
సిద్దిపేట/ గజ్వేల్ అర్బన్/ వర్గల్/ న్యాల్కల్/ ఝరాసంగం/ రాయికోడ్/ నిజాంపేట/ రామాయంపేట/ ఆగస్టు 17 : కాలం ఆరంభంలోనే దంచికొట్టిన వానలు.. కొన్ని రోజులుగా నెమ్మదించాయి. దీంతో రైతులు సాగు చేసిన పంటలకు తడులతో నీరు అందిస్తున్న సమయంలో రెండు రోజులుగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మోస్తరు వానలు పడడంతో పత్తికి ప్రాణం పోశాయి. ఇతర పంటలకు సైతం ఊతమిచ్చేలా వానలు పడుతున్నాయి. ఇదివరకే నిండుకున్న నీటి వనరులు సోమ, మంగళవారం పడ్డ ముసురుకు చెరువులు, కుంటల్లో వరద నీరు చేరుతున్నది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో సరాసరిగా 1.48 సె.మీ వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా చూస్తే నారాయణరావుపేట అత్యధికంగా 5.58 సె.మీ నమోదు కాగా, అత్యల్పంగా 0.005 సె.మీ అక్కన్నపేట మండలంలో నమోదైంది. దుబ్బాకలో 0.92 సె.మీ, సిద్దిపేట రూరల్‌లో 5.33 సె.మీ చిన్నకోడూరులో 2.72 సె.మీ, బెజ్జంకిలో 1.53 సె.మీ, కోహెడలో 1.63 సె.మీ, హుస్నాబాద్‌లో 0.80 సె.మీ, నంగునూరులో 0.67 సె.మీ, సిద్దిపేట అర్బన్‌లో 3.41 సె.మీ, తొగుటలో 0.49 సె.మీ, మిరుదొడ్డిలో 0.99 సె.మీ, దౌల్తాబాద్‌లో 1.34 సె.మీ, రాయిపోల్‌లో 0.73 సె.మీ, వర్గల్లో 0.12 సె.మీ, ములుగులో 0.13 సె.మీ, మర్కూక్‌లో 0.13 సె.మీ, జగదేవ్‌పూర్‌లో 0.29 సె.మీ, గజ్వేల్‌లో 0.60 సె.మీ, కొండపాకలో 1.35 సె.మీ, కొమురవెల్లిలో 3.75 సె.మీ, చేర్యాలలో 0.99 సె.మీ, మద్దూరులో 0.25 సె.మీ, ధూళిమిట్టలో 1.60 సె.మీ వర్షపాతం నమోదైంది. కాగా, వర్గల్‌లోని నాచగిరిక్షేత్రం వద్ద గల హల్దీవాగు నిండి మత్తడి దూకుతున్నది.
న్యాల్కల్ మండల వ్యాప్తంగా మోస్తరు వర్షం కురిసింది. దీంతో సాగు చేసిన పంటలు వాడిపోతాయేమోనని రైతులు ఆందోళన చెందుతున్న సమయంలో మళ్లీ వర్షం పడడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాటు మండల వ్యాప్తంగా కురుస్తున్న వర్షానికి చిన్న చిన్న కుంటల్లో, చెక్‌డ్యామ్‌లో వరద నీరు చేరుతున్నాయి. రాయికోడ్ పరిధిలోని ఆయా గ్రామాల్లో వర్షం కురిసింది. దీంతో రైతులు సాగు చేసిన పంటలకు జీవం పోసినట్లయింది.
నిజాంపేట మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో అన్నదాతలు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. వరిపంటలో కలుపు తీయుట, ఎరువులు పిచికారీ చేస్తున్నారు. మండల వ్యాప్తంగా 1.1 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. రామాయంపేట, కొల్చారం మండలాల్లో కొన్ని రోజులుగా వర్షం పడకపోవడంతో మొక్కజొన్న పంటలు ఇక చేతికి రావనుకున్న అన్నదాతలు సోమ, మంగళవారం కురిసి వర్షానికి ఊపిరి పీల్చుకున్నారు.