
రిజర్వాయర్లు, చెరువులు, వాగుల వద్ద జాగ్రత్త
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు
నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు తప్పదు ముప్పు
నిండుగా, ఉధృతంగా ప్రవహిస్తున్న జలవనరులు
మళ్లీ వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు
వాగులు, చెరువులు, రిజర్వాయర్ల వద్ద పెరుగుతున్న సందర్శకులు
నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు తప్పదు ముప్పు
వీకెండ్లో కుటుంబం, స్నేహితులతో కలిసి ప్రకృతిని ఆస్వాదించడం కంటే గొప్ప అనుభూతి మరొకటి ఉండదు. పర్యాటక ప్రాంత సందర్శనలో నిర్లక్ష్యం తగదు.. ప్రస్తుతం వర్షాలు మళ్లీ మొదలైనందున నీళ్లు ఉన్న ప్రాంతాల్లో అలుగుపారుతున్న దృశ్యాలు చూడడం.. సెల్ఫీలు దిగడం.. చేపలు పట్ట డం.. ఈత కొట్టడంలాంటివి చేయడంతో ప్రమాదం పొంచి ఉంది. ఏ మాత్రం నిర్ల క్ష్యం చేసినా, భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది.. అందుకే నీళ్ల దగ్గర పర్యటనకు వెళ్లే జరపైలం..
సిద్దిపేట, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రిజర్వాయర్లు, వాగులు, చెరువుల వద్ద సందర్శకుల తాకిడి రోజురోజుకూ పెరుగుతున్నది. నీటితో చెలగాటం ఆడితే ప్రాణాలకే ముప్పు. చెరువులు, వాగుల వద్ద జాగ్రత్తలు పాటించాలి. ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండేండ్ల నుంచి భారీ వర్షాలు కురవడంతో చెరువులు, కుంటలు నిండాయి. ఈ యేడాది జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో వాగులు, చెరువులు, చెక్‌డ్యాంలు, కుంటలు నిండాయి. జూలైలో బాగా వర్షాలు కురిశాయి. 20 రోజుల పాటు వర్షాలు ముఖం చాటేసి, మళ్లీ వారం రోజల నుంచి జిల్లాలో వర్షాలు పడుతుండడంతో వాగు లు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో సుమారుగా 7,622 చెరువులు ఉన్నాయి. వీటిలో వంద ఎకరాల ఆయకట్టు పైబడిన చెరువులు 679 వరకు ఉంటాయి. ఆయా జిల్లాలో ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టేలా విరివిగా చెక్‌డ్యాంలు నిర్మించారు. ఈయేడాది ఇప్పటి వరకు 60 శాతానికి పైగా చెరువులు నిండాయి. దీనికి తోడుగా జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రిజర్వాయర్లు నిండుకుండలా మారా యి. అన్నపూర్ణ, రంగనాయక, కొండపోచమ్మ, శనిగరం మధ్యతరహా ప్రాజెక్టు, హల్దీవాగు, కూడవెల్లి వాగులతో పాటు మోయతుమ్మెద వాగు, వనదుర్గ ఘనపురం ఆనకట్ట, సింగూరు ప్రాజెక్టులు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలోని ప్రధాన రిజర్వాయర్లు నిండి ఉన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న రిజర్వాయర్లు, వాగులు, చెరువుల వద్ద నిత్యం సందర్శకుల తాకిడి పెరుగుతున్నది. శని, ఆదివారాల్లో కుటుంబ సభ్యులతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడి వచ్చి ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. ప్రాజెక్టులు, చెరువులు, డ్యాంలు, వాగుల వద్ద సెల్ఫీలు దిగడం, చేపల పట్టడం, అలుగు పారుతున్న దృశ్యాలను చిత్రీకరించడం, వాగుల నీటి ప్రవాహాన్ని తిలకించే సమయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్న ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఇలాం టి పలు సంఘటనలు చోటు చేసుకున్నాయి.
తగు జాగ్రత్తలు తీసుకోవాలి..
రిజర్వాయర్లు, ప్రధాన కాల్వలు, చెరువులు, చెక్‌డ్యాంల వద్ద సందర్శకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. గతే డాది మోయ తుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో బ్రిడ్జి దాటుతున్న క్రమంలో కోహెడ మండలంలోని బస్వాపూర్ వద్ద లారీ కొట్టుకు పోయింది. ఈ సంఘటనలో లారీ క్లీనర్ దాదాపు 12 గంటలకు పైగా మృత్యువుతో పోరాడి చివరకు నీటి ప్రవాహం లో గల్లంతయ్యాడు. అదే మండలంలో గతేడాది చెరువులో ఇద్దరు పిల్లలు పడి చనిపోయారు. రంగనాయక సాగర్ రిజర్వాయర్లలో సెల్ఫీ దిగుతుండగా అందులో పడి పోయి ఓ ఉద్యోగి, రిజర్వాయర్ ప్రధాన కాల్వ లోతు తెలియక అందులో ఈతకు వెళ్లి ఇద్దరు చనిపోయారు. ఇలాంటి సమయాల్లో తగు జాగ్రత్తలు సందర్శకులు తగు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నీటిలోతు, నీటి అంతు తెల్వకుండా ఏ పని చేయరాదు. నీటిప్రవాహం అధికంగా ఉన్న సమయాల్లో అటు వైపుగా పోరాదు. దగ్గర నుంచి కాకుండా దూరం నుంచి నీటి ప్రవాహాన్ని చూడాలి. ప్రమాదం ఉన్నదని తెలిసి కూడా కొంత మంది సెల్ఫీలు తీసుకుంటారు. ఇటువంటి సమయాల్లో తగు జాగ్రత్తగా ఉండాలి. ప్రధాన కాల్వలు, చెరువులు ఎంత లోతు ఉన్నాయో తెలువదు. ఇది గమనించకుండానే దిగుతుంటారు. అలా చేయొద్దు. కాల్వలు, వాగులపై నుంచి దాటేటప్పు నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయాల్లో దాటరాదు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయాల్లో రిజర్వాయర్లు, వంతెనలు, బండ రాళ్లపైకి ఎక్కి, సెల్ఫీలు దిగుతారు. మరికొంత మంది వంతెన అంచున నిలబడి సెల్ఫీలు దిగుతుంటారు. గతంలో ఇలా చేయడం వల్ల ప్రమాదాలు జరిగాయి. రిజర్వాయర్లు, చెరువులు, వాగుల వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రదేశాల నుంచే నీటి ప్రవాహాన్ని చూడాలి. వాగులు, చెరువులు, కుంటల్లో అజాగ్రత్తగా చేపలు పట్టవద్దు.