
“20 ఏండ్ల కిందట నేను సిద్దిపేటకు ఎమ్మెల్యేగా ఉన్నాను. రసమయి బాలకిషన్ అప్పుడే కళామతల్లి సేవలో ఉన్నాడు. అప్పుడే జానపద పాటలు పాడిండు. అప్పుడే సిద్దిపేట నుంచి ‘దళిత చైతన్య జ్యోతి’ అని ఒక కార్యక్రమం పెట్టాను. నేను ఎమ్మెల్యే అయితే ఒక దళితజాతి బిడ్డను మార్కెట్ కమిటీ చైర్మన్ చేయాలనుకున్నాను. ఎమ్మెల్యే కాగానే, నా క్లాస్మేట్ దానయ్యను మార్కెట్ కమిటీ చైర్మన్‌గా చేశాను” అని హుజూరాబాద్‌లో సభలో సీఎం కేసీఆర్ అన్నారు.
సిద్దిపేట, ఆగస్టు 16 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దళితబంధు కార్యక్రమం ఇవాళ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. సీఎం కేసీఆర్ నాడు సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ‘దళిత చైతన్యజ్యోతి’ కార్యక్రమాన్ని చేపట్టారు. సుమారు 24 ఏండ్ల కిందట సిద్దిపేట నియోజకవర్గంలోని నంగునూరు మండలం మగ్దుంపూర్, చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామాలతో పాటు దుబ్బాక మండలం రాజక్కపేట, ఎల్లాపూర్ గ్రామాల్లోని దళిత చైతన్య కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రస్తుతం రాజక్కపేట, ఎల్లాపూర్ గ్రామాలు దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నాయి. దళిత చైతన్యజ్యోతి కార్యక్రమం ఉద్దేశాలను ఆనాడే కేసీఆర్ వారికి వివరించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మోడల్‌గా తీసుకున్న గ్రామాల్లోని దళితవాడల్లో అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించారు. అందరూ సంఘటితంగా ఉంటే ఏదైనా సాధించొచ్చని చెప్పారు. దళితుల అభ్యున్నతికీ మోడల్‌గా తీసుకున్న గ్రామాల్లో వారికి ట్రాక్టర్లు ఇప్పించారు. ఏ పనైనా సామూహికంగా చేసుకోవాలని సూచించారు. సామూహిక వ్యవసాయ బావుల తవ్వకం కోసం క్రేన్లు కూడా ఇప్పించారు. ఇండ్లు కట్టుకునేలా ప్రోత్సహించారు. వాడల అభివృద్ధికి కృషి చేశారు. శ్రమదానాలు చేసి రోడ్లు వేసుకున్నారు. ఇలా ఎన్నో పనులు అప్పట్లో చేపట్టారు. నాటి ‘దళిత చైతన్యజ్యోతి’ కార్యక్రమ స్ఫూర్తితోనే ఇవాళ ‘దళితబంధు’ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. ప్రతి దళిత కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయం ప్రభుత్వం అందజేస్తున్నది. దళితవాడల్లో మౌలిక వసతుల కల్పనకు ఇప్పటికే సర్వే నిర్వహించి నివేదికలను సైతం ప్రభుత్వం సిద్ధం చేయిస్తున్నది. అన్ని నియోజకవర్గాల్లో దళితుల గుర్తింపునకు ప్రత్యేక కార్యాచరణను ప్రభుత్వం రూపొందించింది. ఆ దిశగా అధికారులు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో దళితబంధు పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉమ్మడి మెదక్ జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, దళిత నాయకులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. సిద్దిపేట మీదుగా హుస్నాబాద్ నుంచి హుజూరాబాద్ సభకు వెళ్లారు. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు పొంగిపొర్లాయి. సిద్దిపేట -హన్మకొండ రహదారిపై బస్వాపూర్ వద్ద మోయతుమ్మెద వాగు పొంగి పొర్లడంతో వాహనాల రాకపోకలను మళ్లించారు. రాంపూర్ క్రాస్ రోడ్డు నుంచి నంగునూరు, గట్లమల్యాల మీదుగా నాగసముద్రాల నుంచి హుస్నాబాద్ నుంచి హుజూరాబాద్‌కు వెళ్లారు. కాగా, దళితబంధును హర్షిస్తూ పలుచోట్ల సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు చిత్రపటాలకు పాలతో అభిషేకాలు చేశారు.