
కరోనా మహమ్మారి కారణంగా వరుసగా రెండో ఏడాది పాఠశాలల్లో ఆన్లైన్ తరగతుల బోధన జరుగుతున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహణ అత్యంత పకడ్బందీగా కొనసాగుతుండటంతో పాటు విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు విద్యాశాఖ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నది. అయితే, విద్యార్థులు ఎంత మేరకు పాఠాలు శ్రద్ధగా వింటున్నారు? అని ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నది. విద్యార్థులు, తల్లిదండ్రులకు ఆన్లైన్ క్లాసులపై దిశానిర్దేశం చేస్తున్నది. సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో 1940 పాఠశాలల్లో ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తుండగా, ఆయా జిల్లాల్లో 1,35,938 మంది విద్యార్థులు పాఠాలు వింటున్నారు. వీరి కోసం 6523 వాట్సాప్ గ్రూప్లు క్రియేట్ చేసి, బోధిస్తున్నారు.
సిద్దిపేట అర్బన్/మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 18 : కరోనా మహమ్మారి కారణంగా వరుసగా రెండో ఏడాది పాఠశాలలు తెరుచుకోక ఆన్లైన్ క్లాసుల ద్వారానే విద్యార్థులు పాఠాలు వింటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు వారి అనుకూలతను బట్టి వివిధ మాధ్యమాల ద్వారా పాఠాలు వింటున్నారు. విద్యార్థుల కోసం దూరదర్శన్ చానల్, టీశాట్ యాప్ ద్వారా ఆన్లైన్ క్లాసులు, వివిధ యూట్యూబ్ చానళ్ల ద్వారా క్లాసులు వింటున్నారు. సిద్దిపేట జిల్లాలో 1016 ప్రభుత్వ పాఠశాలల్లో 86,133 మంది విద్యార్థులు ఉన్నారు. అందులో 44,228 మంది విద్యార్థులు దూరదర్శన్, టీశాట్ ద్వారా డిజిటల్ పాఠాలను వింటున్నారు. స్మార్ట్ ఫోన్లు, లాప్టాప్లు, కంప్యూటర్ల ద్వారా 16,951 మంది విద్యార్థులు పాఠాలు విం టుండగా, 29,810 మంది విద్యార్థులు అటు టీవీల ద్వారా, స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న మాధ్యమాల ద్వారా పాఠాలు వింటున్నారు. ఇప్పటివరకు దాదాపు 95 శాతం మంది విద్యార్థులు టీశాట్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని పాఠాలు వింటున్నారు.
సిద్దిపేట జిల్లాలో ప్రతిరోజూ సుమారుగా 2749 మంది ఉపాధ్యాయులు ఫోన్ల ద్వారా విద్యార్థులను పర్యవేక్షిస్తుండగా, 903 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది ప్రత్యక్షంగా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారు. అయితే ఎలాంటి డిజిటల్ సౌకర్యం లేని విద్యార్థులను మరో విద్యార్థి వద్ద చేర్చడమో, గ్రామ పంచాయతీలో ఉన్న టీవీ ద్వారా పాఠాలు వినేటట్లు ఏర్పాట్లు చేశారు. సిద్దిపేట జిల్లాలో 1142 మంది ఏ డిజిటల్ సౌకర్యం లేని విద్యార్థులను గుర్తించగా, అందులో 892 మంది విద్యార్థులను తోటి విద్యార్థుల వద్ద పాఠాలు వినేలా ఏర్పాట్లు చేయగా, మరో 250 మంది విద్యార్థులను తమ గ్రామ పంచాయతీలోని టీవీ ద్వారా పాఠాలు వినేందుకు ఏర్పాట్లు చేశారు. అంతే కాకుండా కొంత మంది ఉపాధ్యాయులే ప్రత్యక్షంగా విద్యార్థులను కలిసి పాఠాలు బోధిస్తున్నారు. అంతే కాకుండా విద్యార్థుల, తల్లిదండ్రుల సందేహాలు నివృత్తి చేసేందుకు ఆయా మండలాల్లో అధికారులు దాదాపు 3,102 వాట్సాప్ గ్రూప్లు క్రియేట్ చేసి వారికి అందుబాటులో ఉంటున్నారు.
మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 18 : మెదక్ జిల్లాలో డిజిటల్ తరగతులకు హాజరవుతున్న విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. జిల్లావ్యాప్తంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 924 ఉన్నాయి. ఇందులో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 67, 649 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రభు త్వం వివిధ మాధ్యమాల ద్వారా విద్యార్థులకు డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నది. ప్రతిరోజూ డిజిటల్ విధానంలో కొనసాగుతున్న విద్యాబోధనకు హాజరవుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది. ఈ నెల 16న అత్యధికంగా 49,805(73.62శాతం) మంది విద్యార్థులు డిజిటల్ తరగతులు వీక్షించినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. జూలై 1 నుంచి డిజిటల్ తరగతులు ప్రారంభమవగా, తొలి రోజు 45,233 మంది విద్యార్థులు ఆన్లైన్ తరగతులు విన్నారు. జూలై 1 నుంచి ఇప్పటివరకు సరాసరిగా 73.62 శాతం విద్యార్థులు డిజిటల్ తరగతులు వింటున్నారు. ఈనెల 16న డీడీ యాదగిరి, టీశాట్, ఇతర టీవీల చానళ్ల ద్వారా నిర్వహించిన డిజిటల్ తరగతులకు 32,158 మంది విద్యార్థులు హాజరుకాగా, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్ల ద్వారా 14,681మంది విద్యార్థులు తరగతులు వీక్షించారు. జిల్లా పరిధిలో టీశాట్ యాప్ను 18,547మంది విద్యార్థులు డౌన్లోడ్ చేసుకున్నారు. మరోవైపు విద్యార్థులు డిజిటల్ తరగతులకు హాజరవుతున్నారా..? లేదా..? పరిశీలనకు విద్యాశాఖ వివిధ మార్గాల ద్వారా పర్యవేక్షిస్తున్నది. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు నేరుగా ఇప్పటివరకు ఫోన్ ద్వారా 2,772 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి తెలుసుకున్నారు. మరోవైపు ఉపాధ్యాయులు నేరుగా విద్యార్థుల ఇండ్లకు వెళ్లి డిజిటల్ తరగతులకు విద్యార్థులు హాజరును పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు 787 మంది విద్యార్థుల ఇండ్లకు వెళ్లి పరిశీలించారు. టీవీలు, స్మార్ట్ఫోన్లు లేని విద్యార్థులు తమ పక్కనే ఉన్న తోటి విద్యార్థుల ఇండ్లలోని టీవీల్లో 3,376 మంది విద్యార్థులు డిజిటల్ తరగతులు వింటున్నారు. అంతేగాకుండా గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన టీవీల్లో సైతం విద్యార్థులు డిజిటల్ తరగతులు వీక్షిస్తున్నారు.
విద్యార్థులు డిజిటల్ తరగతులకు హాజరయ్యేలా అవసరమైన సూచనలు చేసేందుకు ఏ తరగతికి సంబంధించిన ఏ పాఠ్యాంశాలు.. ఏ సమయంలో ప్రసారమవుతాయనేది విద్యార్థులకు తెలియజేసేందుకు ప్రత్యేకంగా వాట్సా ప్ గ్రూపులను ఏర్పాటు చేశారు. 3 నుంచి 10వ తరగతి వరకు జిల్లా వ్యాప్తంగా 3,421 గ్రూపులను ఏర్పా టు చేశారు. ఈ వాట్సాప్ గ్రూపుల్లో ఏ తరగతికి సంబంధించిన.. ఏ పాఠ్యాంశంలోని ఏ పాఠం ఎప్పుడు బోధిస్తారనేది సంబంధిత ఉపాధ్యాయులు తెలియజేస్తారు.
విద్యార్థులు డిజిటల్ పాఠా లు వినేలా చర్యలు తీ సుకుంటున్నాం. ఉపాధ్యాయులు విద్యార్థుల ఇండ్లకు వెళ్లి పరిశీలిస్తున్నాం. వాట్సాప్ గ్రూపుల్లో పాఠాలను అప్లోడ్ చేస్తున్నాం. విద్యార్థుల సందేహాలను అడిగి తెలుసుకుంటున్నాం. ఏ పాఠం ఎప్పుడు బోధిస్తారనేది సంబంధిత ఉపాధ్యాయులు వాట్సాప్ గ్రూపుల్లో తెలియజేస్తున్నారు. పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాం. పకడ్బందీగా డిజిటల్ తరగతుల నిర్వహణ కొనసాగడంతో విద్యార్థుల హాజరు శాతం పెరుగుతున్నది.