
ట్రాఫిక్ ఉల్లంఘనలపై నిఘానేత్రం
వాహనదారులూ నిబంధనలు పాటించండి
ఉల్లంఘిస్తే తప్పించుకోవడం ఇక కుదరదు
ఆధునిక ఏఎన్టీఆర్ కెమెరాలతో పర్యవేక్షణ
పైలెట్ ప్రాజెక్టుగా సిద్దిపేట కమిషనరేట్ ఎంపిక
సంగారెడ్డి, పటాన్చెరులో ఎలక్ట్రానిక్ ఎన్ఫోర్సుమెంట్ డివైస్ ఏర్పాటు
రోడ్డు భద్రతా చర్యల్లో భాగంగా ప్రభుత్వ నిర్ణయం
రోడ్డు నిబంధనలు ఉల్లంఘిస్తే 15 రోజుల్లో ఈ-చలాన్ జారీ
ఎలక్ట్రానిక్ వ్యవస్థ ద్వారా ట్రాఫిక్ పర్యవేక్షణ
అత్యాధునిక టెక్నాలజీ వినియోగం
సిద్దిపేట టౌన్, ఆగస్టు 21 : సిద్దిపేట పోలీసు కమిషనరేట్ ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నది. ఇప్పటికే హైదరాబాద్ తరహా ట్రాఫిక్ వ్యవస్థను రూపొందించి ప్రమాదాలను నివారిస్తున్నది. కాగా, ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను మరింత పటిష్టంగా అమలుపర్చేందుకు సిద్దిపేట పోలీసు కమిషనరేట్‌లో ఆధునిక ఏఎన్టీఆర్ కెమెరాలు అందుబాటులోకి రానున్నాయి. పైలెట్ ప్రాజెక్టుగా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ఎంపికైంది. హైదరాబాద్‌లో విజయవంతంగా అమలవుతున్న విధంగానే సిద్దిపేటలోనూ అమలుపర్చేందుకు కార్యాచరణ రూపొందింది. ఇప్పటికే సిద్దిపేటలో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ కెమెరాలను బిగించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు ఆయా కూడళ్లలో ప్రత్యేక నిఘా పెట్టేవారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ, హెల్మెట్ ధరించకుండా అతివేగంగా వాహనాలు నడిపే వారిని కెమెరాలు, ట్యాబ్‌ల్లో బంధించి జరిమానాలు విధించేవారు. అయినా కొందరు వాహనదారులు సిగ్నల్ జంప్‌చేసి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఇక అలాంటి వారి ఆటలు సాగవు. ఇప్పటి దాకా ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క అన్న విధంగా పోలీసులు ఆధునిక కెమెరాలను త్వరలో అందుబాటులోకి తేనున్నారు.
పైలెట్ ప్రాజెక్టుగా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్..
అన్నింటా ఆదర్శంగా నిలుస్తున్న సిద్దిపేట, ట్రాఫిక్ వ్యవస్థ అమలు విషయంలోనూ అదే పంథాలో దూసుకెళ్తున్నది. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ ఏఎన్టీఆర్ కెమెరాలను అస్త్రంగా వినియోగించనున్నది. రాష్ట్రంలోని ఆరు కమిషనరేట్లను ఈ విధానం అమలుకు ఎంపిక చేసింది. అం దులో మొట్టమొదటగా సిద్దిపేట కమిషనరేట్ పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైంది. దాదాపు ఇప్పటికే కెమెరాల బిగింపు ప్రక్రి య పూర్తయింది. వీటిని పోలీసు కమిషనరేట్ కార్యాలయంలోని ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేసింది. అక్కడి నుంచి ట్రాఫిక్ ఉల్లంఘనలు గుర్తించేలా పకడ్బందీగా ఏర్పాటు చేసింది. రాత్రి సమయాల్లో సైతం కెమెరాలు చిత్రీకరించిన చిత్రాలు స్పష్టంగా ఏర్పడే విధానం వీటి ప్రత్యేకత.
తప్పించుకోవడం కుదరదు..
ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేశాం.. పోలీసుల కండ్లు కప్పాం అనుకుంటే పొరపాటే. మిమ్మల్ని వెంటాడే వెంబడించే కెమెరాలు ఉన్నాయి పారాహుషార్. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఆధునిక నిఘా నేత్రాలు వచ్చేశాయి. పాత బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ వద్ద మూడు ప్రధాన మార్గాలతో పాటు సుభాశ్ రోడ్‌తో కలిపి ఆధునిక కెమెరాలను బిగించారు. 4 ఎవిరెన్సీ కెమెరాలను ఏర్పాటు చేశారు. హెల్మెట్ ధరించకుండా, సెల్‌ఫోన్ మాట్లాడుతూ ట్రాఫిక్ సిగ్నల్ అతిక్రమించే వారిని ఈ కెమెరాలు చిత్రీకరిస్తాయి. వాహనాలు దొంగిలించిన వారిని గుర్తిసాయి. అదే సమయంలో కమాం డ్ కంట్రోల్ రూంలో అలారం మోగుతుంది. దీంతో పోలీసులు అప్రమత్తమై వారిని పట్టేస్తారు. ఇన్ని ప్రత్యేకతలతో కూడిన కెమెరాలు త్వరలోనే సిద్దిపేట పోలీసు కమిషనరేట్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఆ దిశగా పోలీసులు కసరత్తును పూర్తి చేశారు.
సంగారెడ్డి, పటాన్చెరులో ఎలక్ట్రానిక్ ఎన్ఫోర్సుమెంట్ డివైస్..
ట్రాఫిక్, ఎక్కువగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్న సంగారెడ్డి, పటాన్చెరు పట్టణాల్లోని కూడళ్లు, రహదారులు ఎలక్ట్రానిక్ (ఎలక్ట్రానిక్ ఎన్ఫోర్సుమెంట్ డివైస్) పర్యవేక్షణలోకి తేవాలని కేంద్ర రహదారులు, రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయింయింది. దీనికి సంబంధించి గురువారం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. దీని ప్రకారం డ్రైవింగ్ సమయంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం, వేగ నియంత్రణ పాటించకపోవడం, పార్కింగ్ నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకుంటారు. ఎలక్ట్రానిక్ వ్యవస్థ దీనిని కనిపెట్టి జరిమానాలు ఆన్లైన్లో విధిస్తున్నది. సీసీ కెమెరాలు, స్పీడ్‌గన్, స్పీడ్ కెమెరా, ఆటోమేటిక్ నంబర్‌ప్లేట్ రికగ్నజేషన్, వెయిట్ ఇన్ మేషిన్ వంటి అత్యాధునిక పరికరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసి ఠాణాలు, కమాండ్ కం ట్రోల్ సెంటర్లకు అనుసంధానం చేస్తున్నది. వీటి ద్వారా ట్రా ఫిక్ నియంత్రణ, పర్యవేక్షణతోపాటు నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు ఆన్లైన్లో జరిమానాలు విధిస్తారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
సిద్దిపేట అన్నింట్లో ఆదర్శం గా నిలుస్తున్నది. పెరుగుతున్న ట్రాఫిక్‌కు అనుగుణంగా సిద్దిపేటలో ఆధునిక ట్రాఫిక్ వ్యవస్థను రూపొందిస్తున్నాం. అం దులో భాగంగానే హైదరాబాద్ తరహా ఏఎన్టీఆర్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాం. వాహణాదారులు ట్రాఫిక్ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలి.