
సర్వే నంబర్ల వారీగా సాగు వివరాల నమోదు
క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న వ్యవసాయశాఖ సిబ్బంది
ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా పక్కాగా పంట వివరాల నమోదు
ఈ లెక్కల ఆధారంగా దిగుబడుల అంచనా.. పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు ఏర్పాట్లు
భాగస్వాములవుతున్న రైతుబంధు సమితి ప్రతినిధులు
పర్యవేక్షిస్తున్న జిల్లా వ్యవసాయశాఖ అధికారులు
రోజువారీగా ఆన్లైన్లో నమోదు
వానకాలం సాగు వివరాలను వ్యవసాయశాఖ సేకరిస్తున్నది. వ్యవసాయ క్లస్టర్ల వారీగా ఆ శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వివరాలు నమోదు చేస్తున్నారు. సర్వే నెంబర్లు, రైతుల వారీగా పక్కాగా వివరాలు సేకరిస్తున్నారు. ఏ గుంటలో ఏపంట వేశారు.. ఏ ఊరిలో ఏఏ పంట ఎంత వేశారు.. తదితర అన్ని వివరాలు సేకరిస్తున్నారు. రైతుబంధు సమితి ప్రతినిధులు సైతం సర్వేలో భాగస్వాములవుతున్నారు. పది రోజులుగా ఈ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుండగా.. రోజూవారీగా ప్రత్యేక ఫార్మాట్లో వివరాలు నమోదు చేసి ఆన్లైన్ చేస్తున్నారు. సాగు వివరాల ఆధారంగానే రైతులకు కావాల్సిన ఎరువులు, పురుగు మందులను ప్రభుత్వం అందుబాటులో ఉంచుతుంది. పంట దిగుబడులు అంచనా వేసి, పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయనున్నది. అందుకే వ్యవసాయశాఖ పక్కాగా వివరాలు సేకరిస్తున్నది.
సిద్దిపేట, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వానకాలంలో రైతులు సాగు చేసన పంటల వివరాలను క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వ్యవసాయశాఖ సిబ్బంది సేకరిస్తున్నారు. సర్వే నెంబర్లు, రైతుల వారీగా పక్కాగా వివరాలు నమోదు చేస్తున్నారు. ఏ గుంటలో ఏపంట వేయారు.. ఏ ఊరిలో ఏ పంట ఎక్కువగా వేయారు తదితర అన్ని వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. రైతుబంధు సమితి ప్రతినిధులు సైతం సర్వేలో భాగస్వాములవుతున్నారు. వారం, పది రోజులుగా ఈ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. రోజూవారీగా ప్రత్యేక ఫార్మాట్లో వివరాలు నమోదు చేసి ఆన్లైన్ చేస్తున్నారు. ప్రతి రైతు సాగు వివరాలను పక్కాగా తెలియజేయాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. పంటసాగు వివరాలు తప్పుగా నమోదు చేస్తే అమ్మే సమయంలో ఇబ్బందులు తప్పవని అధికారులు చెబుతున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో…
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈసారి విస్తారంగా వర్షాలు కురిశాయి. చెరువులు, చెక్‌డ్యామ్‌లు, కుంటలు నిండి వాగులు పొంగి పొర్లుతున్నాయి. భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. వర్షాలకు తోడు కాళేశ్వరం జలాలతో రిజర్వాయర్లు నిండుకుండలా మారాయి. ఎటుచూసినా జలసవ్వడులు కనిపిస్తున్నాయి. దీంతో రైతులు ఉత్సాహంగా పంటలు సాగుచేశారు. చినుకు పడకముందే రైతుబంధు కింద ఎకరాకు రూ.5వేల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు జమచేసింది. దీంతో విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు ఆ డబ్బులు రైతులకు అక్కరకొచ్చాయి. నాణ్యమైన ఉచిత కరెంట్ సరఫరా అవుతుండడంతో బోరుబావుల కింద భారీగా పంటలు సాగుచేస్తున్నారు. అన్నిరకాలుగా రైతులకు ప్రభుత్వం దన్నుగా నిలబడడంతో ఈ వానకాలంలో సాగు గణనీయంగా పెరిగింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వరి సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. వరిలో దొడ్డు, సన్నరకాలు, పత్తి, మొక్కజొన్న, కంది తదితర పంటలను సాగుచేశారు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా వరినాట్లు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి రైతు ఏపంటను ఎన్ని ఎకరాల్లో సాగు చేశారనే వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు సేకరిస్తున్నారు. వరి పూర్తి సాగు వివరాలకు మరికొంత సమయం పడుతుంది. కొన్ని ప్రాంతాల్లో వరినాట్లు వేస్తున్నారు.
లక్షల ఎకరాల్లో పంటల సాగు… ఈ వానకాలంలో సిద్దిపేట
జిల్లాలో 5,30,576 ఎకరాలు, మెదక్ జిల్లాలో 3,21,650 ఎకరాలు, సంగారెడ్డి జిల్లాలో 7,40,845 ఎకరాల్లో పంటలు సాగుకానున్నాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ప్రస్తుతం వ్యవసాయశాఖ క్లస్టర్ల వారీగా సాగు వివరాలను అధికారులు నమోదు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో తొలిసారి ఆయిల్‌పాం తోటలు పెట్టారు. మల్బరీ సాగు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరిలో ఈ ఏడాది వెదజల్లే పద్ధతిని ప్రోత్సహిస్తున్నది. దీంతో చాలా మంది రైతులు ఆ దిశగా ప్రయత్నం చేశారు. కాగా, పక్కాగా సాగు వివరాలు నమోదు చేస్తున్నారు. రైతు పండించిన పంట ఒకటి, నమోదు మరోటి ఉంటే ధాన్యం అమ్ముకునే సమయాల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం సాగు వివరాలను పక్కాగా సేకరిస్తున్నది. పూర్తిసాగు వివరాల ద్వారా మార్కెటింగ్ ఏర్పాట్లు, కావాల్సిన ఎరువులు అందుబాటులో ఉంచనున్నది.
వివరాలు నమోదు చేస్తున్నాం..
వానకాలంలో రైతులు సాగుచేసిన పంటల వివరాలను సర్వేనెంబర్ల ఆధారంగా నమోదు చేస్తున్నారు. క్లస్టర్ల వారీగా వ్యవసాయశాఖ సిబ్బంది, రైతు సమన్వయ సమితి సభ్యులు కలిసి ఫీల్డ్ విజిట్ చేసి వివరాలు నమోదు చేస్తున్నారు. వ్యవసాయశాఖ అధికారులు వచ్చినప్పుడు రైతులు పక్కాగా వివరాలు తెలియజేయాలి. ఇప్పుడు పంటల సాగు వివరాలు సరిగా తెలియజేస్తేనే, రేపు పంట ఉత్పత్తులను సులభంగా అమ్ముకోవడానికి వీలుంటుంది. చాలా క్లస్టర్లలో సాగు వివరాల నమోదు ప్రక్రియ చివరి దశకు వచ్చింది. ఏరోజు వివరాలను ఆరోజే ఆన్లైన్లో నమోదు చేస్తున్నాం. వరినాట్లు ఇంకా కొనసాగుతున్నాయి. నెలాఖరులోగా పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తాయి.