
సిద్దిపేట, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ రైతు రుణమాఫీకి నిర్ణయం తీసుకోవడంతో రైతులోకంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రూ.50 వేలలోపు రైతుల పంట రుణాలు నేటి నుంచి మాఫీ కానున్నాయి. ఈ ప్రక్రియ నెలాఖరు వరకు కొనసాగనున్నది. గత శాసనసభ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 2018 డిసెంబర్ 11 నాటికి పంట రుణాలు తీసుకున్న రైతులందరికీ లక్ష రూపాయల చొప్పున రుణమాఫీ చేస్తానని ప్రభుత్వం చెప్పింది. ఇందులో భాగంగా లక్ష రూపాయల రుణాన్ని నాలుగు విడుతలుగా ప్రభుత్వం మాఫీ చేస్తున్నది. గతేడాది రూ.25 లోపు వారందరివి మాఫీ చేసిన ప్రభుత్వం, తాజాగా రూ.50 వేలలోపు రుణాలు మాఫీ చేస్తున్నది. పంట రుణాలను మాఫీ చేయడంపై సీఎం కేసీఆర్‌కు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఉమ్మడి జిల్లా రైతాంగం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
అర్హత పొందిన
ఉమ్మడి మెదక్ జిల్లాలో లక్ష రూపాయలలోపు అర్హత పొందిన రైతులు 5,11,883 మంది ఉన్నారు. సిద్దిపేట జిల్లాలో 1,67,771 మందికిగాను రూ.1074.8 కోట్లు, మెదక్ జిల్లాలో 1,53,883 మంది రైతులకుగాను రూ.914.9 కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 1,90,002 మంది రైతులకుగాను రూ.1297.1 కోట్లు అవసరం అవుతాయని ప్రాథమికంగా వ్యవసాయ, ఆర్థిక శాఖలు లెక్కలు గట్టాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో లక్ష రూపాయలలోపు రైతుల రుణాలను మాఫీ చేయడానికి ప్రభుత్వంపై రూ.3,286.80 కోట్ల భారం పడనుంది. గతేడాది రూ.25 వేలలోపు ఉన్నవారివి మాఫీ చేసింది. సిద్దిపేట జిల్లాలో 20,146 మందికి రూ.27.14కోట్లు, మెదక్ జిల్లాలో 22,097 మంది రైతులకుగాను రూ.34.12 కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 20,503 మంది రైతులకుగాను రూ.30.53 కోట్లు, మొత్తంగా 62,746 మంది రైతులకు సంబంధించి 91.79 కోట్ల రుణాలను మాఫీ చేసింది.
రెండో విడుతలో భాగంగా నేటి నుంచి రూ. 50 వేలలోపు రుణాలు మాఫీ చేయనున్నారు. సిద్దిపేట జిల్లాలో 27,753 మంది రైతులకుగాను రూ.94,56కోట్లు, మెదక్ జిల్లాలో 27,002 మందికిగాను 91.91కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 29,064 మంది రైతులకు రూ.98.10 కోట్ల రుణాలు మాఫీ కానున్నాయి.