
కట్టిపడేస్తున్న ఆకృతులు
రూపాయి నుంచి 2800 వరకు రాఖీలు
కొనుగోళ్లతో కిటకిటలాడుతున్న దుకాణాలు
ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేసిన అధికారులు
సిద్దిపేట టౌన్/హుస్నాబాద్/రామాయంపేట, ఆగస్టు 20 : అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్. నేను నీకు రక్ష.. నీవు నాకు రక్ష.. మనమందరం దేశానికి రక్ష.. అనే అంతర్లీనమైన గొప్ప సందేశం పండుగలో దాగి ఉంది. అంత విశిష్టత గల పండుగకు ఆడపడుచులు తోబుట్టువులకు రాఖీ కట్టడం ఆనవాయితీగా వస్తుంది. రక్షాబంధన్ పురస్కరించుకొని జిల్లా కేంద్రం సిద్దిపేటలో వివిధ రకాల ఆకృతులలో తయారు చేసిన రాఖీలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
రూపాయి నుంచి 2800 వరకు రాఖీలు..
రాఖీ పండుగ సందర్భంగా వ్యాపారులు కొనుగోలుదారులను ఆకర్శించేందుకు కల్కత్తా, సూరత్, రాజస్థాన్, ముంబై ఇతర రాష్ర్టాల్లో తయారు చేసిన రాఖీలను తెప్పించారు. రూపాయి రాఖీ మొదలుకొని 2800 విలువైన రాఖీలను విక్రయానికి పెట్టారు. చిన్నారులను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా రాఖీలను తయారు చేయించారు. స్టోన్స్ పొదిగిన రాఖీలు, మూడు రంగుల రాఖీలు, దూది రాఖీలు ఇలా వివిధ రకాల ఆకృతుల్లోని రాఖీలు విక్రయిస్తున్నారు.
రాఖీ కొనుగోలు సెంటర్ల వద్ద సందడి..
రక్షాబంధన్ పురస్కరించుకొని వ్యాపారస్తులు ఈ ఏడాది భారీగా విక్రయ దుకాణాలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే హోల్‌సేల్, రిటైల్‌గా రాఖీలను విక్రయానికి పెట్టారు. రాఖీ పండుగ దగ్గర పడడంతో కొనుగోలుదారులు రాఖీలు కొనుగోలు చేసేందుకు సెంటర్లకు వచ్చారు. దీంతో దుకాణాల వద్ద సందడి నెలకొంది. జిల్లా కేంద్రం సిద్దిపేటతో పాటు సరిహద్దు జిల్లాలైన కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జనగామ, మెదక్ తదితర ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున రాఖీలు కొనుగోలు చేసేందుకు వచ్చారు. ఒకేరోజు లక్షలాది వ్యాపారం సిద్దిపేటలో జరిగింది.
హుస్నాబాద్ బస్టాండ్‌లో రాఖీల దుకాణం…
హుస్నాబాద్ పట్టణంలో రాఖీ పౌర్ణమి సందడి షురువైంది. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రాఖీ దుకాణాలు కొనుగోళ్లతో కిటకిటలాడాయి. పండుగ సందర్భంగా రాకపోకలు పెరగడంతో ఆర్టీసీ బస్టాండ్‌లో సైతం ప్రయాణీకుల రద్దీ నెలకొంది. అన్నాతమ్ముళ్లు అందుబాటులో లేని మహిళలకు ఆర్టీసీ వారు మంచి అవకాశం కల్పించారు. హుస్నాబాద్ బస్టాండ్ ఆవరణలోనే రాఖీల దుకాణం ఏర్పాటు చేశారు. ‘రాఖీలు కొనుగోలు చేయండి…ఆర్టీసీ కొరియర్లో అన్నాతమ్ముళ్లకు పంపండి’… అంటూ మైక్‌లో అనౌన్స్ చేస్తున్నారు. అతి తక్కువ ఖర్చుతో రాఖీల కొరియర్ సర్వీసు చేస్తున్నందున ఆర్టీసీ అధికారులు చేసిన ప్రయత్నానికి స్పందన వస్తున్నది.
రామాయంపేటలో రాఖీలు సిద్ధం..
రక్షాబంధన్‌కు పండుగకు రామాయంపేటలో రాఖీలు సిద్ధం గా ఉన్నాయి. రామాయంపేట చుట్టూ ఉన్న ఆరు మండలాలకు వ్యాపార కేంద్రమైన రామాయంపేటలోనే ఏ వ్యాపారానికైనా ప్రత్యేకత ఉంటుంది. హైదరాబాద్ నగరంలో ఉన్న ధరలు రామాయంపేటలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. రాఖీల కోసం చిన్నశంకరంపేట, నిజాంపేట, నార్సింగి, చేగుంట, కామారెడ్డి జిల్లా బిక్కనూరు, బీబీపేటవాసులు వ్యాపారరీత్యా రామాయంపేట పట్టణానికి వెళ్లి కొనుగోలు చేస్తారు.