
గోవింద నామస్మరణతో మార్మోగిన దుబ్బాక పురవీధులు
మహిళల కోలాటాలు, కళాకారుల నృత్యాలు
దుబ్బాక పురవీధుల్లో కన్నుల పండువగా శ్రీవారి రథయాత్ర..
గోవిందా.. గోవిందా సంకీర్తనలు
దుబ్బాక, ఆగస్టు 15 : దుబ్బాకలో బాలాజీ దేవాలయ ప్రారంభోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలో నూతనంగా నిర్మించిన ఆలయాన్ని చూసేందుకు భక్తులు ఉదయం నుంచి బారులు తీరారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలు ఈనెల 20 వరకు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని పూలు, విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. శ్రీవారి శోభాయాత్ర ఆలయం నుంచి ప్రారంభమై బైపాస్ రోడ్డు, తెలంగాణ తల్లి చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా నుంచి పురవీధుల గుండా కొనసాగింది. ఈ శోభాయాత్రలో స్వామివారిని దర్శించుకునేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. మహిళలు స్వామివారికి మంగళహారతులతో స్వాగతం పలికారు. శోభయాత్రలో వికాస తరంగణి మహిళలు కోలాట నృత్యాలు, విద్యార్థినుల బోనాల నృత్యాలు ఆకట్టుకున్నాయి. యువత నృత్యాలు, గోవింద నామ సంకీర్తనాలతో కనుల పండుగగా శోభాయాత్ర కొనసాగింది. వేడుకల్లో ఎమ్మెల్యేతోపాటు టీఆర్ఎస్ నాయకులు, దేవాలయ ట్రస్టు చైర్మన్ శ్రీధర్, సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.