
దుబ్బాక బాలాజీ దేవాలయంలో వైభవంగా ప్రారంభోత్సవ వేడుకలు
వేలాదిగా హాజరైన భక్తులు
భక్తులను ఆశీర్వదించిన చినజీయర్ స్వామి
దుబ్బాక బాలాజీ ఆలయంలో త్రిదండి చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో తీర్థగోష్టి కార్యక్రమం
పాల్గొన్న ప్రజాప్రతినిధులు, భక్తులు
నాచగిరి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు
బాలాజీ క్షేత్రం భక్తజన సంద్రం..
దుబ్బాక, ఆగస్టు 21: దుబ్బాక బాలాజీ ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. స్వామివారికి త్రిదండి చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో తీర్థ గోష్టి మహదాశీర్వచనం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పలు ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులకు చినజీయర్ స్వామి ఉపదేశం ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. పూజాకార్యక్రమాల్లో ఎమ్మెల్యే రఘునందన్, మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనితారెడ్డి, ఆలయ ట్రస్టు చైర్మన్ వడ్లకొండ శ్రీధర్, కార్యదర్శి చింత రాజు, ట్రస్టు సభ్యులు, జడ్పీటీసీ రవీందర్రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రొట్టే రాజమౌళి, కౌన్సిలర్లు, సర్పంచ్, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
నాచగిరిక్షేత్రంలో వ్రతాలు..
వర్గల్, ఆగస్టు 21: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నాచగిరి లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో శనివారం శ్రావణమాసాన్ని పురస్కరించుకొని సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఆచరించారు. ఆయా ప్రాంతాల నుంచి ఆలయానికి తరలివచ్చిన భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి దేవతామూర్తులను దర్శించుకున్నారు.