
వైభవంగా వేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం
చినజీయర్‌స్వామి చేతులమీదుగా కార్యక్రమం
గోవింద నామస్మరణతో మార్మోగిన దుబ్బాక పట్టణం
మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి హాజరు
భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు..
ఘనంగా వేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఇలలో వైకుంఠం.. దుబ్బాక పట్టణ శ్రీహరివాసం.. బాలాజీ దేవాలయంలో ప్రారంభ వేడుకల్లో భాగంగా శుక్రవారం విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు వైభవంగా జరిగాయి. చినజీయర్ స్వామి చేతులమీదుగా లక్ష్మీసహిత వేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా సాగింది. ఈ కార్యక్రమాలకు ముఖ్యఅతిథులుగా మంత్రి హరీశ్‌రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి హాజరయ్యారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు వేకువజామునే తరలివచ్చారు. రాత్రి జరిగిన వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవానికి హాజరైన భక్తులు, తన్మయత్వం చెందారు. వారం రోజులుగా ఆలయ ప్రాంభోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగతున్నాయి.
దుబ్బాక, ఆగస్టు 20 : ‘నమో వేంకటేశా.. ఆపద మొక్కుల వాడ శ్రీనివాస.. నారాయణ.. నారాయణ.. గోవిందా.. గోవింద’.. అంటూ భక్తులు తన్మయత్వంతో దుబ్బాకలో కొలువుదీరినా వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. దుబ్బాక పట్టణంలో నూతనంగా నిర్మించిన బాలాజీ దేవాలయంలో శుక్రవారం త్రిదండి చినజీయర్ స్వామి చేతుల మీదుగా లక్ష్మీసహిత వేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా మంత్రి హరీశ్‌రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి హాజరయ్యారు. చిన జీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి తిలకించేందుకు వేకువజాముననే భక్తులు తరలివచ్చారు. సుమారు 5 గంటల పాటు జరిగిన పూజాకార్యక్రమాల్లో ఎమ్మెల్యే రఘునందన్, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ వనితారెడ్డి, ఎంపీపీ పుష్పలత, జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, పీసీఎస్ చైర్మన్ కైలాస్, ఏఎంసీ చైర్మన్ శ్రీలేఖ రాజు, నాయకులు రొట్టే రాజమౌళి, మద్దుల నాగేశ్వరరెడ్డి, బక్కి వెంకటయ్య, వెంకటనర్సింహారెడ్డి, రజనీకాంత్ రెడ్డి ట్రస్టు చైర్మన్ శ్రీధర్, కార్యదర్శి రాజు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం..
దుబ్బాక బాలాజీ దేవాలయంలో లక్ష్మీ సహిత వేంకటేశ్వరస్వామి, ఓ పక్క శ్రీదేవి, మరో పక్క గోదాదేవి విగ్రహాలతో పాటు వినాయక, ఆంజనేయ స్వామి విగ్రహాలను త్రిదండి చినజీయర్ స్వామి ప్రతిష్ఠించారు. ఉదయం 10.28గంటలకు చినజీయర్ స్వామి వేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహాకుంభాభిషేకాన్ని నిర్వహించారు. పక్కపక్కనే ఆలయాల్లో పద్మావతి, గోదాదేవి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠతో పాటు విఘ్నేశ్వర, వీరాజంనేయ విగ్రహాలు ప్రతిష్ఠించారు. అనంతరం రాజగోపురం పూజ, నయనోన్మీలనం, దృష్ట్టి కుంభం, ప్రథమారాధన, మంత్రాదానం నివేదన, మంగళశాసనం, విన్నపాలు, శాత్తుమురై ఆళ్వార్ ఆచార్య మరియాద, శాంతి కల్యాణం, తీర్థగోష్ఠి మహాదాశీర్వాచనం, ఆచార్య సన్మానం కార్యక్రమాలు జరిగాయి.
దుబ్బాకపై ప్రేమతో ఆలయ నిర్మాణం