడుల్లో విద్యాబోధనకు మోక్షం లభించింది. గ్రామీణ విద్యార్థుల చదువుకు భరోసా లభించనున్నది.
ఖమ్మం ఎడ్యుకేషన్, జనవరి12 : నూతన జోనల్ విధానంలో భాగంగా జీవో నెం 317తో విద్యాశాఖలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. సీనియార్టీ ప్రాతిపదికన చేసిన బదిలీల్లో ఉపాధ్యాయులులేని పాఠశాలలకు అధిక ప్రాధాన్యమిచ్చారు. ఉపాధ్యాయులు లేని పాఠశాలలతోపాటు సబ్జెక్ట్ టీచర్లు అవసరమైన పాఠశాలలకు పూర్తిస్థాయి ఉపాధ్యాయులను కేటాయించారు. తద్వారా ఆయా పాఠశాలలకు రెగ్యులర్ ఉపాధ్యాయులు రానుండడంతో పిల్లలు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందనున్నదని, గ్రామీణ విద్యకు జవసత్వాలు వస్తాయని విద్యానిపుణులు పేర్కొంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లోని ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్స్, లాంగ్వేజ్ పండిట్స్ ఇలా 25 రకాల కేటగిరీల్లో జిల్లా కేటగిరీగా పరిగణలోకి తీసుకొని బదిలీలు చేశారు.
ఖాళీలు భర్తీ..
రాష్ట్ర ప్రభుత్వం నూతన జోనల్ విధానంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను జోన్‌గా ఏర్పాటు చేసింది. భద్రాద్రి జోన్లో భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, ఖమ్మం జిల్లాలు ఉన్నాయి. జీవో నెం 317 ద్వారా నిర్వహించిన బదిలీల ప్రక్రియలోనూ ఖాళీల భర్తీకి అధిక ప్రాధాన్యమిచ్చింది. ఖమ్మం జిల్లాలో 13 మండలాల్లో 48 స్కూల్స్‌లో టీచరు లేరు. కామేపల్లిలో 01, రఘునాథపాలెంలో 01, తిరుమలాయపాలెంలో 05, కూసుమంచిలో 01, ఖమ్మం అర్బన్ 01, కోణిజర్ల 01, ఏన్కూరు 02, కల్లూరు 06, పెనుబల్లి 05, వేంసూరు 08, తల్లాడ 03, ఎర్రుపాలెం-13 పాఠశాలల్లో ఒక్క టీచరూ లేరు. వీటన్నింటికీ ఉపాధ్యాయులను కేటాయించడంతోవిద్యార్థులకు వరంలా మారింది.
డిప్యూటేషన్ల నుంచి విముక్తి..
ఉపాధ్యాయులు లేని పాఠశాలలు, సబ్జెక్ట్ టీచర్లు అవసరమైన పాఠశాలలకు సర్దుబాటు (డిప్యూటేషన్) నిర్వహించడం కత్తిమీద సామే. ప్రస్తుతం పని చేస్తున్న పాఠశాల నుంచి మరో పాఠశాలకు వెళ్లేందుకు ఉపాధ్యాయులు ఇష్టపడరు. విద్యార్థులకు న్యాయం చేసేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో డిప్యూటేషన్ (సర్దుబాటు) చేస్తారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లను కేటాయిస్తారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండి ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మరికొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండి ఉపాధ్యాయులు తక్కువగా ఉంటారు. ఈ క్రమంలో విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉన్న పాఠశాలలకు టీచర్లను డిప్యూటేషన్‌పై కేటాయిస్తారు. నూతన జోనల్ వ్యవస్థ ద్వారా ఉపాధ్యాయులు లేని పాఠశాలల్లో బదిలీల ద్వారా టీచర్లు రావడంతో డిప్యూటేషన్ల నుంచి విముక్తి లభించింది.
ఖమ్మం జిల్లాకు 602 మంది కేటాయింపు
ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి జిల్లా విభజనలో ఖమ్మానికి 4,684 మంది, భద్రాద్రికి 3,753 మంది, ములుగుకు 250 మంది, మహబూబాబాద్‌కు 336 మందిని కేటాయించారు. ఖమ్మం జిల్లాకు కేటాయించిన 4,684 మందిలో 4,082 మంది ఖమ్మం జిల్లాలోనే పనిచేస్తున్నారు. ఖమ్మానికి కేటాయించిన 602 మందిలో టీచింగ్‌తోపాటు నాన్టీచింగ్సిబ్బంది ఉన్నారు. మొత్తంగా 29 కేటగిరీలుండగా.. 25 టీచింగ్ కేటగిరీలు, నాలుగు నాన్‌టీచింగ్ కేటగిరీలున్నాయి. వీరిలో 584 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. 18 మంది నాన్ టీచింగ్ సిబ్బంది ఖమ్మం వచ్చారు. మొత్తం ఖమ్మం జిల్లాకు 602 మంది ఇతర జిల్లాల నుంచి అలాట్ అయ్యారు.
విద్యార్థులు, తల్లిదండ్రుల హర్షం
పాఠశాలలకు పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులను కేటాయించడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సత్తుపల్లి మండలంలో 21 మంది, కల్లూరు మండలంలో 37 మంది, పెనుబల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 52 మంది ఉపాధ్యాయులను కేటాయించారు. కొన్ని స్కూల్స్‌లో టీచర్లు లేకపోవడంతో డిప్యూటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు. డిప్యూటేషన్ల స్థానంలో రెగ్యూలర్ ఉపాధ్యాయులు రావడంతో సమస్యలు తొలగిపోయాయని గ్రామస్తులు సంతోషంగా ఉన్నారని సత్తుపల్లి ఎంఈవో రాములు‘ నమస్తే తెలంగాణ’కు తెలిపారు.
ఏజెన్సీలో 22 పాఠశాలలకు విముక్తి
కొత్తగూడెం ఎడ్యుకేషన్, జనవరి 12 : భద్రాద్రి జిల్లాకు 317 జీవో ప్రకారం 629 మంది ఉపాధ్యాయులను కేటాయించారు. ఇందులో ఎస్జీటీలు 254 మంది, 375 మంది స్కూల్ అసిస్టెంట్లు, పీఈటీ, లాంగ్వేజ్ పండిట్లు, క్రాఫ్ట్ టీచర్లు ఉన్నారు. కొన్నేళ్లుగా జిల్లాలోని వివిధ పాఠశాలల్లో వివిధ కారణాలతో రెగ్యులర్ ఉపాధ్యాయులు లేరు. 22 మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో విద్యాబోధన సరిగా జరగలేదు. ప్రస్తుతం ఆ పాఠశాలలకు రెగ్యులర్ ఉపాధ్యాయులను కేటాయించారు. అశ్వారావుపేట మండలం అల్లిగూడెం, గంగారం, నారాయణపురం, తోగ్గూడెంలో రెగ్యులర్ ఉపాధ్యాయులు లేరు. చర్ల మండలం ఆర్సీ పురం, కొత్తగట్ల, వీరపురం, దమ్మపేట మండలం నల్లకుంట, కొమ్ముగూడెం, దుమ్ముగూడెం మండలంలోని వీరభద్రాపురం, చిన్న కమలాపురం, గుండాల మండలం చింతలపాడు, తక్కెళ్లగూడెం, గలాబా, కరకగూడెం మండలం బర్లగూడెం, మోతె, లక్ష్మీదేవిపల్లి మండలం పాత బంగారు చెలకర, ములకలపల్లి మండలం తాళ్లపాయ, పినపాక మండలంలోని పలు పాఠశాలలకు రెగ్యులర్ ఉపాధ్యాయులు లేరు. ప్రస్తుతం బదిలీల్లో భాగంగా పూర్తిస్థాయి టీచర్లు రానుండడంతో గ్రామస్తులు, ఎస్ఎంసీ చైర్మన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
భద్రాద్రి జిల్లాలో 242 మంది ఉపాధ్యాయులకు డిప్యూటేషన్ కేటాయించారు. వివిధ కారణాలతో వారు పాఠశాలలకు వెళ్లేందుకు విముఖత చూపారు. కొందరు ఉపాధ్యాయులు మెడికల్ లీవ్ పెట్టేందుకు వెనుకాడలేదు. 317 జీవో ద్వారా జిల్లా విద్యాశాఖ ఉపాధ్యాయులు లేని పాఠశాలలకు ప్రాధాన్యం కల్పిస్తూ ఉపాధ్యాయులను కేటాయించింది. విద్యార్థులకు మెరుగైన బోధన అందడంతోపాటు సమస్యలకు పరిష్కారం లభించింది.
సంతోషంగా ఉంది
ఇన్ని రోజులు మా గ్రామంలోని పాఠశాలకు నెలకు ఒక ఉపాధ్యాయుడు మారేవారు. పూర్తిస్థాయిలో ఎవరినీ నియమించకపోవడంతో పిల్లల చదువులకు ఇబ్బంది కలిగింది. 317 జీవో పుణ్యమాని ఆ సమస్య తీరింది. మా ఊరి బడికి రెగ్యులర్ ఉపాధ్యాయులు రావడం సంతోషంగా ఉంది. పిల్లల చదువులకు ఢోకా లేదు.