e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, November 28, 2021
Home జిల్లాలు అంధకారంలో అక్షరక్రాంతి

అంధకారంలో అక్షరక్రాంతి

  • తోటి వారు అవహేళన, లూయీ స్ఫూర్తితో ముందుకు..
  • ఏపీజీవీబీ బ్యాంక్‌లో ఉద్యోగం సాధించిన అంధుడు ఐలయ్య
  • మనో సంకల్పం లేని ఎందరికో స్ఫూర్తిదాయకం

కండ్ల్లు కనిపించని నీకు చదువు ఎందుకురా, నీవు ఎలా చదువుతావు.. ఎం సాధిస్తావ్‌ అంటూ తరగతి గదిలో సహచర విద్యార్థుల వెక్కిరింతలు.. ఆ బాలుడిని మనోక్షోభకు గురిచేశాయి. అయినా భయపడలేదు, వెనుదిరగలేదు.. మానవత్వం నిండుకున్న ఓ మాస్ట్టర్‌ ప్రోత్సాహంతో వెక్కిరింతలకు గురైన అంధ విద్యార్థి పట్టుదలతో ఉన్నత విద్య చదివి, బ్యాంక్‌లో ఉద్యోగం సంపాధించాడు. ఆనాడు వెక్కిరించిన వాళ్లు ఎక్కడున్నారో.. కానీ, ఈ యువకుడు మాత్రం ఎంచక్కా బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. మారు మూల గ్రామంలో పుట్టి, కండ్లు కనిపించకున్నా.. పట్టుదలతో ముందుకు సాగిన ఓయువకుడి విజయ గాథపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.

దుబ్బాక, అక్టోబర్‌ 19 : ముక్కు పచ్చలారని బాల్యంలోనే అమ్మతల్లి (మశూచి, తట్టు) వ్యాధి మూలంగా కంటి చూపునకు నోచుకోలేక పోయాడు. తన తోటి వారు ఆట పాటలు, చదువు, సంధ్యల్లో లీనమవుతూ సంతోష పడుతుంటే.. కండ్ల ముందు జరుగుతున్న దృశ్యాలను చూడలేని ఆయువకుడు ఇంటికే పరిమితమయ్యాడు. నేనేం పాపం చేశానంటూ.. మనోవేదనపడుతున్న ఆయువకుడి జీవితంలో ఒకరు కాంతిని నింపి విద్యావంతుడిని చేశారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్‌ మధిర గ్రామం తిరుమలగిరికి చెందిన బూడిది ఐలమ్మ-బాలయ్య ఏకైక సంతానం ఐలయ్య (29). అప్పటి వరకు వీరికి ఇద్దరు కూతుర్లు ఉండటంతో కొడుకు కావాలని ఎదురు చూసిన వారికి ఐలయ్య జన్మించడంతో వారి సంతోషానికి అవధులు లేవు. కానీ, వీరి సంతోషానికి విధి కన్ను కుట్టింది. ఐలయ్య అప్పుడప్పుడే కంటి చూపుతో విషయ జ్ఞానం తెలుసుకుంటున్న సమయంలో (7 మాసాలు) ఉండగానే అమ్మతల్లి వ్యాధి సోకడంతో ముఖమంతా ఆమ్మోరు బుగ్గలు పొడవడంతో రెండు కండ్లకు వ్యాధి సోకి కండ్లు కోల్పోయాడు. లేక లేక పుట్టిన కుమారుడు అంధుడు కావడంతో వారి కుటుంబంలో చీకటి అలుముకున్నది.

- Advertisement -

వెలుగులు నింపిన మానవత్వం

ఐలయ్య అంధత్వం మూలంగా అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. అక్కలతో కలిసి పాఠశాలకు వెళ్లినా ఉపాధ్యాయులు చెప్పింది అర్థం కాకపోవడంతో ఎంతో మానసిక ఆందోళనకు లోనయ్యేవాడు. అంధకారంలో ఉన్న ఐలయ్యకు మానవత్వం ఉన్న ఓ యువకుడు అందించిన సాయం..అతడి జీవితంలో వెలుగులు నింపింది. ఐలయ్య కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్న అదే గ్రామానికి చెందిన దాతారు శరత్‌ చందన్‌రావు ఐలయ్యను విజ్ఞానవంతుడిగా చేయాలని సంకల్పించారు. మొదట్లో ఈ విషయానికి వారి కుటుంబ సభ్యులు కండ్లు కనిపించని వానికి చదువెలా వస్తుందని వారు వెనుక ముందు కాగా, అంధులకు విద్య పట్నంలో ఉంటుందని ఆయన భరోసానిచ్చాడు. ఐలయ్యను 18 జనవరి 2004లో హైదరాబాద్‌లోని పెద్ద అంబర్‌పేటలోని శినేత్ర అంధుల పాఠశాలలో చేర్పించారు. ఆ ప్రైవేటు పాఠశాలలో ఆర్కెస్ట్రా ఉండేది. సీనియర్‌ అంధ దివ్యాంగులు ప్రదర్శనలు చేసి వచ్చిన వాటితో పాటు దాతల సాయంతో ఆపాఠశాలను నిర్వహించేవారు. అక్కడ ఉన్న బ్రెయిలీ లిపి ద్వారా అక్షర జ్ఞానం నేర్చుకున్నాడు. పదో తరగతి శేరిగూడ ప్రభుత్వ పాఠశాలలో ఒక రైటర్‌ సాయంతో పరీక్షలు విజయవంతంగా పూర్తి చేశారు. ఎల్వీ ప్రసాద్‌ కంటి దవాఖానలో అంధుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన టేపురికార్డుల ద్వారా ప్రశ్న, జవాబులు నేర్చుకున్నారు. పదో తరగతి తర్వాత హైదరాబాద్‌లోని దివ్యాంగుల ప్రభుత్వ హాస్టల్‌లో ఉంటూ ఉన్నత విద్యను కొనసాగించారు. ఇంటర్‌ ఉప్పల్‌ జీఎల్‌ఆర్‌ న్యూ మోడల్‌ కళాశాలలో పూర్తి చేసిన ఐలయ్య, డిగ్రీ విద్యాభ్యాసం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2015లో పూర్తి చేశారు. అంధుడు కావడంతో హాస్టల్‌ నుంచి కళాశాలకు వెళ్లడం రోజూ ఇబ్బందులు ఎదురైనా.. ఆత్మవిశ్వాసంతో ముం దుకు సాగారు. చేతి కర్ర సాయంతో రోడ్డు దాడి బస్టాండ్‌కు చేరుకోవడం, అక్కడ ఉన్న ప్రయాణికులకు బస్సు నంబరు అడిగి బస్సులో ఎక్కడం, కళాశాల వద్ద దిగడం రోజూ జరుగుతుండేది. సాటి ప్రయాణికులతో పాటు కళాశాల విద్యార్థులు కూడా సహకరించేవారు. వనస్థలిపురంలోని శ్రీహిందూ బీఈడీ కళాశాలలో బీఈడీ విద్య నభ్యసించాడు. బ్యాంక్‌ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షల్లో ఐలయ్య అర్హత సాధించడంతో సిద్దిపేటలోని ఏపీజీవీబీ సరస్వతీ నగర్‌ బ్రాంచ్‌లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ, కాళ్లు చేతులు అన్ని అవయవయాలు బాగున్నా, మనో సంకల్పం లేని ఎంతో మందికి స్ఫూర్తి దాయకంగా నిలుస్తున్నారు.

ఇంతదాకా.. వస్తాననుకోలేదు

అంధులకు చదువు ఉంటుందా అనుకున్నా.. పొలం కాడికి తల్లిదండ్రుల వెంట వెళ్లేవాడ్ని. అక్కలతో కలిసి పాఠశాలకు వెళితే ఎవరూ పట్టించుకునే వారు కారు. వారు చెప్పిన చదువులు నాకు అర్థమయ్యేవి కాదు.. ఇక నా జీవితం ఇంతేనా.. అని బాధపడేవాడిని. శరత్‌ చందన్‌రావు సార్‌ నా జీవితానికి దారి చూపకుంటే మాగ్రామంలోనే ఇంటికే పరిమితమయ్యేవాడిని. ఆయన నాకు ఆర్ధికంగా సాయం చేశారు. ఆయన చేసిన సేవలు మరువలేను. సార్‌కు రుణపడి ఉంటా.
-ఐలయ్య

స్ఫూర్తి పొందాల్సిందే ..

మా కుటుంబంతో ఐలయ్య కుటుంబానికి మొదటి నుంచి సాన్నిహిత్యం ఉంది. ఐలయ్య అంధుడిగా ఉండటంతో అతడి బాధ చూసిన తర్వాత అంధుల పాఠశాలలో చేర్పించి విద్యనందించాలని అనుకున్నా. నా కృషికి తోడు ఐలయ్య పట్టుదల మూలంగా ఆయన విద్యాభ్యాసం సాఫీగా సాగింది. కృషికి తగిన ప్రతిఫలం నేడు ఫలించడంతో నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. తల్లిదండ్రులు అంధుడై ఎందుకూ పనికి రాడనుకున్న కుమారుడు అక్షర జ్ఞానంతో విద్యావంతుడు కావడం, ఉద్యోగం సంపాదించడంతో ఐల య్య కుటుంబంలో సంతోషం అలుముకున్నది. ఐలయ్యను చూసి మిగతా వారు స్ఫూర్తి పొందాల్సిందే.
-శరత్‌ చందన్‌రావు, గురువు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement