
దుబ్బాక, ఆగస్టు 14: దుబ్బాకలో ప్రారంభోత్సవానికి సిద్ధమైన బాలాజీ (వేంకటేశ్వరాలయం)లో స్వామివారికి నిర్వహించనున్న ప్రత్యేక పూజల సందర్భంగా కనకాభిషేకం కోసం రూ.11 లక్షల నాణేలు సేకరించారు. శనివారం ఆలయంలో దాతలు అందజేసిన ఈ మొత్తాన్ని వికాస తరంగణి సభ్యులు, భక్తులు లెక్కించారు. వారం రోజుల పాటు జరిగే ప్రత్యేక పూజల్లో భాగంగా స్వామివారికి జలాభిషేకం, క్షీరాభిషేకం కార్యక్రమాలతో పాటు కనకాభిషేకం నిర్వహిస్తున్నట్లు దేవాలయ ట్రస్టు చైర్మన్ వడ్లకొండ శ్రీధర్ తెలిపారు. కనకాభిషేకం కార్యక్రమంలో పాల్గొనే భక్తుల కోసం రూ.111 నాణేల ప్యాకెట్‌ను అందజేయనున్నారు. స్వామివారికి రూ.11 లక్షల నాణేలతో కనకాభిషేకం చేసేందుకు మొత్తం 9,909 మంది భక్తులు పాల్గొంటారని వివరించారు.
బాలాజీ దేవాలయాన్ని శనివారం దుబ్బాక మున్సిపల్ కమిషనర్ గణేశ్‌రెడ్డి సతీమణి చైతన్యతో కలిసి సందర్శించారు. ప్రారంభోత్సవ వేడుకలు, తదితర వాటి గురించి ట్రస్టు సభ్యులతో ఆయన చర్చించారు. ఆదివారం దుబ్బాక పట్టణంలో స్వామివారి శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై ట్రస్టు సభ్యులతో తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన మున్సిపల్ కమిషనర్ దంపతులను ట్రస్టు చైర్మన్ వడ్లకొండ శ్రీధర్, మున్సిపల్ చైర్పర్సన్ వనితారెడ్డి, కౌన్సిలర్ దేవుని లలిత, ట్రస్టు సభ్యులు సన్మానించారు.
బాలాజీ దేవాలయానికి దుబ్బాక పట్టణ కిరాణావర్తక సంఘం ప్రతినిధులు రూ.1,00,116ను విరాళంగా అందజేశారు. ట్రస్టు చైర్మన్ శ్రీధర్, సభ్యులకు కిరాణాసంఘం ప్రతినిధులు నగదును అందజేశారు.