విద్యాలయాల్లో సోలార్ విద్యుత్‌తో వెలుగులు విరజిమ్ముతున్నాయి. నిరంతర కరెంట్ సరఫరాతో విద్యార్థులకు కంప్యూటర్ క్లాస్‌లు సజావుగా సాగుతున్నాయి. అంతేకాకుండా విద్యుత్ బిల్లులు చెల్లించే బాధ నుంచి విముక్తి లభించింది. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎడ్యుకేషన్ హబ్‌లోని బాలుర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 20కిలోవాట్ల సౌర ప్లాంట్ ఏర్పాటు చేశారు. దీనిద్వారా నిత్యం 100యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతున్నది. దీంతో పాటు గజ్వేల్ మండలంలో తొమ్మిది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, రెండు పీహెచ్సీ కేంద్రాల్లో 3కేవీ సౌర ప్యానల్స్‌ను ఏర్పాటు చేశారు.అలాగే జాలిగామ క్లస్టర్ పరిధిలో తొమ్మిది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో సౌర(సోలార్) ప్యానల్స్‌ను ఏర్పాటు చేయడంతో సోలార్ విద్యుదుత్పత్తి సాధ్యమవుతున్నది.
గజ్వేల్ రూరల్, జనవరి 21: సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో అత్యాధునిక హంగులతో నిర్మించిన ఎడ్యుకేషన్ హబ్‌లోని బాలుర ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సౌర(సోలార్) వెలుగులు అందించారు. రూ.10లక్షలతో రాష్ట్ర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ ద్వారా సౌర వెలుగులు ఏర్పాటు చేశారు. సూర్యరశ్మితో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను వినియోగించుకోవడంతో విద్యుత్ బిల్లుల భారం చాలా తగ్గుతుంది. రాష్ట్రంలోనే ఎక్కడా లేనివిధంగా అత్యాధునిక హంగులతో గజ్వేల్‌లో రూ.150 కోట్లు వెచ్చించి ఎడ్యుకేషన్ హబ్‌ను సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో నిర్మించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుండడంతో పాటు సకల వసతులతో వసతిగృహాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులకు విద్యుత్ సమస్య ఉండకూడదనే ఉద్దేశంతో చేపట్టిన సౌర విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థ సత్ఫలితాలను అందిస్తుండగా, విద్యార్థులు, అధ్యాపకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
బాలుర డిగ్రీ కళాశాలలో…
ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాలను గజ్వేల్ పట్టణ సమీపంలోని పాలిటెక్నిక్ కళాశాల వద్ద నిర్మించారు. బాలుర డిగ్రీ కళాశాల కోసం మూడంతస్తుల భవనం నిర్మించారు. అందులో 72 గదులు ఉండగా.. కింది అంతస్తులోని 24 గదుల్లో కార్యాలయాలు, రెండో అంతస్తులోని 24 గదుల్లో గ్రంథాలయం, కంప్యూటర్ ల్యాబ్‌లు ఉన్నాయి. మూడో అంతస్తులోని 24 గదుల్లో తరగతి గదులకు కేటాయించారు. ప్రతి గదికి ఉన్న ప్యాన్లు, లైట్లు, ల్యాబ్‌లోని కంప్యూటర్లకు ప్రతిరోజు విద్యుత్ వినియోగం ఎంతో అవసరం ఉంటుంది. డిగ్రీలో 800 మంది, పీజీలో 200 మంది విద్యార్థులుండగా, మరో 50 మంది వరకు బోధన, బోధనేతర సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రతినెలా సుమారుగా రూ.20వేల వరకు విద్యుత్ బిల్లులు వస్తున్నాయి. గతేడాది జనవరిలో సౌర విద్యుత్‌ను రాష్ట్ర, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రారంభించారు. అప్పటి నుంచి కళాశాలకు విద్యుత్ బిల్లులు చెల్లించే సమస్య తప్పడంతో పాటు అదనంగా విద్యుత్ ఉత్పత్తి అవుతున్నది. అదనంగా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను కళాశాల విద్యుత్ సంస్థకు విక్రయిస్తున్నది.
నిత్యం విద్యుదుత్పత్తి..
గజ్వేల్ బాలుర డిగ్రీ కళాశాలపై ఏర్పాటు చేసిన 20కిలో వాట్ల సౌర ప్లాంట్ ద్వారా రోజుకు 100 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతున్నదని కళాశాల నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజు ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను కళాశాలకు వినియోగించుకోగా, మిగిలిన విద్యుత్‌ను విద్యుత్ శాఖకు విక్రయిస్తున్నారు. దీంతో నెలలో వినియోగించుకునే విద్యుత్‌లో మినహాయించి బిల్లు వేస్తున్నారు. ప్లాంట్ నిర్మాణంతో కళాశాలకు ప్రతినెలా విద్యుత్ బిల్లులు చెల్లించే పరిస్థితి ఉండడం లేదని ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గజ్వేల్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ ప్లాంట్ రాష్ట్రంలోనే తొలిది కావడం విశేషం.
మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో…
రాష్ట్రంలోనే ప్రథమంగా గజ్వేల్ మండలంలో తొమ్మిది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, రెండు పీహెచ్సీ కేంద్రాల్లో 3కేవీ సౌర ప్యానల్స్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయించింది. దీంతో బిల్లులు చెల్లించలేని పాఠశాలలకు కరెంట్ బాధలు తీరాయి. జిల్లా ఇంధన వనరుల శాఖ ఆధ్వర్యంలో గజ్వేల్ మండలం జాలిగామ క్లస్టర్ పరిధిలో జాతీయ రూర్బన్ మిషన్ పథకం కింద తొమ్మిది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో సౌర(సోలార్) ప్యానల్స్‌ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతినెలా విద్యుత్ బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఉండడంతో బిల్లుల నుంచి ఉపశమనం కలిగే విధంగా అధికారులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని అధికారులు చేసిన ప్రయత్నం సఫలీకృతం అవుతున్నది. ప్రతినెలా సుమారుగా ఒక్కో పాఠశాలలో రూ.600 నుంచి రూ.800 వరకు కరెంట్ బిల్లులు వస్తున్నాయి. ప్రతి రెండు నెలలకోసారి బిల్లులు చెల్లించని పాఠశాలలకు విద్యుత్ అధికారులు కరెంట్‌ను కట్ చేయడంతో కంప్యూటర్ ల్యాబ్‌కు విద్యార్థులు దూరమవడం, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. ఇక అలాంటి సమస్యలు రాకుండా సోలార్ ప్యానల్స్‌తో విద్యుత్ నిరంతరంగా అందుతున్నది. మండలంలోని 25 గ్రామ పంచాయతీలపై అధికారులు సోలార్ ప్యానల్స్‌ను ఏర్పాటు చేయగా, త్వరలోనే పనులు పూర్తి చేసి వీటిని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
సీఎం కేసీఆర్ చొరవతో ఏర్పాటు..
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గజ్వేల్‌లో బాలుర, బా లికల హబ్‌లను సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని అత్యాధునిక హంగులతో నిర్మించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య ను అందించాలనే ఉద్దేశంతో కేజీ టూ పీజీ సౌకర్యం ఇక్కడ కల్పించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మండలంలోని ఉన్నత పాఠశాలల్లో నిరంతర విద్యుత్ ఉండాలనే ఉద్దేశంతో సోలార్ ప్యానల్స్‌ను ఏర్పాటు చేశాం. సోలార్ ప్యానల్స్ ఏర్పాటుతో సత్ఫలితాలు వస్తున్నాయి.
-ముత్యంరెడ్డి, ‘గడా’ ఓఎస్డీ
సౌకర్యవంతంగా సోలార్ ప్యానల్స్ ..
కళాశాలపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యా నల్స్ సౌకర్యవంతంగా ఉన్నాయి. అవసరాల మేరకు విద్యుత్ వినియోగించుకొని అదనంగా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను విద్యుత్ శాఖకు విక్రయిస్తున్నాం. ఇప్పుడు కరెంట్ సమస్య వేధించడం లేదు. ల్యాబ్‌లో ఉండే విద్యార్థులకు ఎలాంటి సమస్యలేదు. నిరంతరం విద్యార్థులకు కరెంట్ సరఫరా అవుతున్నది.
-శ్రీనివాస్‌రెడ్డి, ప్రిన్సిపాల్, బాలుర డిగ్రీ కళాశాల గజ్వేల్