
పరిసర ప్రాంతాల ప్రజలకు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యా నిలయంగా మరింది. ఎంతో మందిని
ఉన్నత స్థాయిలో నిలిపిన ఈ కళాశాలకు మరో అరుదైన అవకాశం దక్కింది. దాదాపు 65 సంవత్సరాల చరిత్ర కలిగిన సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంత్రి హరీశ్‌రావు చొరవతో నాడు ప్రతిష్టాత్మకమైన
అటానమస్ హోదా దక్కింది. అదే విధంగా ఈ కళాశాలకు కొత్తగా మూడు పీజీ కోర్సులు మంజూరయ్యాయి. మంజూరైన కోర్సుల్లో ఎంకాం, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ పొలిటికల్ సైన్స్ కోర్సులు ఉన్నాయి. ఈ మేరకు కమిషనరేట్ కాలేజీ ఎడ్యుకేషన్ వారు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కేంద్రంలో ఇలాంటి కోర్సులు లేకపోవడంతో యూనివర్సిటీలకు వెళ్లలేని గ్రామీణ
విద్యార్థులకు ఎంతో లబ్ధి చేకూరనున్నది.
గ్రామీణ పేద విద్యార్థులకు వరం..
సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదివే విద్యార్థులంతా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారే. ముఖ్యంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ విద్యార్థుల ఎన్రోల్మెంట్ మూడు సంవత్సరాలుగా గణనీయంగా పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం పీజీ కోర్సులను పెంచుతూ వస్తున్నది. ఇందులో భాగంగానే సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్న విద్యార్థుల వసతి గృహ సౌకర్యం, మౌలిక వసతులు, విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ను ఆధారంగా కొత్త పీజీ కోర్సులను ప్రవేశపెట్టింది. గతంలో ఉన్న ఎంఏ తెలుగు, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎం.ఎస్సీ కెమిస్ట్రీ, ఎం.ఎస్సీ బాటనీ, ఎం.ఎస్సీ జువాలజీ, ఎం.ఎస్సీ ఫిషరీస్ కోర్సులను కొనసాగిస్తూ.. మరో మూడు కొత్త కోర్సులు ఎం.కాం, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ పొలిటికల్ సైన్స్ ప్రవేశపెట్టింది. ఈ కోర్సుల్లో ప్రతి సబ్జెక్టులో 60 సీట్ల ను మంజూరు చేస్తూ కమిషనరేట్ ఆఫ్ కాలేజీ ఎడ్యుకేషన్ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది.
కోర్సుల నిర్వహణకు పకడ్బందీ చర్యలు..
సంబంధిత యూనివర్సిటీ సహకారంతో పీజీ కోర్సులను సజావుగా నిర్వహించాలని కమినరేట్ కాలేజీ ఎడ్యుకేషన్, తెలంగాణ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ను ఆదేశించింది. ఇందుకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. తప్పకుండా ప్రతి కోర్సులో 60 మంది విద్యార్థులు ఉండటంతో పాటు పీజీ విద్యార్థుల హాజరుశాతాన్ని బయోమెట్రిక్‌తో లింక్ చేయాలంది. గెస్ట్ లెక్చరర్ల హాజరు శాతం సైతం బయోమెట్రిక్ చేయాలని సూచించింది. అండర్ గ్రాడ్యుయేషన్ బోధించే లెక్చరర్లను పీజీ తరగతులు బోధించేందుకు ఉపయోగించుకోవాలని తెలిపింది. కళాశాలకు సంబంధించి మౌలిక సదుపాయల కల్పనలో స్థానిక కలెక్టర్, ఎమ్మెల్యేల సహకారం తీసుకోవాలని ప్రిన్సిపాల్‌కు సూచించింది.
కార్పొరేట స్థాయిలో సౌకర్యాలు..
సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల అనగానే ఎంతో మంది పేరుగాంచిన నాయకులు గుర్తుకు వస్తారు. స్వయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనే చదువుకోవడం విశేషం. అయితే ఈ కళాశాల మీద ఉన్న అభిమానంతో మంత్రి హరీశ్‌రావు కార్పొరేట్ స్థాయిలో సకల సౌకర్యాలు కల్పించారు. కళాశాల అభివృద్ధికి దోహదం చేసే న్యాక్ గుర్తింపు వచ్చేలా చర్య లు తీసుకున్నారు. కళాశాలలో అదనపు తరగతి గదుల కోసం నిధులు మంజూరు చేయించడంతో పాటు, హాస్టల్ నిర్మాణం సైతం చేపట్టారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులతో పీజీ విద్యార్థులకు నిత్యం తరగతులు నిర్వహిస్తున్నారు .
పేద విద్యార్థులకు మంచి అవకాశం
సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని చాలా మంది గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు పీజీ కోర్సులు ఎంతగానో ఉపయోగపడుతాయి. ఎం.కాం, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ పొలిటికల్ సైన్స్ కోర్సులకు చాలా డిమాండ్ ఉంది. చాలా రోజులుగా ఈ కోర్సులు డిగ్రీ కళాశాలలో నిర్వహించాలని చాలా మంది విన్నవించారు. విద్యాశాఖ వారితో విన్నవించి కొత్తగా మూడు పీజీ కోర్సులు మంజూరు చేయించా. ఇతర ప్రాంతాలకు వెళ్లలేని పేద విద్యార్థులు ఇక్కడే ఉన్నత విద్య చదువుకోవచ్చు.